ఓం సర్వమంగళ శ్లోకము – ఆక్టివిటీ
- గురువులు శ్లోకమును పూర్తి అర్ధముతో వివరించాలి
- గురువులు శ్లోకము యందలి ముఖ్య అంశములను బోర్డు పై వ్రాయాలి. ఉదా : శివుని భార్య, మహా విష్ణువు యొక్క సోదరి, విజయమును ఇచ్చు దేవత
- ఆ తరువాత ఒక బాలిక చేత పార్వతీ దేవి వలె అభినయం చేయించాలి, (గురువు కోరుకుంటే, వీలైతే పిల్లలలో ఒకరికి పార్వతీ దేవి వేషం వేయించాలి) లేదా పార్వతీ దేవి యొక్క చిత్రపటం అయినా ఉంచవచ్చు.
- మిగిలిన పిల్లలు ఒక్కొక్కరుగా లేదా 2, 3 సమూహాలుగా (తరగతి లోని పిల్లలను బట్టి) శ్లోకమునకు సంబంధించి వారి వారి భావనలు వ్రాయమని సూచించాలి. అంటే బోర్డు పైన వ్రాసి ఉన్న ముఖ్య అంశములను ప్రతిపాదించే విధముగా. ఉదా: “ఓ తల్లీ! నీవు శివుడి అర్ధాంగివీ, విష్ణువు యొక్క సోదరివి. నాకు విజయమును ప్రసాదించు”, (లేదా) “ఓ సర్వశక్తిమయీ! జననీ, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నాకు సకల సౌభాగ్యములు ప్రసాదించు” అని.
- అనంతరం పిల్లలను ఒకరి తరువాత ఒకరుగా, ఒక సమూహం తరువాత మరొక సమూహంగా ఈ ప్రార్థనను భక్తితో పఠిస్తూ నేర్చుకోమని చెప్పాలి. అలాగే ఈ శ్లోకము పఠిస్తూ పార్వతీదేవికి పూలు సమర్పించమని చెప్పాలి.
క్లుప్తంగా:
ఈ కృత్యము, పిల్లలకు ఈ శ్లోకము యొక్క భావము అర్థము చేసుకొని గుర్తుంచుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ఎంతో సరదాగా అమ్మవారిపై భక్తిని పెంపొందించే కృత్యము. దీని ద్వారా పిల్లలకు దేవి నుండి నేర్చుకోవలసిన విలువలు కూడా అర్థం అవుతాయి. అయితే గురువులు పిల్లలు భావవ్యక్తీకరణ చేసేటప్పుడు వివాస్పద, అనవసర పద ప్రయోగం చేయకుండా జాగ్రత్త పడాలి.
ఈ కృత్యము అనంతరం పిల్లలు అందరినీ సామూహికంగా ఈ శ్లోకమును, భావమును పఠించమని చెప్పాలి.