పరిచయం

Print Friendly, PDF & Email
పరిచయం

శ్రీరామకృష్ణపరమహంస పాశ్చాత్య నాగరికత భారత భూమిపైవీచుచు, భారతీయ వేదాంత తత్త్వ దర్శన దీపమును కొట్టుమిట్టాడచున్న గడ్డుదినములలో ఆ దీపమున నూనె పోసి, వత్తిని పైకెగత్రోసి మరల ఆజ్యోతి వినూత్నకాంతులతో వెలుగునట్లు చేసిన మహనీయుడు. భారతీయ మనోనేత్రమును పాశ్చాత్యులనాగరికత, భౌతికాభ్యుదయము మిరుమిట్లు కోల్పించినవి. మన సంప్రదాయములమీద, విశ్వాసముల మీద మనవారికి నమ్మకము సడలినది; నైతికస్థాయి అట్టడుగునకు దిగజారిపోయినది. హిందూమత మంతయు మూఢవిశ్వాసముల మూట అనియు, అల్పములు, నిరర్థకములైన విషయములకూటమి అనియు ప్రజలు విశ్వసింపనారంభించిరి. అట్టి క్లిష్టసమయమున రామకృష్ణుడు అవరించి హిందూమతజ్యోతిని జాజ్వల్యమానమొనర్చెను.ఆజ్యోతిని దక్షిణేశ్వర ఆవరణమునుండి వెలికితీసి భారత దేశమంతటను వ్యాపింపచేసి చీకట్లను పారద్రోలవలసియున్నది. అంతకంటెను ఆజ్యోతిని విశ్వమాన వేయస్సుకై ప్రపంచ దేశములకన్నింటికిని వ్యాప్తి చేయవలసియున్నది.

ఇట్టి మహత్తర కార్యమును నిర్వహించుటకు కార్యశూరుడైన వ్యక్తి కావలెను. అట్టివాడు రామకృష్ణపరమహంస ప్రియశిష్యుడు నరేంద్రనాథుడు. అతడే ఆ తరువాత వివేకానందునిగా విశ్వవిఖ్యాతి గాంచినారు. అతడే రామకృష్ణ పరమహంస అనుభవముద్వారా వ్యక్తీకరించిన వేదాంత మౌలిక సత్యములను విశ్వమున ప్రసారము చేసినాడు. సనాతన వేదాంత సూత్రములు రామకృష్ణపరమహంస యొక్క ఆధ్యాత్మికానుభవములను పురస్కరించుకొని అదునీక జీవితమునకు పునరన్వయించినప్పుడు మాత్రమే, భారతి దేశము కోల్పోయిన పాతవిలువలను మరల పునరుజ్జీవింపచేసికొనగల దని వివేకానందుడు ఘంటాపథముగా పలికెను. భారతదేశమప్పుడే ప్రపంచమున ఓక దివ్యసందేశమీయగలదు. వివేకానందుడు వేదాంత – తత్త్వముల గురించి అమెరికా, యూరోపుఖండములలో ఉపన్యాసముల నిచ్చుచున్నప్పుడు కూడ, భారతీయుల సత్యములను నిత్యజీవితము లందు ఆచరింపవలెనని సవినయముగా మనవి చేసెను. మతమెప్పుడును విశ్వాస ముపై ఆధారపడి యుండదు; అది అందించెడి అనుభవముపై ఆత్మ సత్యాన్వేషణముపై దానిగౌరవము నిలచియుండును. మత మనగా సత్య సాక్షాత్కారము; నిత్యసత్యానుభవము. సత్యమనగా భగవంతుడు.

వేదాంతము జీవితమున అత్యంతము ఉపయోగపడునది ఎప్పుడనగా- ఆది సామాన్యమానవాళిని ఉద్ధరించి, వారిబాధలను తొలగించినప్పుడే- అని వివేకానందుడు ఎల్లప్పుడును ప్రబోధించుచుండెను. నిజముగా అట్లు చేయుటయే వేదాంతమును, మతమును పాటించుట. వివేకానందుని దృష్టిలో ఆదర్శసమాజము అనునది భారతీయుల ఆధ్యాత్మిక సంస్కృతిని పాశ్చాత్యుల లౌకిక సంస్కృతిని, సాంఘి న్యాయమును, స్వాతంత్ర్యమును కలిపి సమన్వయించినచో ఏర్పడునది. అట్టి ఆదర్శసమాజలక్ష్యమును సాధించునిమిత్తమై ఆధ్యాత్మిక, సంఘసేవాకార్యక్రమములను రెండింటిని కలిపి నిర్వహించున ‘రామకృష్ణమిషన్’ ఆఫ్ ఇండియా”ను స్థాపించెను. అసంస్థ ఆరంభించిన నాటినుండియు గణనీయమైన అద్భుత సేవాకార్యక్రమములను నిర్వహించుచుండెను. వేదాంతము సర్వజనసాధారణమైనదనియు, విశ్వజనీనమైన తత్త్వమనియు, జీవనవిధానమనియు వివేకానందుడు ప్రబోధించుచుండుటచే, అమెరికా, యూరోపు మొదలైన పాశ్చాత్యఖండములలో అనేక వేదాంత కేంద్రములను ప్రారంభించెను. వివేకానందుడు భారత దేశమున జన్మించిన మహాపురుషులలో ఒకడు; భారతీయ సంస్కృతికి సేవచేసిన వారిలో ముఖ్యుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: