సత్యమే దైవము-1
సత్యమే దైవము-1
మహాపురుషుల సుగుణాలలో సత్యము ఒకటి. భగవంతుని అనుగ్రహాన్ని అందుకొనడానికి ఇది ఒక మార్గమని, చిన్ననాటి నుండి వారు నమ్మి పాటించేవారు. సత్యముపై వారికి గల దృఢ విశ్వాసముతోనే వారు పెరిగేవారు. పెద్ద అయిన తరువాత కూడా ఎన్నో విషమ సమస్యలను ధైర్య సాహసాలతో ఎదుర్కొన గలిగారు. స్వామి వివేకానంద, లోకమాన్య బాలగంగాధర తిలక్ వంటి మహానుభావుల జీవిత చరిత్రలు మనకందించే సందేశము “సత్యమే దైవము, దైవమే సత్యము.”
వివేకానందుడు విద్యార్థిగా బడిలో చదువుకొనే రోజులలో అతనిని నరేంద్రదత్ అని పిలిచేవారు. చిన్ననాటి నుండి అతడు సత్యవ్రతుడు. ధైర్య సాహసాలు కలవాడు. అందుకు అతని తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించే వారు. అటువంటివాడు వారికి కొడుకుగా పుట్టినందుకు ఎంతో గర్వించేవారు. అతడు ఎన్నడు అసత్యమాడి ఎరుగడు. పొరపాటున తానేదైనా తప్పు చేసినప్పటికి దానిని దాచి ఎరుగడు.
ఒకనాడు ఉపాధ్యాయుడు భూగోళశాస్త్రంలో ప్రశ్నలు వేస్తున్నాడు. ఒకరి తరువాత మరొకరు అడిగిన వాటికి జవాబులు చెబుతున్నారు. క్రమేపి నరేంద్రుని ప్రక్క బల్ల మీద కూర్చున్న విద్యార్థివంతు వచ్చింది. కొంచెం కష్టంతోకూడిన ప్రశ్న వేసేటప్పటికి ఆ విద్యార్థి తడుము కొంటూ సమాధానం చెప్పాడు. అతని సమాధానం విన్న ఉపాధ్యాయుడు “నీవు నేర్చుకున్నది ఇదేనా? అయితే నీవు క్లాసులో పాఠం వినడంలేదు. ఇంటి దగ్గర అసలే చదువవు. చేయి చాచు ” అని బిగ్గరగా అజ్ఞాపించి, ఉగ్రుడై బెత్తం పైకెత్తాడు.
అట్లా ఆ బెత్తం పై కెత్తాడో లేదో వెంటనే నరేంద్రుడు లేచి “అతన్ని కొట్టకండి. అతను సరిగానే చెప్పాడు” అని అన్నాడు. అక్కడి విద్యార్థులంతా విస్తుపోయారు. ఆ ఉపాధ్యాయుని కళ్ళు ఎఱ్ఱబడ్డాయి. పట్టరాని కోపంతో, ఎత్తిన బెత్తం ఎత్తినట్టే పట్టుకొని నరేంద్రుని వైపు తిరిగాడు. “నీవు నాకు భూగోళం గురించి చెబుతావా? చాచు, చెయ్యిచాచు” ఉపాధ్యాయుడు అరుస్తూ అదేపనిగా కొట్టాడు. అలా దెబ్బలు తింటూకూడా “అతను సరిగానే చెప్పాడండీ” అని అన్నాడు. అప్పటికీ ఉపాధ్యాయుడు ఆగలేదు. దెబ్బలు తింటున్న నరేంద్రుడు బాధతో ఏడుస్తూ అతివినయంగా “దయవుంచి పుస్తకం తిరగవేయ్యండి. నేను చెప్పింది నిజం” అన్నాడు.
“నిజం” అన్నమాట సూటిగా ఆ ఉపాధ్యాయుని హృదయంపై నాటుకుంది. కొట్టడం ఆపేసాడు. అయినప్పటికి నరేద్రుడే తప్పు చెబుతున్నాడని భావించి తన పుస్తకము త్రిప్పాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఉన్నపాఠం తీసి చదవడం ప్రారంభించాడు. విద్యార్థులు అంతా అతనికేసి అదేపనిగా ఆతృతగా చూస్తూన్నారు. చదువుతూ ఉన్న ఆ ఉపాధ్యాయుని ముఖ కవళికలు మారాయి. తప్పు చేసిన వానిలా తడుముకొంటున్నాడు. పాఠము పూర్తిగా చదివి తాను చేసిన తప్పును తాను తెలుసుకున్నాడు.
విద్యార్థులిద్దరిని సమీపించి పశ్చాత్తాప హృదయంతో “చేసిన తప్పుకు చింతిస్తున్నాను. నీవు చెప్పింది సరిగా అర్థం చేసుకోలేక పోయినాను. నీవు చెప్పిందే నిజము.” అన్నాడు. నరేంద్రుని పై పు తిరిగి “నాయనా! నీ ధైర్య సాహసాలకు నిన్ను తప్పక అభినందించాలి. నీ సత్యసంధతకు నేను చాలా సంతోషిస్తున్నాను. నీవు నిజంగా విద్యార్థులందరికి ఆదర్శప్రాయుడవు.” అని అభినందించాడు. అది విన్న నరేంద్రునకు బలమైన దెబ్బల వల్ల కలిగిన బాధ మాయమయింది. తన సత్యము జయించినదని అమిత ఆనందంతో ఉప్పొంగిపోయాడు. సత్యము నందు తనికి గల అభిరుచే శ్రీ రామకృష్ణ పరమహంస వద్దకు లాగుకొనిపోయింది. దైవం యొక్క అస్తిత్వాన్ని, సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రేరేపించింది. అతడు స్వామి వివేకానంద అని పేరుపొందిన తరువాత ఆ సత్యాన్ని గురించి ప్రపంచం నలుమూలలా వ్యాపింప చేయడానికి కృషి సలిపాడు. మానవుడు వివేకవంతుడై సుఖ జీవితాన్ని గడపగలడని బోధించాడు.
ప్రశ్నలు
- ఉపాధ్యాయుని కోపానికి గురియైన విద్యార్థిని కాపాడడానికి నరేంద్రునకు శక్తి సాహసాలను ప్రసాదించిందేమిటి?
- నరేంద్రుని కొట్టడం ఆ ఉపాధ్యాయుడెందుకు ఆపేసాడు?
- ఎ. నీవు ఎప్పుడైనా నిజము చెప్పడము వలన, నిన్ను కించపరచడము కాని, నిన్ను రక్షించడము కాని జరిగిందా? బి. నిజం చెప్పడంవల్ల నీకు కలిగిన ఆనందం లేక పొందిన బహుమతులతో కూడిన సన్నివేశం ఏదైనా కలదా? నీ అనుభవాన్ని విపులంగా వివరించుము.