వివేకానందుని ప్రార్ధన
వివేకానందుని ప్రార్ధన
శ్రీ రామకృష్ణ పరమహంస నరేంద్రుని ఎడల ఎంతో వాత్సల్యము, ప్రేమ కలిగియుండేవారు. నరేంద్రుడు కూడా శ్రీ రామకృష్ణుని ఎడ అమిత గౌరవము, ఎనలేని ప్రేమ కలిగి యుండేవాడు. ఈ విధంగా గురుశిష్యుల మధ్య పవిత్ర ప్రేమా నుబంధము ఉన్నప్పుడే గురువు శిష్యుని భగవంతుని మార్గములో కొనిపోగలుగుతాడు. అంటే శిష్యునిలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొలుప గలుగుతాడు.
నరేంద్రుడు రామకృష్ణుని శిష్యుడైనందుకు చాలా ఆనందించాడు. అతడు దక్షిణేశ్వరము వెళ్ళి వస్తూ భగవంతుని గురించి వింటూ ఉండేవాడు. హఠాత్తుగా నరేంద్రుని తండ్రి మరణించాడు. కుటుంబ పోషణ కష్టమైంది. రెండు పూటలా తిండికే కష్టమయింది. నరేందునికి విచారం పట్టుకుంది. ఏదైనా ఉద్యోగం సంపాదించక తప్పదు అని నిశ్చయించుకున్నాడు.
సరేంద్రుడు చదువులో దిట్ట. అతడు డిగ్రీ తీసుకున్నాడు. కాని ఎక్కడా ఉద్యోగం దొరక లేదు. తీవ్రంగా ఆలోచించాడు. “నేను సంపాదించకపోతే నా చెల్లి, తమ్ముళ్ళూ, చెల్లెళ్ళు ఏమవుతారో ?” ఇంక పట్టలేక ఇదంతా తన గురువు శ్రీ రామకృష్ణునికి చెప్పుకున్నాడు. శ్రీ రామకృష్ణుడు “నరేన్! ఈ రోజు మంగళవారం. అమ్మవారిని కోరుకున్నావంటే ఆమె నీకు ఇస్తుంది” అన్నాడు.
నరేంద్రుడు సరేనన్నాడు. ఆ రోజు సాయంత్రం కాళికా దేవి గుడికి వెళ్ళాడు. తిరిగి వచ్చిన తర్వాత, రామకృష్ణుడు అడిగాడు. “అమ్మ ఏమంది?”
“అయ్యో! ఆమెను నా కోరిక అడగడం మరచి పోయాను!” అన్నాడు నరేన్.
“మరిచావా! అయితే తిరిగి వెళ్ళి అడుగు పరుగెత్తు”.
నరేంద్రుడు వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. మళ్ళీ మరిచి పోయానన్నాడు. మూడోసారి వెళ్ళి తిరిగి వచ్చినపుడు నరేన్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు.
“గురూజీ! అమ్మను డబ్బు ఎలా అడగను? ఒక చక్రవర్తి వద్దకు పోయి గుమ్మడికాయ ఇమ్మని అడగనా? ఆమెను భక్తి ఇమ్మని, స్వార్ధ రహిత ప్రేమ ఇమ్మని, ఆమెను చేరుకొనే మార్గం తెలుపమని మాత్రమే అడగగలను” అన్నాడు.
రామకృష్ణ చిరునవ్వు నవ్వి “నరేన్! సత్యం గ్రహించావు. నీ కుటుంబం ఎన్నడూ పస్తు పడుకోదు, ఆ భయం నీకు అనవసరం” అన్నాడు.
అప్పుడు నరేన్ అనుకున్నాడు. “ధన సంపాదన కోసం నేను ఎటువంటి ప్రయత్నం చేయను”.ఆ రాత్రి రామకృష్ణుడు తన ప్రియశిష్యునికి ఒక చక్కటి పాట పాడి నేర్పించాడు. ఆ రాత్రంతా నరేన్ ఆ పాట పాడుతూనే ఉన్నాడు. ప్రక్కనే రామకృష్ణ ధ్యానంలో లీనమయి ఉన్నాడు.
పశ్నలు:
- నరేంద్రుడు ఎందుకు దిగులు చెందాడు?
- రామకృష్ణుల సలహా ఏమిటి?
- నరేన్ కాళీ మాతను ఏమి కోరాలనుకున్నాడు?
- కాళికాదేవిని తాను అనుకొన్న కోరికలు ఎందుకు కోరలేదు?
- రామకృష్ణులు నరేన్ కు ఏమి చెప్పారు?