కర్మ ఫలము
ఒక గృహస్థుడు శనివారమునాడు తన ఇష్టదేవతారాధన నిమిత్తం పూజ చేయాలనుకున్నాడు. తన కుమారుని పిల్చి “నాయనా! బజారుకు వెళ్ళి ఒక రూపాయికి అరటిపళ్ళు తీసికొనిరా!” అని అన్నాడు. ఆ కుమారుడు వయసులో చిన్నవాడైనా మంచి గుణవంతుడు, తెలివిగలవాడు. రూపాయి తీసికొని బజారుకి బయలుదేరాడు.
ఆ అబ్బాయి బజారులో అరటిపళ్ళు కొని యింటికి తిరిగి వస్తున్నాడు. దారిలో ఒక తల్లికొడుకులు ఆకలితో చాలా బాధపడుతూ, తినటానికి ఏదైనా యివ్వమని దారిన పోయేవారిని దీనాతిదీనంగా ప్రాధేయపడటం చూసాడు. ఈ అబ్బాయి వారి దగ్గరకు వెళ్ళాడు.
ఆకలితో బాధపడుతున్న ఆ బీదపిల్లవాడి చూపులు తనచేతిలో వున్న అరటిపళ్ళమీదనే నిలిచి ఉండటం చూసాడు. వారి ఆకలి బాధను తీర్చాలనుకొని తన చేతిలోని అరటిపళ్ళను యిచ్చాడు. కొంత దూరంలో వున్న పంపు దగ్గరకు వెళ్ళి నీటిని తెచ్చి, వారికి యిచ్చి దాహాన్ని తీర్చాడు. ఆకలి బాధ తీరిన ఆ తల్లీకొడుకులు ఆనందబాష్పాలను రాలుస్తూ ఆ అబ్బాయికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఒక మంచి పని చేసాననే తృప్తితో ఆ అబ్బాయి యింటికి వెళ్ళాడు. అతని తండ్రి “బాబూ! అరటిపళ్ళు తెచ్చావా? ఏవీ? ఇలా తీసికొని రా!” అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి “నాన్నగారూ! నేను చాలా మంచి ఫలం తెచ్చాను. ఇంటికి పవిత్రమైన కర్మ ఫలాల్ని తీసుకొచ్చానని” చెప్పాడు. అయితే అది కళ్ళకు కనబడదు” అని పలికి, జరిగిన సంగతిని తండ్రికి వివరించాడు. తండ్రి తన కుమారుని మంచితనాన్ని మెచ్చుకొని తనకు తగిన కొడుకే లభించాడని, తన జన్మ సార్థకమైందని ఎంతో సంతోషించాడు. ఆనాటి నుండి తండ్రీకొడుకుల మధ్య అనురాగం అధికమైంది.
చూశారా! త్యాగం వలన కలిగిన ఫలం, ఫలితం, ఆనందం! మంచి కర్మలను చేస్తే మంచి ఫలాన్ని అందుకోగలం. మనలో సహజంగా ఉండే మంచి భావాలను గుర్తించి, పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు కూడా మననుండి కోరేది వాడిపోయే పుష్పాలను, క్రుళ్ళిపోయే ఫలాలను కాదు, సచ్చింతలనే పుష్పాలను, సత్కర్మలనే ఫలాలను మాత్రమే.
సత్కర్మలు ఆచరించుట వలన దైవం ఎంతో సంతోషిస్తాడు. భగవంతుడు భావ ప్రియుడు కానీ, బాహ్య ప్రియుడు కాడు.
[Source: China Katha – Part 1 Pg:5]
Illustrations by Ms. Sainee &
Digitized by Ms.Saipavitraa
(Sri Sathya Sai Balvikas Alumni)