మహా పతివ్రత – గాంధారి
మహా పతివ్రత – గాంధారి
కురుక్షేత్ర మహా యుద్ధం ముగిసింది. ధృతరాష్ట్రుని పుత్రులందరు యుద్ధంలో మరణించారు. ఆ రాత్రికి రాత్రి అశ్వత్థామ ఉప పాండవులను దారుణంగా వధించాడు. ఎక్కడ చూచినా శోక దేవత తాండవిస్తున్నది. యుద్ధంలో విజయం పొందామన్న ఆనందం పాండవులకు లేదు. ఎటు చూచినా బంధుమిత్రుల మృత దేహాలు, బ్రతికినవారి హాహాకారాలు. ధృతరాష్ట్రుని తర్వాత కౌరవ వంశం లేదు. పాండవుల తర్వాత పాండవ వంశం లేదు. సామ్రాజ్యం గెలుచుకున్నారు, కాని ఆత్మీయులను పోగొట్టుకున్నారు. ఈ మృత దేహాలకు దూరంగా ఒక రధంలో కూర్చుని ఉన్నారు. పరాజితుడైన కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రుడు, ఆయన ధర్మపత్ని గాంధారి. యుద్ధంలో ఓడిపోయినా, తమ్ముని కుమారులమైన తమ ఎడల చూపించవలసిన వాత్సల్యం చూపించక పోయినా, పాండవాగ్రజుడు ధర్మరాజు విన యంగా, ధృతరాష్ట్రుని ముందు నిలబడ్డాడు. పాండవ సోదరులు అన్న వెనుక ఉన్నారు. కుంతి, ద్రౌపది, కృష్ణుడు వీరందరు మౌనంగా ఆ ప్రదేశంలోనే ఉన్నారు. ధర్మజుడు పెద తండ్రిని ప్రార్ధించాడు. “తండ్రీ! జరిగిందేదో జరిగింది. శత్రుత్వం మరిచి, మమ్మల్ని మీ కుమారులుగా భావించి మా ఇంట ఉండి మీకు సేవ చేసే భాగ్యం ప్రసాదించండి”. ధృతరాష్ట్రుడు వుట్టు గ్రుడ్డి, తాను గ్రుడ్డిది కాకపోయినా భర్తతోటిదే సర్వస్వము అని భావించిన గాంధారి కళ్ళకు గత కట్టుకొని చూపు లేకుండా చేసుకుంది. తన భర్తతో సహధర్మచారిణిగాజీవితాంతం ఈ విధంగానే గడిపింది. ఆమె ఎటువంటి భౌతిక వాంఛలు లేక మహాపతివ్రతగా, ఆధ్యాత్మిక జీవితం గడిపింది. ఆమె నోటి వెంట వచ్చిన మాట తప్పక జరిగేది.
కురుక్షేత్ర సంగ్రామం జరిగే రోజుల్లో, ప్రతి దినము దుర్యోధనుడు వచ్చి ఆశీర్వదించమని కోరినప్పుడు “ధర్మం తప్పక జయిస్తుంది నాయనా !” అనేది. యుద్ధంలో తమ వంశ నాశనం తప్పదని ఆమె అంతర్వాణి పలికింది. కృష్ణుడు రాయబారానికి వచ్చినపుడు సంధికి ఒప్పుకొనమని తన కుమారున్ని వేడుకుంది. ఆమెకు మహారాణి పదవిమీద ఏనాడు మోజులేదు. కాని తన భర్త, ధృతరాష్ట్ర చక్రవర్తి క్షేమం కొరకే భగవంతుని ఎప్పుడూ ప్రార్థించేది. తన భర్త చిత్తశుద్ధితో పాండవులను చేరదీయలేదని ఆమె బాధపడింది. ద్రౌపదికి వచ్చిన కష్టాలకు ఆమె హృదయం ద్రవించింది. కానీ తన భర్త మనస్సును మార్చలేక పోయానే అని మౌనంగా రోదించింది, అసహాయురాలై బాధ పడింది. పతివ్రతా శిరోమణి అయిన ఆమె దృష్టికి ఇతరులను భస్మం చేయగల శక్తి ఉండేది. కాని అందుకే ధర్మరాజు తనకు నమస్కరించడానికి వచ్చినప్పుడు, ప్రయత్న పూర్వ కంగా తన చూపులను నేలపై కి సారించింది. ఆ చూపులు పడి నంత మేర నేల భస్మం అయింది.
పాండవులతో, ద్రౌపదితో బాధను అణచుకొని ఎంతగ నిగ్రహంతో మాట్లాడింది. కాని భగవంతుడైన కృష్ణుని ముందు ఆ నిగ్రహం ఎందుకు? తన హృదయంలోని బాధనానంతా వెళ్ళగ్రక్కింది. “మహానుభావా? ఇది అంతా నీ లీల అని భావిస్తున్నాను. నా కోడళ్ళను చూడు, భర్తలను పోగొట్టుకొని ఎలా రోదిస్తున్నారో చూడు. పుత్రులను పోగొట్టుకున్న తల్లులతో, భర్తలను పోగొట్టుకొన్న భార్యలతో ఈ రణభూమి నిండి ఉంది. ఒకప్పుడు మహా వీరులు ఈనాడు మట్టిలో పడివున్న మృత దేహాలుగా మారిపోయారు. ప్రభూ ! ఈ జీవితానికి అర్థం ఏమిటి చెప్పు వింటాను. ఇంత ఘోర కృత్యం జరుగుతూంటే నీ కన్నులు ఏమయ్యాయి . మూసుకొని పోయాయా? ఇటువంటి నరకాన్ని ఎందుకు సృష్టించావు ? అని అడిగింది.
ఈ ఆవేదనతో కూడుకొన్న మాటలు విని కృష్ణుడు చిరునవ్వుతో “అమ్మా! గాంధారీ మహాసాధ్వివి. నీవు దుఃఖంతో హృదయాన్ని ఎందుకు నింపుకు టావు? బ్రాహ్మణ స్త్రీ తపోనిష్టులు కొనసాగించడానికి కుమారులను కం టుంది. భారం మోయడానికి, ప్రపంచానికి అమృతసమమయిన క్షీరాన్ని ఇవ్వడానికి ఆవు దూడలను కంటుంది. కార్మికులను కర్ష కులను లోకానికి అందించడానికి సామాన్య స్త్రీ పుత్రులను కంటుంది. రాజమాత తన బిడ్డలు యుద్ధంలో వీర స్వర్గాన్ని పొందడానికి కంటుంది. ఇది దుఃఖించే విషయము కాదు”. కృష్ణుని మాటను గాంధారి ప్రశాంతంగా విన్నది. ఆ మాటలలోని అర్థం గ్రహించింది. ఇంక తనకు మిగిలినదేమిటి? అని ప్రశ్నించుకుంది. వృద్ధాప్యంలో పతికి అండగా ఉండి వానప్రస్థం గడపడమే అని నిశ్చయించుకుంది. ఈ భౌతిక ప్రపంచమంతా మిధ్యగా తోచింది ఆమెకు. ఈ విధంగా మనోనిశ్చయం చేసుకొని ధృతరాష్ట్రునితో కూడి, మరణిం చిన వారికి అంత్యక్రియలు జరిపే కార్యంలో నిమగ్నమయింది గాంధారి.
ప్రశ్నలు :
- గాంధారి తన కళ్ళకు గంత ఎందుకు కట్టుకుంది?
- ఆమె కృష్ణుని ఏమి ప్రశ్నించింది?
- కృష్ణుడు ఆమెను ఎట్లు ఓదార్చాడు?