సత్యమే దైవము III

Print Friendly, PDF & Email
సత్యమే దైవము III

కొల్హాపూర్లో ఒక బడి ఉంది. అందులో ఒక తరగతిలోని విద్యార్థులందరికి లెక్కల ఉపాధ్యాయుడు కొన్ని లెక్కలు ఇచ్చి వాళ్ళందర్ని చెయ్యమన్నాడు. కొంతసేపయ్యేసరికి, ఒకళ్ళ చెవిలో మరొకరు గొణుగుకోవడం వినిపించింది. అవి వాళ్ళకంతకు పూర్వము బోధించిన పాఠాలలోనివి కాదని, అందుచేత వాళ్ళు చెయ్యలేకపోతున్నారని అతనికి అర్ధమయింది.

Gopal's love for truth

కాని ఆ తరగతిలో తెలివైన కుర్రాళ్ళలో ఒకడైన గోపాల్ తలవంచుకుని వాటికి సమాధానాలు చకచకా వ్రాస్తూ ఉండడం ఆ ఉపాధ్యాయుడు చూశాడు. అతన్ని సమీపించి చూసేసరికి, గోపాల్ లెక్కలన్నిటిని చక్కగా చేసేశాడు. అది చూసిన ఉపాధ్యాయుడు చెప్పని లెక్కలు ఇచ్చినప్పటికి చక్కగా చేసినందుకు గోపాల్ను అభినందించాడు. “నీవు వెళ్ళి యీ తరగతిలో మొదటి స్థానంలో కూర్చో” అన్నాడు ఉపాధ్యాయుడు. గోపాల్ లేచి నిలబడి “అయ్యా! నా స్వశక్తి చేత నేను ఈ లెక్కలు సాధించలేదు. పోయిన వారం మా ఇంటికి వచ్చిన చుట్టం నాకివన్నీ చెప్పాడు. అతడు లెక్కలలో దిట్ట. అందుచేతనే నేను చెయ్యగలిగాను. నేను మీరిచ్చే మొదటి శ్రేణికి తగను” అని నిష్కర్షగా చెప్పాడు. అతని సత్యసంధతకు ఆ ఉపాధ్యాయుడెంతో ఆనందించాడు. అతనికి చెందని అర్హతను, పొగడ్తను అతను స్వీకరించనందుకు అతన్ని కొనియాడాడు.

అతడే గోపాలకృష్ణ గోఖలే. అతడొక గొప్ప సంఘ సంస్కర్త. మహాత్మాగాంధీ అంతటివాడు ఇతనిని గురువుగా భావించేవాడు. మనదేశంలో నిరుపేదలకు, ఆర్తులకు, వెనుకబడిన వారికి చాలా గొప్పసేవలు చేసే జాతీయ సేవాసంస్థ ఒకదానిని స్థాపించినది ఇతనే!

ప్రశ్నలు
  1. గోపాల్ మాటలకు ఉపాధ్యాయుడు సంతోషించాడు ఎందుకు?
  2. i) మనకు చెందని అర్హతను, పొగడ్తలను మన మెందుకు అంగీకరించరాదు? ii) నీవు అంగీకరించి ఉంటే ఏమి జరుగుతుంది
  3. సత్యమే దైవమన్న ఈ మూడు వృత్తాంతములలో నీవు నేర్చుకున్న నీతి ఏమి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *