యుక్తః కర్మఫలం – వివరణ
యుక్తః కర్మఫలం – వివరణ
జ్ఞానమార్గంలో పరమాత్మను చేరటానికి నాలుగు విధములైన దశలున్నవి.
- పవిత్ర హృదయము
- జ్ఞానమును పొందుట
- కర్మఫల త్యాగము
- ఎవరైతే కర్మఫలములను త్యజింస్తారో వారు పరమ శాంతిని పొందుతారు. వారే నిజమైన యోగులు. ఎవరైతే కర్మఫలములందు ఆసక్తిని చూపుతారో, వారు కర్మ బద్ధులై, ప్రాపంచి సంబంధములలో చిక్కుకుంటారు.
భారతమునందలి దృతరాష్ట్రుడు దీనికి ఉదాహరణ. పుత్రవ్యామోహంతో బంధింపపబడినవాడు. ఒక మహారాజుగా ధర్మబద్ధంగా, నిష్పక్షపాతంగా ఉండాలి అని మరిచాడు. పూర్తిగా స్వార్థపరుడు. ఏ కర్మను ఆచరించినప్పటికిని ఏదో ఒక ఉద్దేశ్యంతో ఫలాపేక్షతో ఆచరించేవాడు.
భగవాన్ బాబా వారు ధృతరాష్ట్రుని భౌతికంగానే కాక మానసికంగా కూడా అంధునిగా వర్ణిస్తారు. పుత్ర వ్యామోహంతో వంశ వినాశనానికి కారణమయ్యాడు. మనశ్శాంతిని కోల్పోయాడు.
శాశ్వత ఆనందము, భవబంధరాహిత్యము పొందాలంటే ముందుగా కోరికలను, కర్మఫలములను త్యజించి, ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వము ఉండాలి, అనగా చేసే ప్రతి పని భగవదర్పితము చేయాలి.
సూర్యుడు మహా త్యాగి. ఒక నిమిషం అయినను తన సుఖమును, కానీ విశ్రాంతిని కానీ ఆశించక కర్తవ్య కర్మణాచరించు నిష్కామ కర్మయోగి. నిరాడంబరము గల నిగర్వి. లోకమునకు ఎవ్వరూ చేయనంతటి ఉపకారమును, క్షేమమును తాను చేయుచూ, అందించుచుండిననూ తాను ఏమీ చేయని వాని వలె నటించుచుండును. ఇట్టి కార్యములు నా వలన లోకమునకు జరుగుచున్నవి కదా! నేను లేకున్న లోకమే గతి పట్టి ఉండునో అని ఏనాడు గర్వముతో తలంచడు. ఏ విధమైన విసుగు లేక, అతి ఓపికతో లోకమును రక్షించుచున్నాడు. ఇది అతను సహజమని భావించుచున్నాడు కానీ సర్వుల కోసమని, సేవ చేయుచున్నానని భావించుట లేదు.
ఆత్మ జ్ఞాని కర్మఫలములకు బద్ధుడై ఉండడు. ఆత్మ జ్ఞానము లేక కర్మలు ఆచరించువాడు కర్మఫలములకు బద్ధుడై ఉంటాడు. జ్ఞాని ఈ సంసారం అనే సాగరమును సులభముగా దాటగలడు. ఇంద్రియములను, మనస్సును స్వాధీన పరుచుకున్న వాడే యోగి.
యోగి అయినటువంటి వాడు తనలో ఉన్నటువంటి ఆత్మయే అందరిలోనూ ఉన్నది అని భావిస్తాడు/ తెలుసుకుంటాడు. ఈశ్వర సర్వభూతానాం అని విశ్వసిస్తాడు. ప్రతి పని కూడా దైవ కార్యముగా భావిస్తాడు. ప్రాపంచిక సుఖములు పొందవలెనని కానీ అనుభవించవలెను కానీ తలంచడు. [బ్రహ్మాండమైన ఈ విశ్వమంతయు ఒక పెద్ద కర్మాగారమే. ఈ కర్మాగారమున ప్రతి మానవుడు ఏదో ఒక విధమైన ఉపాంగముల వలె ఉన్నవారలే. కనుక ఏ ఏ అంగములకు తగిన కర్మ ఆ ఉపాంగములైన మానవులకు పాలికి వచ్చును. దానిని పరమాత్మ కర్మగా భావించి చేయవలెను.] దృఢమైన శ్రద్ధ భక్తులతో, అందరి యెడల ప్రేమతో భగవంతుని యందు మనస్సును కేంద్రీకరించి శాంతిని పొందును. యోగి అయిన వాని చిత్తము గాలిలేని స్థానమున దీపం ఉండినట్లు నిశ్చలంగా ఉండి ప్రశాంతంగా ఎటువంటి ఆందోళనలకు ఒత్తిడికి గురి అవ్వకుండా, ఇతరుల సుఖదుఃఖములు తనవిగా భావించును. ఇతర హృదయములను బాధింపచేయక సర్వులనూ సర్వేశ్వర భావమున ప్రేమించును. తనలోని అహంకారపూరిత కోరికలను నిర్మూలముగావించుకొని పరమాత్మ యొక్క సంకల్పమున కనుగుణమైన ఉపకరణంగా ఉండును/ మారును.
యోగి కాని వాడు కర్మ బద్ధుడై ఉంటాడు. తనకు అనుకూలంగా కార్యములు సిద్ధింపబడినప్పుడు కోపావేశములకు లోనగును. అంతేకాక జరుగు కష్ట నష్టములకు భగవంతుడే బాధ్యుడు అని పరమాత్మను నిందించును. చేయు కర్మలను భగవంతుని కార్యముగా భావించి ఆరాధన భావముతో తన శక్తి సామర్థ్యముల మీద ఆధారపడక భగవంతుని శరణు జొచ్చి భగవత్ ప్రీత్యర్థం భగవద్ అర్పితం చేయుటమే సకర్మ యొక్క రహస్యము – బాబా.
సర్వకర్మలు చేయుచు కర్మబంధములకు చిక్కకుండుటే యోగము. కర్మఫలములను త్యజించి, ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వము ఉండాలి. అటువంటి భావనతో కర్తవ్య కర్మలను ఆచరించినప్పుడు కర్మబంధ విముక్తులవుతారు – బాబా.
చిన్న కథ
వారణాసి నగరంలో భక్త కబీర్ సాధారణంగా సంచరించు మార్గములోనున్న ఒక తోట యందు ఖాళీగా కూర్చుని ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. ఒక రోజున ఆ వ్యక్తిని మీరు ఇలా సమయాన్ని వృధా చేయక ఆధ్యాత్మిక మార్గంలో మిమ్మల్ని మీరు ఉద్ధరించు కోవడానికి పరమాత్మని చేరుకోవటానికి సాధన ఎందుకు చేయకూడదు అని అడిగాడు ? దానికి ఆ వ్యక్తి నాకు నా పిల్లలు ఇంకా చిన్నవారు, అందుకని నేను ఆధ్యాత్మిక సాధనలకు నా సమయాన్ని కేటాయించలేను వారు కొంత పెరిగి పెద్ద అయిన తర్వాత చూద్దాము అన్నాడు. పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత కబీర్ ఆ వ్యక్తిని మరల కలిసి ఇప్పటికైనా మీరు పరమాత్మ కొరకు సమయాన్ని కేటాయించగలరా అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి పిల్లలు ఇప్పుడే యుక్తవయస్కులైనారు. వారు వివాహము చేసుకొని తమ తమ బాధ్యతలను నిర్వర్తించగలిగినప్పుడు వస్తాను అన్నాడు. మరి కొంత కాలం తర్వాత కబీర్ ఆ వ్యక్తిని కలిసి ఇప్పుడు మీకు ఎటువంటి ఆటంకము ఉండకపోవచ్చు, ఎందుకంటే మీ పిల్లలు తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు కదా ఇప్పుడు మీరు మీ సమయాన్ని భగవంతుని నామస్మరణ యందు కేటాయించవచ్చు కదా అని అడిగాడు.
దానికి ఆ వ్యక్తి నేను ఇంకా నా మనమల మనవరాళ్ల వివాహమును చూడాలని ఇప్పుడు కాదు అని మరలా దాటవేశాడు. మరలా కొంతకాలమునకు కబీర్ ఏమిటి ఇప్పుడు పరిస్థితి అని అడగగా, ఆ వ్యక్తి అయ్యో ఇప్పుడు అసలు కుదరదు, నా మనమలు బాధ్యతారహితంగా ఉన్నారు. నా అవసరం ఇప్పుడు చాలా ఉంది. వారిని సంరక్షించాల్సిన బాధ్యత ఎక్కువగా ఇప్పుడు ఉన్నది అన్నాడు.
కొంతకాలం తర్వాత కబీర్ ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి విచారణ చేయగా అతను మరణించాడని తెలిసింది. అప్పుడు కబీర్ అయ్యో సంసారబంధము లందు తగులుకొని కొద్దిపాటి సమయం కూడా పరమాత్మను స్మరించక, ప్రాపంచిక బంధములలో కట్టుబడి సమయాన్ని అంతా వృధా చేసుకున్నాడు కదా అని బాధపడ్డాడు. పరమాత్మ కొరకు కొద్దిపాటి సమయాన్ని కేటాయించినా అతనికి ముక్తి కలిగేది కదా అనుకున్నాడు.
ఆ వ్యక్తి తన జీవితకాలమందు గోవులను కాచేవాడు. అందులో ఒక ఆవు అంటే అతనికి చాలా ఇష్టము. మరణించిన తర్వాత ఆ ఆవుకు దూడగా జన్మించాడు. పెరిగి ఎద్దుగా మారిన తనని పొలము దున్నటానికి, లాగటానికి ఎడ్లబండ్లను ఉపయోగించారు. ముసలిదైపోయి ఏ పనికి పనికి రానప్పుడు దానిని కసాయి వాడికి అమ్మేశారు. దాని మాంసం అమ్మి విక్రయించి, దాని చర్మం డోలు తయారీలో వినియోగించార. ఆ డోలును ఎవరైనా మ్రోగించినప్పుడు అది “డాం! డాం! డాం! నేను ప్రాపంచిక బంధములందు తగులుకొని ఎద్దుగా పుట్టి, పొలము దున్ని, బండ్లను లాగి, కసాయివాని వాని చేతిలో ముక్కలుగా నరకబడి అమ్మబడ్డాను. నా చర్మము ఈ డోలు తయారీలో వినియోగించారు. ఇంకా చేసిన కర్మను అనుభవించడానికి దెబ్బలు తింటూ నరకయాతనను అనుభవిస్తున్నాను” ఇలా పలికేది