సత్యమే దైవము (II)
ఆంగ్లేయుల పాలనలో భారత స్వాతంత్ర్య సమరం విజయం సాధించడానికి పాటుపడిన మహాపురుషులలో మహాత్మాగాంధీతో పాటు శ్రీ బాలగంగాధర తిలక్ ఒకరు.
ఆయన చదువుకొనే వయసులో చాలా తెలివైన వాడుగనూ, క్రమశిక్షణాపరుడుగనూ, వినయం గల విద్యార్థిగా ప్రతి ఒక్కరు చెప్పుకొనేవారు. కానీ ఒక రోజున ఒక ఉపాధ్యాయునికి ఒక వింతైన అనుభవం కలిగింది. ఆ రోజు విరామకాలంలో ఎవరో విద్యార్థి వేరుశనగకాయలు తిని, తొక్కలు ఉపాధ్యాయుని బల్ల సమీపాన పడేశాడు. తరగతిలోని విద్యార్థులెవ్వరూ దానిని పట్టించుకోలేదు. గంట కొట్టగానే విద్యార్థులంతా తిరిగి వచ్చి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. కానీ ఉపాధ్యాయుడు వస్తూనే ఆ తొక్కల్ని చూశాడు. అతనికి చాలా కోపం వచ్చింది. “ఇక్కడ ఆ తొక్కలెవరు పారేశారు?” అని గట్టిగా ఆడిగారు. ఎవ్వరూ మాట్లాడలేదు. “నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎవరీ పని చేసింది? చేసింది ఎవరో లేచి నిలబడకపోతే చూసిన వాళ్ళయినా చెప్పండి” అని ఇంకా గట్టిగా అడిగాడు. విద్యార్థులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎవరుచేసి వుంటారా అని అందులో చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎవ్వరూ లేచి నిలబడలేదు. ఎవ్వరూ మాట్లాడ లేదు కూడా.
కోపోద్రేకంతో ఉపాధ్యాయుడు బల్లమీద వున్న బెత్తం తీశాడు. “తప్పు చేసినవాణ్ని పట్టుకోవడంలో మీరెవ్వరూ సహకరించడంలేదు. కాబట్టి మీ అందరికి బెత్తంతో దెబ్బలు పడతాయి” అన్నాడు. ఉపాధ్యాయుడు మొదటి వరుసలో కూర్చొనివున్న వారివద్దకు బెత్తంతో వస్తున్నాడు. ఆ సమయంలో బాలగంగాధర తిలక్ లేచి, “అయ్యా! చిన్న మనవి. ఎవరు తప్పు చేశారో మాలో ఎవరికి తెలియదు. మాలో చాలామంది వాటిని చూడనైనా చూడలేదు. విరామ సమయంలో మేమెవ్వరము యిక్కడలేము.
అంతా బయటకు వెళ్ళాము. ప్రక్క తరగతిలోని విద్యార్థి ఎవ్వరైనా వచ్చి వేసి వుండవచ్చు కూడా. అటువంటప్పుడు నిరపరాధులందరికి బెత్తపు దెబ్బలా!” అని ధైర్యంగా చెప్పాడు.
ఆ ఉపాధ్యాయునికి తిలక్ చాలా మంచివాడని తెలుసు. అయినప్పటికీ ఆ కోపాన్ని ఆపుకోలేకపోయాడు. “బాల్! నీ తెలివిని నా వద్ద ప్రదర్శించవద్దు. నాకు తెలుసు, మీలో కొంతమందికి అతనెవరో తెలుసు. తప్పుచేసిందెవరో చెప్పకపోతే మొత్తం మీ అందరినీ శిక్షించవలసి వస్తుంది” అన్నాడా ఉపాధ్యాయుడు. వెంటనే బాల్ లేచి అతి వినయంగా ఇలా అన్నాడు. “అయ్యా! అలా మీరు మమ్మల్నందరిని శిక్షించడం న్యాయంకాదు. మేము నిరపరాధులమని మనవి చేశాను. అదే సత్యము, తప్పు చేయనివారిని దండిస్తూవుంటే నేను చూడలేను. దయయుంచి నేను తరగతి నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించండి” అని ఉపాధ్యాయుని నోటినుండి తిరిగి మాట రాకముందే బాల్ తన పుస్తకాలను తీసుకొని, గది బయటకు వెళ్ళిపోయాడు.
అతనిలోని సత్యసంధతకు, న్యాయ నిరతికి విద్యార్థులంతా అభినందించారు. ఉపాధ్యాయుడు కూడా అతనిని అభినందించకుండా వుండలేకపోయాడు. విద్యార్థులందరిని వుద్దేశించి “అతడు అసమాన ప్రజ్ఞాశాలి. బాల్ వలె ప్రతి విద్యార్థి సత్యసంధుడై క్రమశిక్షణతో మెలిగితే మన భారతదేశము ప్రగతి పథంలో పురోగమింపక తప్పదు” అని చెప్పాడు. అతనిలోని సత్యసంధత, న్యాయ నిరతి వల్లనే బాలగంగాధర తిలక్ మన జాతికొక నాయకుడుగా తయారయ్యాడు. అందుచేతనే అతను “లోకమాన్య తిలక్” అని పేరుగాంచాడు. జాతి యావత్తు అతన్ని ప్రేమించేది, అతన్ని పొగిడేది, అతన్ని గౌరవించేది.
ప్రశ్నలు
1.ఉపాధ్యాయుడు చేసిన పొరపాటేమిటి?
2.బాల్ తన తరగతిని విడిచిపెట్టి బయటికెందుకు వెళ్ళాడు?
3.ఈ సన్నివేశం జరిగినప్పుడు బాల్ తరగతిలో నీవు కూడా వుండివుంటే నీవేమి చేసి ఉండేవాడివి?