మిడిసిపాటుకు చెంపపెట్టు
మిడిసిపాటుకు చెంపపెట్టు
గాంధీజీ ఒకసారి ఒక సమావేశానికి హాజరు కావడానికి ఇంగ్లండు బయలుదేరాడు. ఒక పెద్ద ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఓడలో ఒకచోట ఒక వ్రాతబల్ల వద్ద కూర్చొని, ఉత్తరము వ్రాస్తూ ఉన్నాడు. అందులో ప్రయాణం చేస్తున్న ఐరోపా దేశస్థుడు గాంధీజీని చూచి చిలిపితనంగా నవ్వుకొన్నాడు. ఆయన ధరించిన సాధారణమైన దుస్తులు అతనికి వింతగా అగుపించాయి.
గర్వంతో మిడిసిపడుతున్న ఆ యువకుడు తన గదిలోకి వెళ్ళి కొన్ని కాగితపు ముక్కల మీద ఏవేవో దుర్భాషలతో కూడిన వ్రాతలు వ్రాసి అవన్నీ ఒక గుండుసూదితో గుచ్చి గాంధీజీని ఏడిపిద్దామని వచ్చాడు. గావంచ కట్టి, బట్టతల, బోసినోరు వున్న ఈయన ఇంగ్లండు ప్ర్రయాణం చేయడమేమిటని అతని ఉద్దేశం. “విదేశాలకు వెళ్ళాలనే పిచ్చిని విడనాడు” అని వ్రాసిన కాగితాలకు గుండు సూది గుచ్చి తెచ్చాడు.
పట్టరాని గర్వంతో నడుస్తూ గాంధీజీ వద్దకు వచ్చాడు. తల పైకెత్తి చూసేసరికి ఆ కాగితాలు చేతికిచ్చాడు. యీసడింపుతో “ఇది చదువుకొని ఆనందించు. నీకు చాలా ఉపయోగపడతాయి. నీదగ్గరే పదిలపరచుకో” అని చెప్పి కొంత దూరం పోయి అక్కడ నిలబడి, తాను చేసిన ఘనకార్యం ప్రభావం చూసి, ఓడలోని తెల్లవారి తో కలిసి ఆనందించాలని ఎదురుచూస్తున్నాడు.
గాంధీజీ అతను వ్రాసినదంతా చదువుకొని, నిదానంగా అతని వంక చూశారు. దానికి ఉన్న సూదిని తీసుకొని అతనిచ్చిన కాగితాలన్నీ బల్ల క్రింద చెత్తబుట్టలో పడేశాడు. చిరునవ్వుతో అతనివంక చూసి “నీవు చెప్పినట్లే చేశాను. నాకుపయోగించే యీ గుండు సూది మాత్రం నా దగ్గర ఉంచుకున్నాను.” అని ధన్యవాదాలు చెప్పాడు.
ఆ సమాధానం విన్న ఐరోపా యువకునికి నోట మాట రాలేదు. అతని మిడిసిపాటుకు చెంపపెట్టు తగిలినట్లైనది. అతని కాగితాలు చదివి గాంధీజీ ఉగ్రుడవుతాడని, అది చూసి ఆనందిద్దామని ఆశించాడు. అతి సున్నితంగా గాంధీజీ అందించిన చురక అతని హృదయంలో గ్రుచ్చుకుంది. గాంధీజీ వివేకాన్ని, సంస్కారాన్ని తలచుకొంటూ అతను ఆశ్చర్యపోయాడు. గాంధీజీ నుండి నేర్చుకొన్న యీ గుణపాఠం అతని భావి జీవితాన్ని చక్కదిద్ది సరియైన యువకునిగా తయారు చెయ్యగలిగింది.
ప్రశ్నలు
- పాశ్చాత్యయువకుడు చేసిన తప్పేమిటి?
- గాంధీజీ అతనికి నేర్పిన గుణపాఠ మేమిటి?
- నిన్నొక అహంకారి సహాధ్యాయి తూలనాడితే నీవేమి చేస్తావు?