యోగక్షేమం వహామ్యహం
యోగక్షేమం వహామ్యహం
మహారాజుగారి సమక్షంలో ఒక పండితుడు గీతోపన్యాసాలు ఇస్తున్నాడు. ఒకనాడు
శ్లో॥ ‘అనన్యాశ్చింత యంతో మాం యే జనాః పర్యుపాసతే,
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం!
ఈ శ్లోకం చెప్పి, ఎంతో భక్తి తో శ్లోకంలోని భావం వివరిస్తున్నాడు. కాని వింటున్న మహారాజుగారు తల అడ్డంగా త్రిప్పి,ఈ అర్థం ‘సరిగాదు’అన్నాడు. పండితుడు ఎన్ని విధాలుగా చెప్పినా రాజుగారికి నచ్చలేదు. పండితుడు ఇంతకు ముందు ఎన్నో రాజాస్థానాల్లో అనేక పురాణాలు భగవద్గీత చెప్పి మెప్పించాడు. కాని ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. నలుగురిలో తాను చెప్పిన అర్థం ‘తప్పు’ అన్నారు రాజుగారు. ఇంతకు మించిన అవమానం ఏముంది?
అయినా ధైర్యం చిక్కబట్టుకుని ‘యోగము’, ‘క్షేమము’ ఈ పదాలకు అర్థం మళ్ళీ మళ్ళీ వివరించాడు. కాని మహారాజు ఆమోదించలేదు. “శాస్త్రీగారూ! ఈ పదాలకు అర్ధాలను మీరు ఈ రాత్రికి బాగా తెలుసుకొని రండి, మళ్ళీ రేపు సభ చేద్దాం” అని లేచి వెళ్ళిపోయాడు.
పండితునికి నిరాశ, నిస్పృహలు మిగిలాయి. అవమాన భారంతో కృంగిపోయాడు. ఎలాగో కాళ్ళీడ్చుకుంటూ ఇల్లు చేరాడు మంచం మీద కూలబడ్డాడు.
ప్రతిరోజు సన్మానాలతో అడంబరంగా ఇంటికి చేరుకొనే తన భర్త ఈ విధంగా రావడం చూచి పండితుడి భార్య ఆశ్చర్యపడింది. “ఏమిటి సంగతి” అని అడిగింది. సభలో జరిగినదంతా వివరించాడు పండితుడు. ఆమె కొంత ఆలోచించి
“రాజుగారు చెప్పింది నిజమే. మీరు ఆ పదాలకు తగిన భావం ఇవ్వలేదు. అందుకనే రాజుగారు ఒప్పుకో లేదు” అనింది.
“ఏమిటీ, నీకు కూడా అదే పిచ్చి పట్టిందా? నా పాండిత్యం ఎంత? నీ తెలివి తేటలెంత? ఏదో తెలిసిన దానివలె వాగుతున్నావే? నోరు మూసుకొని పడిఉండు” అని భార్యను గద్దించాడు.
కాని భార్య తొణకలేదు, “స్వామి! ఉన్న విషయం చెప్తే ఎందుకు మండిపడతారు? ఆశ్లోకాన్ని మళ్ళీ చదవండి. ఆ మాటల భావాన్ని కొంత దీర్ఘంగా అలోచించండి మీకే తెలుస్తుంది” అని అనునయంగా చెప్పింది. పండితుడు నిదానంగా కూర్చొని ఒక్కొక్కమాట పదేపదే తలుచుకుంటూ అర్థం విశ్లేషించ కున్నాడు. మొదట ‘అనన్యాశ్చింతయంతో మాం’ తీసుకున్నాడు. మాటిమాటికి అంటున్నాడు. భార్య మళ్ళీ వచ్చి “ఊరికే మాటలను పలుకుతూంటే ఏం లాభం? ఇప్పుడు చెప్పండి. మీరు మహారాజు వద్దకు ఎందుకు వెళ్ళుచున్నారు?
“మరి ఈ కుటుంబం ఎలా జరగాలి? నాకు, నీకు పిల్లలలకు తిండి, బట్టలు, ఎక్కడి నుండి వస్తాయి? వీటికోసమే వెళ్ళుచున్నాను”
“కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్పిందేదో మీరు గ్రహించి ఉంటే రాజుగారి వద్దకు పోవాల్సిన అవసరమే లేదు”.
“ఏమిటి నీవు మాట్లాడేది?”
అవును స్వామీ! జాగ్రత్తగా ఆలోచించండి. ఏ విధమైన ఇతర ఆలోచనలు లేక, నన్ను ఎవరైతే భక్తిగా తలుచుకుంటూ ఉంటారో, అనగా ఎప్పుడూ నాపైనే ఆలోచనలు కలిగి ఉంటారో, వారి యోగక్షేమాలు నేను భరిస్తాను. అని చెప్పాడు, కృష్ణుడు. అంటే ఆయనను పూర్తి శరణాగతి పొందినపుడు మనకు కావలసినవి సర్వము ఆయనే ఇస్తారు. మీరు శ్లోకం ఎన్నాళ్ళనుండో చదువుతున్నారు. అర్థం చెప్తున్నారు! కాని ఆచరించారా? భగవంతుణ్ణి స్మరణ చేస్తున్నారు. కాని కూడు గుడ్డల కోసం రాజుగారి వద్దకు వెళుతున్నారు? ఇది శ్లోకం భావానికి విరుద్ధం కాదా? చెప్పండి? అందుకే మీరు చెప్పింది రాజుగారికి నచ్చలేదు”.
ఇది విని ఆ మహాపండితుడు ఆలోచనలో పడ్డాడు. ఆయనకు తాను చేసిన తప్పేదో తనకు అర్ధమయింది. ఆ రాత్రి హాయిగా నిద్రించాడు. మరుసటిరోజు రాజ సభకు వెళ్ళలేదు. ఇంట్లోనే భగవంతుని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు.
రాజు శాస్త్రిగారు సభకు ఎందుకు రాలేదని అడగమని సేవకులను పంపాడు. వారు తిరిగివచ్చి పండితులవారు రాదలుచుకోలేదని చెప్పారు. రాజుగారు ఆశ్చర్యపడి ఒక అధికారిని పంపాడు. ఆ వచ్చిన అధికారికి పండితుడు ఈ విధంగా చెప్పారు.
“నేను రాజుగారి ఆస్థానానికి రానవసరం లేదు. భగవంతుని నమ్ముకున్నాను. ఆయనే నాకు అన్నీ ఇస్తాడు. ఇన్ని రోజులు ఇది తెలియక అవమానం పాలయ్యాను. కేవలం పదాల అర్ధం వివరించడానికి తంటాలు పడ్డాను.”
ఈ సందేశం విని రాజుగారు స్వయంగా శాస్త్రిగారి నివాసానికి వచ్చారు. పండితుని పాదాలపై బడి ఆయన “స్వామీ! నన్ను క్షమించండి. ఈనాడు శ్లోకం యొక్క నిజమైన భావము నాకు తెలియజేశారు”.
కాబట్టి ఆచరణ లేని ప్రచారము వ్యర్థమని రాజుగారి ద్వారా పండితుడు గుణపాఠం నేర్చుకున్నాడు.
ప్రశ్నలు:
- ఈ శ్లోకం ఎవరు ఎవరికి చెప్పారు? ఏ గ్రంధం లోనిది?
- శ్లోకం అర్ధమేమి?
- పండితుని వ్యాఖ్యానానికి రాజు ఎందుకు అంగీరించలేదు?
- ఆ శ్లోకంలోని నిజమైన భావం పండితుడు ఎలా గ్రహించాడు?