స్నేహము – స్వార్ధత్యాగము
కలకత్తాలో ప్రఖ్యాతి గాంచిన ఒక బడిలో అనీల్, సునీల్ అని యిరువురు బాలురుండేవారు. వారిద్దరు ఐదవ తరగతి చదువుతున్నారు. చాలా తెలివైనవారు. వారి ఇద్దరి అన్యోన్యత సోదరప్రేమను మరిపిస్తూ ఉండేది. సునీల్ ప్రతి పరీక్షలోనూ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యేవాడు. అనీల్ రెండవ శ్రేణిలో వచ్చేవాడు. ఎన్ని పరీక్షలు జరిగినా వారిద్దరి శ్రేణులలో మార్పు లేదు.
సునీల్ కి తల్లి ఉంది. తండ్రి లేడు. చుట్టాలు కూడా మరెవ్వరూలేరు. సునీల్ తల్లికి హఠాత్తుగా చాలా జబ్బు చేసింది. రాత్రింబవళ్ళు ఆమెకు సేవచేస్తున్నాడు సునీల్. అలా రెండు నెలలు గడిచింది. ఒక రోజున అతని తల్లి భగవంతుని మీద భారంవేసి, తన ప్రాణప్రదమైన కుమారుని కాపాడమని కోరుకుంటూ కొనఊపిరి వదిలింది.
తన తల్లి మరణం అతనికి తీరనిలోటుగా ఏర్పడింది. అది అతని హృదయంమీద ఒక మాయని గాయంగా మారింది. ఆ కారణంగా అతడు ఆ రెండు నెలలు బడికి వెళ్ళలేకపోయాడు. దానికితోడు తల్లి లేదన్న విచారంవల్ల అతని జ్ఞాపకశక్తి చెడింది. అయినా అతడు తన ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి రాత్రింబవళ్ళు శ్రమించి చదువుతున్నాడు. వారినెరిగున్న ప్రతి ఒక్కరూ ఈసారి అనిల్ కి ప్రథమ శ్రేణి వస్తుందని భావించారు. సునీల్ కూడా అలానే అనుకున్నాడు. పరీక్షలయిపోయాయి. అనిల్ వ్రాసిన పరీక్షా పత్రాలను చూసిన ఉపాధ్యాయుడు చాలా ఆశ్చర్యపోయాడు. పరీక్షలోని ప్రశ్నలు చాలా తేలికగా ఉన్నప్పటికి కొన్ని ప్రశ్నలకు సమాధానాలే వ్రాయలేదు. అనీల్ వ్రాసిన తీరుచూస్తే ఆయనకేదో అనుమానం వచ్చింది. ఉపాధ్యాయుడు ఉండబట్టలేక అనిల్ కి కబురుపెట్టాడు. “ఎందుకు పరీక్షలో సమాధానాలు సరిగ్గా వ్రాయలేకపోయావు?” అని నిలదీసి అడిగాడు.
అనీల్ కాసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. ఆయన వేసిన ప్రకశ్నకు సమాధానం చెప్పాలా వద్దా అని తటపటాయిస్తున్నాడు. ఇక తప్పదని తెలుసుకొని అతిదీనంగా యిలా అన్నాడు. “అయ్యా! సునీల్ కి ప్రతి సంవత్సరం ప్రథమశ్రేణి రావడం మీకు తెలుసు. ఈ సంవత్సరం పరిస్థితి మారింది. ఈ లోకంలో అతనికున్న ప్రియాతి ప్రియమైన వ్యక్తి తల్లి, అతనిని విడిచి పోయింది. అతను ఈనాడు దిక్కులేనివాడు. నాకు తల్లి, తండ్రి వున్నారు. సునీల్ కు ఈ సంవత్సరం ప్రథమశ్రేణి రాకపోతే అది అతని హృదయం మీద మానని గాయంగా మిగిలే ప్రమాదం వుంది. అందుకనే నేనీ పరీక్ష కావాలనే సరిగా వ్రాయలేదు. దానివల్ల అతనికి ప్రధమశ్రేణి రాగలదు. ఆ ఆనందం కొంతవరకు ఊరట కలిగించుతుంది, అని నా నమ్మకము. అయ్యా! మరొక్క మనవి. ఈ విషయం మీ మనస్సులోనే వుంచుకోండి.
మరెవ్వరికీ చెప్పవద్దని నా ప్రార్థన. సునీల్ కి తెలిస్తే అతడు చాలా బాధపడతాడు, అతడు నా స్నేహితుడు. అతడెప్పుడూ సంతోషంగా వుండడమే నాకు ఆనందము. నాకు ప్రథమ శ్రేణి రాకపోయినా పరవాలేదు” అన్నాడు. ఉపాధ్యాయునికి నోట మాటరాలేదు. అనీల్ వీపు మీద అనునయంగా తట్టి” నీలాంటివాడు నాకు విద్యార్థిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. నీ స్నేహభావము, స్వార్ధత్యాగము, అసమానము, అద్వితీయము. ఇట్టి ఉదార భావాలవల్ల నీవు తప్పక గొప్పవాడివై, నిన్ను కన్నవారికి, మాకు, దేశానికి కూడా ఘనకీర్తి ఆర్జిస్తావు” అని ఆశీర్వదించాడు ఆ ఉపాధ్యాయుడు.
ప్రశ్నలు
- అనీల్ తన పరీక్షలలో ప్రథమశ్రేణి ఎందుకు వదిలి పెట్టుకొన్నాడు?
- అనిల్ చెప్పిన విషయాన్ని రహస్యంగా దాచివుంచమని ఉపాధ్యాయుణ్ణి ఎందుకు కోరాడు.
- నీ స్వానుభవం నుంచి కొన్ని ఉదాహరణలు తెలుపుతూ ఎవరు నిజమైన స్నేహితుడో, ఎవరు కారో, ఏ విధంగా తెలుసుకోగలవు?
- నీ వెప్పుడైనా నీ స్నేహితుని కోసంగాని, నీ సోదర, సోదరీల కోసంగాని మరెవరి కోసమైనా త్యాగం చేశావా? అయితే నీ అనుభవాన్ని వ్రాయుము.