బ్రహ్మార్పణం – వివరణ
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం |
బ్రహ్మైవతేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ||
ఈ ప్రపంచమున సమస్తము బ్రహ్మ స్వరూపమే కానీ అన్యము కాదు అన్న విషయమును సదా జ్ఞప్తి యందుంచుకుని కర్మ చేయవలెను. చిత్తమందు బ్రహ్మభావన, దైవ భావన కలిగి యుండి కర్మల నాచరించ వలెను. అప్పుడు ఆ కర్మ యజ్ఞము గా మారిపోవును.
ఇచ్చట హోమము చేయు యజమాని, హవిస్సు, అగ్ని అన్నియు బ్రహ్మస్వరూపము లే అయినట్లుగా ప్రతీ కార్యమందును చేయువాడు, చేయబడినది బ్రహ్మ స్వరూపములే అగును. ఏకాగ్ర చిత్తముతో అనగా బ్రహ్మ భావముతో కర్మలను ఆచరించవలెను. అప్పుడు ఆ కర్మ తన కర్మత్వమును కోల్పోయి ధ్యానముగను, సమాధిగాను మారిపోవును.
ఈ విధంగా సమస్తము బ్రహ్మమే అను బ్రహ్మ భావనతో కర్మ చేయు మానవుడు బ్రహ్మమునే పొందును.
భగవాన్ బాబా ఇలా చెప్పారు:- యఙ్ఞము తపాలా శాఖ వంటిది.
అందులోని పవిత్రాగ్ని పోస్ట్ బాక్స్ అయితే, అందులో సమర్పించే హోమ ద్రవ్యములు ఉత్తరం లోని సందేశం అయినచో వేదమంత్రములు అడ్రస్. కవర్ పై స్టాంప్ యఙ్ఞ కర్త యొక్క విశ్వాసము. ఆ విధంగా రాసిన ఉత్తరమును భగవంతుడు స్వీకరించును.
ఎవరైతే సమస్త కార్యములందు నిరంతరం బ్రహ్మభావన కల్గి యుండి, అంకితభావంతో నిత్య కర్మలను ఆచరించునో ఆ మనుజుడు బ్రహ్మమునే పొందును.