వృధా చేయుట పనికిరాదు

Print Friendly, PDF & Email
వృధా చేయుట పనికిరాదు

ప్రపంచములోని ప్రతి వస్తువు పనికివస్తుంది. ఘోర సర్పంలోని విషంకూడా ఉపయోగపడుతుంది. దానిని మందుగా మారిస్తే పాముకాటుకు గురియైన ప్రతి వ్యక్తిని బ్రతికిస్తుంది. ఈ పరమ సత్యము మన అందరికీ తెలుసు. అయినప్పటికి భోజన పదార్థాలను, ధనాన్ని, కాలాన్ని, శక్తిని వృధాచేస్తున్న వారీ లోకంలో యింకా చాలామంది వున్నారు.

ప్రతి వస్తువును తన తెలివితేటలతో అతిజాగ్రత్తగా ఉపయోగ పెట్టడమే “పొదుపు” అని పిలువబడుతుంది. ఎంతటి ధనవంతుడైనా పొదుపు నవలంభించకపోతే నిరుపేదగా తయారవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అధిక వ్యయానికి అలవాటుపడి వస్తువులను పాడుచేసే స్వభావము గలవానికంటే పొదుపుగా జీవించే నిరుపేదే ఆనందమయ జీవితాన్ని గడప గలరు.

గాంధీమహాత్ముడు అనుసరించిన పొదుపు విధానానికి, ఆయన అనుచరులెంతో ఆశ్చర్యపడేవారు. ఆ రోజుల్లో ‘సబర్మతి’ ఆశ్రమంలో కొత్తగా ఆంగ్లేయ వనిత ఒకామె చేరింది. ఆమె పేరు “మిరాబెన్”. ఒకరోజున మహాత్ముడు తన గది అంతా దేనికోసమో వెదుకుతున్నారు. వ్యాకులతతోవున్న ఆయన ముఖం చూస్తూ “బాపూజీ ! తమరు దేనికోసం వెతుకుతున్నారు? ఏమైనా పోయిందా? అని అడిగింది. “అవును. పెన్సిలు కనిపించడం లేదమ్మా!” అన్నారు. అది ఎంత పొడవుంటుంది? క్రొత్తదా? అని దానిని వెతికి పెట్టాలన్న ఉద్దేశ్యంతో అడిగింది. వెంటనే బాపూజీ, నేను వాడుతూవున్న పెన్సిలమ్మా! సరిగ్గా నీ బొటన వేలంత ఉంటుంది” అని అన్నారాయన. అది వింటున్న ఆ గదిలోని వారందరూ అంత చిన్న పెన్సిలుకోసం అంతగా కంగారుపడ్తున్న గాంధీజీని చూసి చాలా ఆశ్చర్యపోయారు.

అందులో ఒకాయన సరిక్రొత్త పెన్సిలు తెచ్చి యిచ్చాడు. అది చూచిన బాపూజీ “నేను క్రొత్త పెన్సిలు కావాలని చెప్పానా? గత మూడు వారాలుగా నేను వాడుతున్నాను. ఆ ముక్కే నాకు కావాలి” అంటూ మళ్లీ వెతకడం ప్రారంభించారు. చివరకు అది అక్కడవున్న కాగితాల కట్టలలో కనిపించింది. “దొరికింది” అంటున్న ఆయన ముఖం ఎంతో ఆనందంతో ఉప్పొంగింది. తాను ఒక మహాపరాధాన్ని చేయబోయి తప్పించుకున్న వాని లాగ ఆనందించారు.

కొన్నాళ్ళకు బాపూజీ, మిరాబెన్ ఒక గ్రామం చేరారు. బాపూజీకి భోజనానికి ముందు కొంచెం తేనె తీసుకొనే అలవాటు ఉంది. ఆశ్రమంనుంచి వాడుతున్న తేనె సీసా తీసుకురావడము మిరాబెన్ మార్చిపోయింది. అందుకు బజారు నుంచి ఒక క్రొత్త తేనెసీసా తెప్పించింది. భోజనానికి అంతా సిద్ధమయ్యారు. బాపూజీ కూర్చుంటూనే ఆ కొత్త తేనెసీసాను చూశారు. వెంటనే “మనం ఇప్పటి దాకా ఉపయోగిస్తున్న ఆ తేనెసీసా ఏమయ్యింది?” అని అడిగారు. పొరపాటున తీసుకురావడం మర్చిపోయాను బాపూజీ” అని మిరాబెన్ చెప్పింది. “అయితే నీవు క్రొత్తది కొన్నావన్నమాట” అంటూనే ఆయన ముఖము ముడుచుకు పోయింది. మనం ఖర్చుపెట్టే ప్రతి పైసా ప్రజలది. దాన్ని వృధా చెయ్యడం మంచిదిగాదు. “పాత సీసాలోని తేనె అంతా పూర్తిగా అయిపోతేగాని యీ సీసాలోని తేనెను ముట్టను” అని అనేసరికి అక్కడివారంతా విస్తుపోయారు. ఎవ్వరి నోటి నుండి మాటరాలేదు.

ఆయన అన్న ప్రకారం కొత్తసీసాలోని తేనెను త్రాగలేదు. ఆ యాత్ర పూర్తిచేసుకుని తిరిగి ఆశ్రమం చేరేదాకా అసలు తేనెతాగడమే మానేసారు. ఆశ్రమం చేరిన తర్వాత, తనకోసం తహతహలాడుతున్న పాత తేనెసీసా పూర్తిచేసిన తర్వాతనే కొత్త సీసాలోని తేనె వాడడం మొదలుపెట్టారు.

ప్రశ్నలు:
  1. పొదుపు అనగా నేమి? మన మెందుకు దానిని పాటించాలి?
  2. రూ.100/-లు బహుమతి లభించినదనుకొనుము : దానిని నీవేమి చేస్తావు?
  3. ఈ క్రింది వానిని మానవులేవిధంగా పాడుచేస్తుంటారో వివరించుము. ఒక్కొక్క దానినిగూర్చి కనీసము నాలుగు విధాల వ్రాయుము. 1.ధనము 2.కాలము 3.శక్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *