క్రీస్తు జననము
క్రీస్తు జననము
ప్రతి సంవత్సరము డిశంబర్ నెలలో ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా “క్రిష్టమస్” పండుగ జరుపుకుంటారు. క్రీస్తు కోసం జరిపిన చర్చి ప్రార్ధన నుండి (Christ-mass) క్రిస్మస్’ అను పదము వచ్చింది. దీనిని ‘X-mass” అని కూడా అంటారు.
X- అనగా గ్రీకు భాషలో క్రీస్తు పేరులో మొదటి అక్షరము. దీనిని చాలా పవిత్ర సంకేతంగా వాడుతుంటారు.
సాధారణంగా క్రిష్టమస్ నాడు ఉత్సాహపూరితమైన గీతాలు పాడు కోవడం, క్రీస్తు పుట్టుకపై నాటికలు ప్రదర్శించడం, పెద్దపెద్ద అలంకరణలు చేయడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, విందులు చేసుకోవడం జరుగుతుంటుంది. కాని ఇవేవి నిజంగా క్రిష్టమస్ అంతరార్థాన్ని తెలియజేయవు. మన హృదయాలలో క్రీస్తును జన్మింప చేసుకున్నప్పుడే క్రిష్టమస్ సార్ధకము అవుతుంది. జీససు ప్రవచించి, ఆచరించి చూపిన ఏ ఒక్క ఆదర్శమయినా మనము ఆచరణలో పెట్ట గలిగినప్పుడు అది సాధ్యమవుతుంది. మానవులు సోదరుల వలె మెలిగి, సుఖదు:ఖాలను పంచుకోవాలని ఆయన బోధించాడు. ప్రేమ, కరుణ, సానుభూతి – ఈ ఉత్తమ గుణాలను ఆయన ప్రజల హృదయాలలో ప్రతిష్ఠించాడు. తూర్పు దిక్కున ఆనాడు కనపడిన “నక్షత్రం” నిజంగా నక్షత్రం కాదు. అది జీససు జన్మించిన గ్రామ ప్రాంతంపై ఆకాశాన ప్రకాశించిన దివ్య తేజః పుంజము. అనగా అజ్ఞానము అనే అంధకారాన్ని పారద్రోలి ప్రేమ జ్యోతిని మానవ హృదయాలలో వెలిగించడానికి, పంచడానికి ఒక మహనీయుడు జన్మించాడని దాని అర్థం.
తన జీవితకాలంలో తన సుఖాన్ని, భద్రతను, చివరకు తన ఉనికిని గూడా జీససు లెక్కచేయలేదు. అధికారంలో వుండి తనపై కత్తి పెట్టిన వారిని ఆయన ధైర్యంగా ఎదుర్కొని తన ఆదర్శాల కోసం నిలిచాడు. దుర్గుణాలకు మకుటం లాంటి అహంకారాన్ని ఆయన నిర్మూలించ గలిగాడు.
జీససు తల్లి “మేరీమాత” మానవ హృదయానికి, జీససు హృదయము నుండి ప్రవహించే దివ్యానందానికి ప్రతీక. అందుకే బాల్యంలో వున్న జీససును ఒడిలో ఉంచుకొన్నట్లుగా మేరీమాతను చిత్రీకరిస్తారు. జీససు ఏ పవిత్ర ఆదర్శాలకు నిలబడ్డాడో వాటిని ఆచరించి, ఆనందాన్ని పంచుకున్నప్పుడే క్రిష్ణమస్ నిజంగా పర్వదినము అవుతుంది.
క్రీస్తు జననము (క్రిష్టమసు కథ)
జీససు జన్మించుటకు కొన్ని రోజులకు ముందు రోమన్ చక్రవర్తి సీజర్అగస్టస్ , ప్రతివారు తమ పూర్వీకుల నగరాలకు వెళ్ళి పన్నులు చెల్లించాలని చాటించాడు. అందుచేత జోసఫ్, మేరీ “గెలీలీ” నుంచి బయలుదేరి “బెత్లెహమ్” కు వెళుతున్నారు. ఆ సమయంలో మేరీ పూర్ణ గర్భిణిగా ఉంది. ఆమె ఒక కంచరగాడిద మీద మరియు ఆమె ప్రక్క జోసపు వెళుతున్నారు. పన్ను కట్టడం కోసం జనం తండోపతండాలుగా వస్తున్నారు. సత్రాలలో ఎక్కడా చోటు లేదు. ఎక్కడ తిరిగినా వారికి విశ్రమించే స్థలము దొరకలేదు. చివరకు ఒక సత్రపు యజమాని మేరీ స్థితిని చూచి జాలిపడి ఒక గొడ్లపాకలో కాస్త స్థలం ఇచ్చాడు. మేరీ, జోసపు ఎంతో కృతజ్ఞతతో ఆ గొడ్లపాకలో గొడ్ల ప్రక్కనే రాత్రికి పడుకున్నారు. ఆ రాత్రే మేరీ తన మొదటి కుమారుణ్ణి కన్నది. ఆ గడ్డి మీదనే చిన్న మెత్త తయారుచేసి పసిబిడ్డను పడుకోబెట్టింది.
బెత్లెహాం ఊరి వెలుపల కొందరు గొర్రెల కాపరులు రాత్రిపూట చలికాచుకుంటూ కూర్చున్నారు. వారికి హఠాత్తుగా ఒక దివ్యదృష్టి లాంటి అనుభవం కలిగింది. ఒక “దేవత” వారి ముందు నిలిచింది. వారు మొదట భయపడ్డారు. ఆ దేవత పలికింది – “బిడ్డలారా! భయపడకండి మీకు ఒక శుభవార్త అందిస్తున్నాను. ఈనాడు బెత్లెహమ్ (డేవిడ్) నగరంలో మానవాళిని రక్షించే ప్రభువు క్రీస్తు జన్మించాడు. ఆ బిడ్డ ఒక గొడ్లపాకలో ఉన్నాడు” అని పలికింది. అప్పుడు మరికొంత మంది దేవతలు ప్రత్యక్షమయి భగవంతుని కీర్తిస్తూ నాట్యం చేయసాగారు. గొర్రెల కాపరులు ఆశ్చర్యంతో, సంతోషంతో బెత్లెహమ్ కు వెళ్ళి చూస్తామని అనుకున్నారు. వెదికి వెదికి ఆ గొడ్లపాకలో మేరీని, జోసపును, ఆ బిడ్డను చూచి వారి ముందు మోకరిల్లి దేవుణ్ణి స్తుతించారు. కొంతసేపు తర్వాత వారు వెళ్ళిపోయారు. మేరీ కూడా ఇదంతా చూచి ఆలోచనలో పడింది.
జీససు జన్మించిన సమయంలో జెరూసలెంలో “హెరాడ్” పరిపాలిస్తూ ఉండేవాడు. అప్పుడు కొందరు జ్యోతిష్కులు తూర్పుదేశాల నుండి జెరూసలెంకు వచ్చారు. వారు ఆకాశంలో అంతకుముందు లేని వెలుగును చూచారు. వారు దానిలో ఏదో విశేషం ఉందని గ్రహించి “యూదులకు ప్రభువుగా జన్మించిన వ్యక్తి ఎక్కడ?” అని వెదుకుతూ వచ్చారు. హెరాడ్ ఇది తెలిసి, కలవరపడ్డాడు.
వెంటనే అతడు మతాధికారులను పిలిచి ప్రశ్నించాడు “మన మత గ్రంధాల ప్రకారము క్రీస్తు ఎక్కడ జన్మించవలసి వుంది?” అని. అప్పుడు వారు చెప్పారు “బెత్లెహమ్ లో” అని. ఇది విన్న హెరాడ్ కు మనశ్శాంతి కరువయింది. తన పదవి స్థానానికి ముప్పువచ్చినట్లు భయపడ్డాడు. రహస్యంగా జ్యోతిష్కులను పిలిచి – “మీరు బెత్లేహాంకు వెళ్ళి ఆ బిద్డ ఎక్కనున్నాడో కనుగొనండి. నేను కూడా ఆయన్ను ఆరాధిస్తాను” అని వారిని పంపేశాడు. వారు ఒంటెల మీద ప్రయాణం సాగించారు. వారు ఆకాశంలో కనపడే కాంతిని అనుసరిస్తూ వెళ్ళారు. చివరకు వారికి క్రీస్తు జన్మించిన ఊరిమీద ఆకాశంలో ఒక దివ్యతేజం కనిపించింది. నగరంలో ప్రవేశించి గొడ్ల పాకలో క్రీస్తును కనుగొని గౌరవముతో మోకరిల్లి ప్రార్థన చేశారు. వారు తెచ్చిన కానుకలు, చిన్న పెట్టెలో బంగారు నాణెములు, ఇంకొక నగిషీ పెట్టెలో సాంభ్రాణి పొడి, శరీరానికి పట్టించే సుగంధ తైలం సమర్పించారు. వారికి కలలో దేవుడు కనిపించి తిరిగి జెరూసలెంకు పోవద్దని చెప్పగా, వారు మరొకదారిన తూర్పు దేశాలకు వెళ్ళిపోయారు.
వారు వెళ్ళగానే జోసపుకు కలలో ఒక దేవదూత కనిపించి “ఈ బిడ్డను తీసుకొని వెంటనే ఈజిప్టుకు వెళ్ళు. నేను చెప్పేవరకు అక్కడే వుండు. హెరాడ్ ఈ బిడ్డను చంపడానికి వస్తున్నాడు” అని చెప్పాడు. హడావిడిగా మేరీ, జోసపు బయలుదేరి ఎడారి మార్గంగా ఈజిప్టుకు బయలుదేరారు.
జ్యోతిష్కులు తనను మోసం చేశారని తెలిసి హెరాడ్ చిందులు త్రొక్కాడు. ఆ కోపంతో బెత్లేహం, ఆ చుట్టుపక్కల ఊళ్ళలో రెండేళ్ళలోపు బిడ్డలందరిని చంపి వేయమని ఆజ్ఞ జారీ చేశాడు.
హెరాడ్ మరణానంతరము దేవదూత జోసపుకు కలలో కనిపించి “ఇప్పుడు నీ బిడ్డను ఇజ్రాయిల్ కు తీసుకొనిపో” అని చెప్పాడు. మళ్ళీ ఎడారి గుండా జోసఫ్, మేరి తిరుగు ప్రయాణం సాగించారు. కాని ఈసారి తమ బిడ్డ ప్రాణానికి భయం లేదని వారు సంతోషంగా ఉన్నారు. వారు తిరిగి “గెలిలీ” వచ్చి నాజరేత్ నగరంలో నివసించడానికి నిర్ణయించుకున్నారు.