రాయిలో దేవుని చూడు కాని దేవుని రాయిగా చూడకు
రాయిలో దేవుని చూడు కాని దేవుని రాయిగా చూడకు
“విరిగిన విగ్రహాన్ని పారేయండి, క్రొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించండి” అన్నారు అందరు.
“తప్పు! అలా చేయకూడదు” అన్నాడు శ్రీరామకృష్ణ పరమహంస. మీ ఆలుబిడ్డలలో ఒకరికి కాలు విరిగితే వాళ్ళను పారేస్తారా?” అని సూటిగా ప్రశ్నించాడు రామకృష్ణ.
దక్షిణేశ్వరంలో కాళీ దేవాలయంగాక రాధా- గోవిందులకు ఒక మందిరము, 12 శివాలయాలు ఉన్నాయి. ప్రతిరోజు పూజారులు ఈ విగ్రహాలకు క్రమం తప్పక పూజా, నైవేద్యము మొదలయినవి జరిపేవారు. ఒకరోజు ‘నందోత్సవం’ జరుగుతుంది. అది కృష్ణాష్టమి మరునాడు. రాధా-గోవింద దేవాలయం పూజారి, మధ్యాహ్నం పూజ తర్వాత గోవిందుని విగ్రహాన్ని పవళింపు సేవకోసం తీసుకొని పోతుంటే, అతడు కాలుజారి పడ్డాడు. విగ్రహం కాలు విరిగింది.
పగిలిన విగ్రహం పూజకు పనికిరాదు. ఇప్పుడేం చేయాలి? మధుర బాబుకు రాణీ రాసమయికి ఈ విషయం చెప్పారు. వారు పండితులను పిలిచి సలహా అడిగారు. పండితులు “పగిలిన విగ్రహాన్ని గంగలో వేసి క్రొత్త విగ్రహాల చేయించండి” అని తీర్పు ఇచ్చారు. మధుర బాబుకు శ్రీరామకృష్ణును అడగలేదే అని తోచింది. వెంటనే రామకృష్ణను పిలిపించి సంగతి చెప్పారు.
శ్రీ రామకృష్ణ “రాణీగారి అల్లుడికి కాలు విరిగితే ఆయన్ను వీధిలో పారేసి కొత్త అల్లుణ్ణి తెచ్చుకుంటారా? లేక వైధ్యుని పిలిపించి కాలుకు కట్టు కట్టుతారా? అదే విధంగా మనము విగ్రహాల విషయంలో కూడా ఇదే పద్దతి చేయాలి” అని అన్నారు.
విగ్రహాలు కేవలం రాళ్ళు కావు జీవం ఉన్నవే అని భావించాలి. దేవుని విగ్రహాలను ప్రతిమలగా గాక మన తల్లిదండ్రులవలె ప్రేమించి గౌరవించాలి”అని వివరించాడు. అందరూ అంగీకరించారు. వారు అంత వరకూ విగ్రహాలను ప్రతిమ గానే భావించారు కానీ దేవునిగా గుర్తించలేదు. రామకృష్ణుడే విగ్రహం కాలును అందంగా అతికించి బాగు చేశారు.
ప్రశ్నలు:
- విగ్రహం కాలు విరిగినపుడు పండితులు ఏమన్నారు.
- శ్రీ రామకృష్ణ అభిప్రాయ మేమి?
- విగ్రహాలను మనం ఏ విధంగా భావించాలి?