నేటి దివ్య సందేశము

సుఖదుఃఖాలు భోగ భాగ్యాలు కదిలిపోయే మేఘాలవంటివి

పిల్లలలో వ్యక్తిత్వవికాసము

ప్రపంచ వ్యాప్తంగా చైతన్యపూరితమైన, నీతివంతమైన జీవితాన్ని పునరుద్ధరించుటకు భగవాన్ సత్యసాయి బాబా వారు ప్రారంభించిన కార్యక్రమము శ్రీ సత్య సాయి బాలవికాస్. “మీరు మానసికంగా దృఢంగా ఉండుటకై అధ్యయనం చేయాలి. మీ హృదయంలో దైవభక్తి దృఢంగా ఉండాలి. విద్య యొక్క లక్ష్యం కేవలం పుస్తక పరిజ్ఞానం సంపాదించుట కాదు. నేర్చుకొన్న విషయాలను నిజజీవితంలో ఆచరించ గలగాలి. పక్షులు, జంతువులు విద్యాభ్యాసం లేకనే బ్రతుకుతున్నాయి. కానీ మనం అలాకాకుండా బలమైన, ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని పొందుటకు అధ్యయనం చేయాలి”. అని భగవాన్ ప్రవచించినారు.

“విద్య యొక్క అంతిమలక్ష్యం వ్యక్తిత్వ వికాసము” అను దివ్యసూక్తిని ఆచరణలో ఉంచుటకు భగవాన్ శ్రీ సత్య సాయి బాలవికాస్ ప్రారంభించినారు.

బాలవికాస్ అంటే వ్యక్తిత్వ విశిష్టత వికసించుట. సాధారణ పరిస్థితులలో పుస్తకాల ద్వారా లేక ఇతరుల ద్వారా ఇది సాధ్యం కాదు. ప్రతీ వ్యక్తిలో అంతర్లీనంగా విశిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతీ విద్యార్థి లోని ఆ అంతర్లీన శక్తిని వెలికితీసి దానిని అత్యున్నతమైన స్థాయికు తీసుకొని పోవుటకు బాలవికాస్ తోడ్పడుతుంది. నేటి పిల్లలే రేపటి సమాజానికి మార్గనిర్దేశకులుగా ఎదుగుటకు, స్వీయ పరిశోధన – స్వీయ ఆవిష్కరణ మార్గంలో సాగుటకు బాలవికాస్ తోడ్పడుతుంది.

ఈ లక్ష్యంతో సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస మున్నగు మానవతావిలువలను బాలవికాస్ నేర్పిస్తుంది. ప్రార్థనలు, సామూహిక బృందగానం, కథలు, సామూహిక కార్యక్రమాలు, దైవచింతన మొదలైన శిక్షణా పద్ధతులు బాలవికాస్ లో పాటిస్తారు. ఆ విధంగా పిల్లల లోని అంతర్గతమైన ప్రతిభా పాటవాలను వెలికితీసి వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుట బాలవికాస్ లక్ష్యము. క్లుప్తంగా బాలవికాస్ కార్యక్రమమంటే ఇట్టి వ్యక్తిత్వవికాసము.