మంచి పని – మంచి ఫలితము
బానిస వృత్తి బాగా ప్రబలి వున్న ఆ రోజుల్లో ఆండ్రోక్లిస్ అనే అతను బానిసగా ఉన్నాడు. అతనిని కొనుక్కొన్న యజమాని క్రూరుడు. బానిసగా రాత్రింబవళ్ళు సేవచేసేవాడు. ఏ చిన్న పొరపాటు జరిగినా అతనిని అతని యజమానే కొరడాలతో కొట్టేవాడు. అది భరించలేక ఆండ్రోక్లిస్ అడవిలోకి పారియాడు. అక్కడ ఒక పెద్ద గుహ కనిపిస్తే అందులో తలదాచుకొన్నాడు.
అలా కొన్ని రోజులు గడిచింది. ఒక రోజు ఉదయము అతనికి భయంకరమైన గర్జన వినిపించింది. అది అంతకంతకు దగ్గరగా వస్తున్నట్టనిపించింది. తీరా చూసేసరికి అది ఒక సింహము. ఎంతో బాధతో ఆక్రందనం చేస్తున్నది. కుంటు కుంటూ ఆ సింహము గుహలోకి ప్రవేశించింది. మూలుగుతూ వేదన పడుతోంది. అలాగే ఒక మూలచేరి కాలు చాచుకొంది. మీద వున్న పెద్ద గాయాన్ని రొప్పుతూ నాకుతోంది. ఆ దృశ్యాన్ని చూడలేక పోయాడు ఆండ్రోక్లిస్. అతని మనసు కరిగింది. ఉండబట్టలేక పోయాడు. నెమ్మది నెమ్మదిగా ఆ సింహాన్ని చేరి ఆ గాయాన్ని పరిశీలించాడు. సింహం కాలికి ఒక పెద్దముల్లు లోతుగా గుచ్చుకొనివుంది. జాగ్రత్తగా ఆ ముల్లుతీశాడు. ఆ పరిసరాలలో వున్న ఏవేవో మూలికలతో ఆ గాయానికి కట్టు కట్టాడు. అలా మూడు రోజులు పరిచర్యలు చేసేసరికి ఆ గాయం పూర్తిగా నయమైంది. అత్యంత ప్రేమతో అతని చేతులు నాకుతూ కృతజ్ఞత తెలుపుకొని ఆ సింహము బయటకు వెళ్ళిపోయింది.
కొంత కాలానికి అతను కూడా ఆ గుహను విడిచి సమీపాననున్న మరో నగరానికి చేరాడు. దురదృష్టవశాత్తు ఆ నగరం బజారులో వుండగా అతని పూర్వపు యజమాని కంటపడ్డాడు.
వెంటనే అతను ఆండ్రోక్లిస్ ని పట్టించి చెఱసాలలో వేయించాడు. అప్పటి పద్ధతి ప్రకారము పారిపోయిన బానిసలను అతి క్రూరంగా శిక్షించేవారు. ఒక సింహాన్ని బోనులో బంధించి నాలుగైదు రోజులు ఆహారము వేయకుండా వుంచి ఆ బానిసకు ఒక చిరుకత్తిని చేతికిచ్చి ఆ సింహం ముందు వదిలేవారు. ఆకలిగొన్న సింహము ఆ బానిసను కండకండలుగా చీల్చితింటూ వుంటే ఆ దేశపు రాజు, రాజ కుటుంబీకులు, ప్రజలు అంతా వినోదంగా చూసి ఆనందించేవారు.
అదే ఆచారము ప్రకారము ఆండ్రోక్లిస్ కు కూడా ఒక చిరుకత్తి యిచ్చి ఆ బోనులో వదిలారు. మరుక్షణంలోనే ఆకలిగొన్న ఒక సింహాన్ని బోనులోకి పంపించారు. పెద్దగా గర్జిస్తూ ఆ బోనులో ప్రవేశించిన సింహము తేరిపార ఆండ్రోక్లిస్ ను చూసింది. గర్జించడం మాని తోక ఆడిస్తూ పెంపుడు కుక్కలా అతని చుట్టూ ప్రదక్షిణం చేసింది. అతని కాళ్ళను, చేతులను ఎంతో ఆప్యాయతతో నాకింది. తాను ముల్లు తీసి కట్టు కట్టిన సింహం యిదేనని ఆండ్రోక్లిస్ గ్రహించాడు. తన రెండు చేతులు ఆ సింహము మెడ చుట్టూ చేర్చి నుదుటిమీద ముద్దు పెట్టుకొన్నాడు. ఆ యిద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆండ్రోక్లిస్ కి మృత్యువు అనుకున్నది ఆనందంగా మారింది.
ఈ విచిత్ర సంఘటన తిలకిస్తున్న అక్కడి వారందరు కూడా ఆనందంలో పాలుపంచుకొని జయజయ ధ్వానాలు చేశారు. ఆకలిగొన్న సింహం అనురాగాన్ని ప్రదర్శించడం చూసి అందరూ నివ్వెరపోయారు.రాజు సగౌరవంగా ఆండ్రోక్లిస్ ను పిలిపించి “సింహముయొక్క ప్రేమనందుకొన్న నీవు నిజంగా గొప్పవాడవు. అంతటి క్రూరమృగాన్ని ఎలా మచ్చిక చేసుకో గలిగావు?” అని అడిగాడు. “జంతువుకంటే మానవుని లోనే క్రూరత్వము ఎక్కువగా కరుడుగట్టి వుంది. రాత్రి అనక, పగలు అనక నిద్రాహారాలు మాని పరిచర్యలు చేస్తే ఫలితం కొరడా దెబ్బలు, చిత్రహింస” అని చెప్పాడు. తన యజమాని ఏ విధంగా తనను ఎంత బాధ పెట్టిందీ, తాను ఎట్లా అడవికి చేరిందీ,ఆ సింహానికి తాను చేసిన సేవ సవివరంగా చెప్పాడు. ఆశ్చర్యంగా అన్నీ విన్న రాజు “దెబ్బతిన్న ఆ సింహాన్ని చేరడానికి నీవు భయపడలేదా” అని అడిగాడు. “అసలు భయం అనిపించలేదు. అనుక్షణం యజమాని పెడుతున్న హింసను సహిస్తూ దుర్భరమైన జీవితాన్ని గడిపేదానికంటే ఆ సింహానికి ఆహారంగా పోయి ఆకలి తీర్చడం చాలా ఆనందం అనిపించింది” అని సవినయంగా చెప్పాడు. రాజు హృదయం కరిగింది. “ఆండ్రో క్లిస్ స్వతంత్రుడు. బానిసకాడు. అతనిని విడిచిపెట్టమని”, అతని యజమానిని ఆదేశించాడు. కృతజ్ఞతతో నమస్కరించి ఆండ్రోక్లిస్ గౌరవ ప్రదమైన జీవితము ప్రారంభించాడు.
సింహానికి తాను చేసిన చిన్న సేవ అతనికి ప్రాణభిక్ష పెట్టింది. అంతేకాదు, బానిసత్వం నుంచి శాశ్వతంగా విడిపించింది.
ప్రశ్నలు
- దెబ్బతినివున్న సింహాన్ని సమీపించినపుడు ఆండ్రోక్లిస్ ను ఆ గుహలో సింహం ఎందుకు చంపివెయ్య లేదు?
- ఈ కథవల్ల నీవు నేర్చుకొన్న నీతి ఏమి?
- నీకు ఏ యే జంతువులంటే యిష్టం? వాటి నెందుకు ప్రేమిస్తావు? వాటికి ఎప్పుడైనా ఏదైనా సేవ చేశావా?