విభీషణుని శరణాగతి
విభీషణుని శరణాగతి
రావణుడు తన మంత్రులందరినీ సభా ప్రాంగణానికి పిలిచేడు. భయంతో వారందరూ రావణుని అభిప్రాయానికి మద్దతు పలికేరు. ఒక్క విభీషణుడు మాత్రం “రాముడు సాధారణ వ్యక్తి కాదు. పధ్నాలుగు భువనాల్నీ పాలించేవాడిని గాయపరచడానికీ, అడ్డుకునేందుకు నీలాంటి ఒక ఒంటరి జీవి ఏమి చెయ్యగలడు. అటువంటి దివ్య పురుషుని పట్ల ద్వేషాన్ని వదులుకో, అతని సేవకునిగా ఉండేందుకు అంగీకరించమని ప్రార్థించు. అతని భార్యను తిరిగి ఆయనకు అప్పజెప్పు. అతడి అనుగ్రహం సంపాదించుకో” అని చెప్పేడు. రావణుడు కోపించి శత్రువును పొగుడుతున్న విభీషణుడిని, సభా ప్రాంగణం నుంచి బయటకు పంపి వేయమన్నాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
సత్యమునే పలుకుము, ధర్మమునే ఆచరించుము.
(న్యాయానికి నిలబడేవాడు, దాన్ని నిర్భయంగా చెప్ప గలిగేవాడూ నిజమైన హీరో) హీరోలుగా ఉండండి – జీరోలు కాకండి
విభీషణుడు రామనామాన్ని తలుస్తూ, మహేంద్రగిరిని చేరుకోడానికి సముద్రాన్ని దాటి రాముని కలుసుకోడానికి అనుమతి కోరేడు. కాని దయామయుడైన రాముడు “ఒక వ్యక్తి ఎంత చెడ్డవాడైనా శరణాగతుడైనప్పుడు దయచూపించాలి” అని చెప్పేడు. రాముని సన్నిధికి తీసుకురాగానే విభీషణుడు రాముని పాదాలపై వాలిపోయేడు. “నేను రాక్షసుడిగా పుట్టాను. కాని రామా! నన్ను రక్షించు” అని శరణాగతుడయ్యేడు. “ఉండవలసిన శ్రేష్టతలన్నీ నీకున్నాయి. కాకపోతే ఈ దర్శనం, నన్ను స్పర్శించడం, నన్ను కలుసుకోవడం, నాతో సంభాషించే అవకాశం లభించేవి కావు నీకు” అని విభీషణునికి రాముడు అభయమిచ్చాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి: భగవంతుడు కరుణామయుడు. ప్రేమతో మనం చేసిన తప్పును ఒప్పుకుంటే, తిరిగి చెయ్యనని వాగ్దానం చేస్తే, కరుణామయుడైన భగవంతుడు ప్రేమతో మనని క్షమిస్తాడు. తన వారని ఒప్పుకుంటాడు. మనం కూడా మన స్నేహితులతో ప్రేమించే, క్షమించే వారుగా ఉండాలి.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: ప్రేమంటే ఇవ్వడం, క్షమించడం. స్వార్థమనే తీసుకోవడం, మరచిపోవడం.
గరువులు వివరించవలసినవి: స్వామి దర్శన, స్పర్శన, సంభాషణలు భక్తులని సంతోషం, ఆనందంలో ఎలా ముంచెత్తేవో, ఆ సంఘటనలను వివరించాలి.
రాముడు విభీషణుని శిరస్సు పై నీళ్ళు జల్లి, లంకకు భవిష్యత్ పరిపాలకుడిగా చేస్తానని వాగ్దానం చేసేడు. విభీషణుడిని సోదరుడిగా చూడాలని అందరికీ రాముడు చెప్పేడు. అప్పుడందరూ సాగరతీరానికి బయలుదేరేరు.