స్వామి బాల్య జీవితమునకు చెందిన కథలు వారి ప్రేమతత్త్వపు మెఱుపులు -మొదటిభాగము
సత్యం స్కూలునుండి ఇంటికి రాగానే మిగిలిన పిల్లలవలె స్కూల్లో తనకు బోధించబడిన పాఠాలగురించి మాట్లాడేవాడు కాదు. తన తరగతిలోని పిల్లలకు, ఇంకా ఒక్కొక్కప్పుడు పెద్దవారికి కూడ తాను ఏమి బోధించాడో చెప్పేవాడు.
అయిదునుండి ఏడు సంవత్సరముల వయసు కలిగిన పిల్లలు సత్యంతో ఆడుకోడానికి, భజనలు పాడడానికి వచ్చేవారు. ఆ సమయాలలో సత్యం వారికి మంచినడవడిని గురించి చెప్పేవాడు. “మీ తల్లి మీకు జన్మనిచ్చింది. ఎన్నో కష్టాలకోర్చి మీకీ శరీరాన్ని ఇచ్చింది. మీ తండ్రి మిమ్మల్ని పోషిస్తున్నారు. ఇద్దరూ మీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కాబట్టి వారిని ప్రేమించి వారికి విధేయులై ఉండి వారిని సంతోషపెట్టండి. ఎట్టి పరిస్థితులలోనైనా సత్యానికే కట్టుబడి ఉండండి. తల్లిదండ్రులు కోపపడతారనే భయంతో మీ తప్పులు కప్పి పుచ్చుకోకండి. సత్యం యొక్క శక్తి ఆటంబాంబు, హైడ్రొజన్బాంబుల శక్తి కంటే ఎక్కువది. సత్యాన్ని మించిన ఆయుధంలేదు. కాని సత్యం ఎలా చెప్పాలో కూడ నేర్చుకోండి. అది సత్యమైన మాట “అయినా అందరికీ సంతోషం కలిగించేదిగాను ఎవరినీ బాధించకుండ ఉండేట్లుగాను ఉండాలి”. అని స్వామి బాల్యంలోనే తోటి పిల్లలకు చెప్పేవారు.
పిల్లలు కొంచెం ఎదిగిన తరువాత సత్ప్రవర్తన, సచ్ఛీలములను గురించిన ప్రశ్నలు అడిగేవారు. సత్యం వారికి కోపము, ఆడంబరము, అసూయవంటి చెడ్డ గుణాలను విడనాడండి. ప్రేమను పెంపొందించుకోండి. అదే మీ ఊపిరి. ప్రేమతో ప్రపంచాన్నే జయించవచ్చు. దొంగతనం చేయవద్దు మీకు ఆహారం కాని, పుస్తకాలు కాని పెన్నులుకాని ఏవైనా నిజంగ అవసరమైతే మీ తోటి విద్యార్థులను అడిగి తీసికొండి. అంతేకాని వారికి తెలియకుండ వారి వస్తువులు తీయవద్దు అని చెప్పేవాడు.
పిల్లలంటే స్వామికి ప్రేమ అలాగే పిల్లలు కూడ స్వామిని ఎంతగానో ప్రేమించేవారు. సత్యం అన్నా, సత్యం చేసే బోధలన్నా వారికెంత ఇష్టమో వారి సంభాషణల్లో తెలిసేది. కేశన్న, రంగన్న, సుబ్బన్న రామన్న ఇంకా ఎందరో వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకునేవారు. రాజు మాటలెంతో తియ్యగ ఉంటాయి. రాజంటే నాకేంతో ఇష్టం. ఇంకోబాలుడు నీకే కాదు మనందరం అతనిని ప్రేమిస్తాం కదా! ఇంకొకడు :- రాజు మనకెన్నొ మంచి విషయాలు చెప్తాడు. మనం వాటిలో ఒకటి రెండైనా ఆచరణలో పెట్టుట మొదలుపెట్టాలి. కేశన్న :- దేవుడే మనతల్లి, తండ్రి – నాకు ప్రాణం. ఇంకొకడు :- ఇప్పటి నుండి నేను నిజమే చెప్తాను. ఆ చిన్ననాటి నుండే స్వామి అన్ని కులాలమధ్య మతాలమధ్య ఐక్యతను బోధించేవారు. పుట్టపర్తిలో ఎందరో మహమ్మదీయులుండేవారు. మొహరంను ఉత్సాహంగ జరుపుకునేవారు. “పూజావిధానం కంటె, మతంకంటె నీతి చాలముఖ్యం, నైతికవిలువలే మన ప్రాణశక్తి, కాబట్టి మతభేదాలు పాటించవద్దు. అందరూ మైత్రీభావంతో ఉండి ఈ పండుగలో పాలు పంచుకోండి” అని స్వామి చెప్పేవారు. ఒకనాడు గంగన్న అనే పేరుగల ఒక హరిజనబాలుడు (ఇప్పుడాయనకు 90 సంవత్సరాలు. ఆతని కుమారుడు ప్రశాంతినిలయం పరిపాలనా కార్యాలయంలో పనిచేస్తాడు) సత్యాన్ని తన యింటికి భోజనానికి పిలిచాడు. సత్యం పెంపుడు తల్లి అయిన కరణం సుబ్బమ్మ సత్యంతో పాటువెళ్ళింది. ఆమె బ్రాహ్మణ స్త్రీ అగుటచేత ఆమెను చూచి గంగన్న కొంచెం భయపడ్డాడు. “నువ్విలా భావించరాదు. భేదాలు వదలిపెట్టి ఐకమత్యంతో హాయిగ జీవించు. మానవత్వమనే కులం, ప్రేమ అనే మతం- ఈరెండే ఉన్నాయి” అని ఆ గంగన్నతో స్వామి చెప్పారు.
సత్యం బుక్కపట్నంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్ళేవారు. అక్కడనుండి హైస్కూలుకి వెళ్ళడానికి ఇ ఎస్ ఎల్ సి అనే పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఈ పరీక్ష పెనుకొండలో జరిగేది. ఆరోజుల్లో బస్సులు కాని, రైళ్ళుకాని లేవు. పెనుకొండకి కొత్తగా రైలు వచ్చినపుడు ఆ గ్రామస్థులందరికి అది కొత్త వింతగ ఉండేది. పట్టాలమీద ఒక పొడవాటి పామువంటిది జరజరాపాకుతోంది. దానికి ముందు బాగామెఱిసే ఒక కన్ను ఉంటుంది. అని అయాయకంగా చెప్పుకునేవారు.
ఆ రోజుల్లో బుక్కపట్నం నుండి పెనుకొండకు ప్రయాణమంటే ఇప్పుడు అమెరికాకో, రష్యాకో ప్రయాణం చేసి వెళ్ళినట్లుండేది. ఈశ్వరమ్మగారు సత్యం తినడానికి తీపి, కారం పిండివంటలుచేసి ఒక గుడ్డలో కట్టి ఇచ్చారు. ఆ రోజుల్లో పల్లెల్లో టిఫిన్ కారియర్లు కూడ ఉండేవి కావు, తోటి పిల్లలతో కలిసి సత్యం వెడుతుంటే తల్లిదండ్రులు కంటతడిపెట్టి దుఃఖించారు. మొత్తం ఎనిమిది మంది పిల్లలు, వాళ్ళను చూచుకోడానికి ఒక టీచరు, అందరూ కలసి ఒక ఎడ్లబండిలో ప్రయాణమైనారు. రోడ్లంతా గుంటలు, మిట్టలు, వాలు ప్రదేశం వచ్చినపుడల్లా టీచరు ఈ పిల్లలందరిని దింపేవారు. వాళ్లు కొంత దూరం నడిచిన తరువాత మళ్లీ అందరినీ టీచరు బండి ఎక్కించేవారు. ఇలా వెళ్ళి వెళ్ళి ఉదయం 5 గంటలకి బయలుదేరిన వాళ్లు రాత్రి 9 గంటలకి మూడున్నరకిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుకొండకు చేరుకున్నారు.
అక్కడ ఉండడానికి అనువైన ప్రదేశం ఏదీ లేదు. ఊరు బయట మూడు రోజులు బసచేశారు. ప్రతిరోజు సత్యమే మూడు పూటల మొత్తం గుంపుకి వండి పెట్టేవాడు. వీళ్లు వెళ్లిన దానికి ఫలితం ఆ గుంపు అంతటికి సత్యం ఒక్కడే ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు.
మిగిలిన వాళ్లు ప్రయాణపు బడలికకు తట్టుకోలేక, పరీక్షా విధానాలు అర్ధంకాక సరిగ్గా వ్రాయలేక పోయినారు. పుట్టపర్తిలో ప్రజలంతా సత్యం ఒక్కడే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడని తెలిసి అతడిని ఎండ్లబండిలో ఎక్కించి పల్లె అంతా ఊరేగించారు.
తరువాత సత్యం కమలాపురంలో తన అన్న శేషమరాజుగారి వద్ద ఉంటూ హైస్కూలులో చదువుకున్నాడు. అక్కడ మంచినీటికి కటకటగ ఉండేది. ఒక కిలోమీటరు దూరంలో ఉన్న బావినుండి నీటినితోడి పెద్ద కడవలతో సత్యం ఇంటికి నీటిని మోయవలసివచ్చేది. స్కూలు టైము అయ్యేవరకు అంటే ఉదయం తొమ్మిదిగంటల వరకు ఈ పని సరిపోయేది. గంజిలో నానబెట్టిన చల్ది అన్నం ఊరగాయతో త్వరత్వరగ తిని స్కూలుకి పరుగెత్తి వెళ్ళిపోయేవాడు.
స్కూలులో ముగ్గురు కూర్చునే డెస్క్ మీద రమేష్, సురేష్ అనే విద్యార్థుల మధ్య సత్యం కూర్చునేవాడు. డ్రిల్ టీచరు స్కౌట్ ను అప్పుడే స్కూలులో ప్రారంభించాడు. ప్రతి విద్యార్థి స్కౌట్లో చేరాలని దానికి రెండు కాకీ నిక్కర్లు, షర్ట్, బాడ్జి ఒక వారంలో కొనుక్కోవాలని ఆయన ఆజ్ఞ జారీచేసాడు. పుష్పగిరిలో జరిగే వార్షిక ఉత్సవానికి వెళ్ళి అక్కడ ఈ స్కౌటు పిల్లలు సంఘసేవ చేయాలనికూడ ఆయన చెప్పాడు.
సత్యం దగ్గర ఒక్క పైసాకూడా లేదు. ఉమ్మడి కుటుంబం కావటంచేత పెదవెంకప్పరాజు దగ్గరకూడ డబ్బు ఉండేదికాదు. స్కూలులో చేరేటప్పుడు ఆయన సత్యానికి రెండు అణాలు ఇచ్చారు. అప్పటి కది జరిగి ఆరునెలలు అయిపోయింది. కనుక సత్యం ఆ రెండు అణాలు ఎప్పుడో ఖర్చుపెట్టేశాడు. (ఆ రోజుల్లో రెండు అణాలంటే చాల ఎక్కువే) క్లాసు మానిటర్, స్కౌట్ గ్రూపుకి నాయకుడు కావటం చేత సత్యం పుష్పగిరికి తప్పనిసరిగ వెళ్ళవలసివచ్చింది. ఇదేలా సాధ్యం అని సత్యం ఆవేదన చెందాడు.
ఈ రోజుల్లో పిల్లలకివలె సత్యానికి డజన్ల కొద్ది డ్రెస్సులు ఉండేవికాదు నిక్కరు షర్టు ఒక్క జత మాత్రం ఉండేవి. రోజూ స్కూలునుండి రాగానే తువ్వాలు చుట్టుకొని వాటిని ఉతుక్కొని ఆరేసికొనేవాడు. నిప్పుబొగ్గులు వేసిన ఇత్తడి చెంబుతో వాటిని ఇస్త్రీ చేసికొనేవాడు. ముడుతలు పోడానికి ఒక్కొక్కప్పుడు బట్టలను రాత్రంతా ట్రంకు పెట్టెకింద పెట్టేవాడు. ఇలా మొత్తంమీద తన బట్టలను శుభ్రంగా ఉంచుకొని ఒక్క జతతో సంవత్సరమంతా గడిపేవాడు.
కుటుంబగౌరవానికి లోపం కలుగుతుందని తనకి ఒక్క జత బట్టలే ఉన్నాయనిగాని స్కౌటు యూనిఫారం కొనుక్కోలేననిగాని సత్యం టీచరుకి చెప్పలేదు. స్కౌటు కాంపుకి వెళ్ళవద్దని అనుకున్నాడు. రమేష్ తన తండ్రిని తనకు స్కౌటు యూనిఫారం చాలనచ్చినదని అందుకని రెండు జతలు కుట్టించమని అడిగాడు.
రెండు రోజులైన తరువాత రమేష్ ఒక జత యూనిఫారంని కాగితంలో చుట్టి స్కూలుకి తీసికొని పోయి సత్యం డెస్క్ మీద పెట్టి ఒక కాగితంపైన “రాజూ! నీవునా సోదరుని వంటివాడివి. నీవు ఈ యూనిఫారం తీసికోవాలి లేకపోతే నేను జీవించలేను” అని వ్రాసి దానిపై పెట్టాడు.
సత్యం అదిచూచి ఆ కాగితం చింపివేసి ఇంకొక కాగితంపై “నీకు నా స్నేహం నిజంగ కావాలి అనుకుంటే నన్నిలా బహుమతులు తీసికొమ్మనటం సరికాదు. ఇది మన స్నేహాన్ని చెడకొట్టుతుంది. మన సోదరభావం ఇలాగే కొనసాగాలంటే ఇటువంటి బహుమతులు ఇవ్వవద్దు. స్నేహం అనేది రెండు హృదయాలకు సంబధించింది. ఇచ్చిపుచ్చుకోడాలు అందులోని నైర్మల్యాన్ని పాడుచేస్తాయి” అని వ్రాసిపెట్టాడు. రమేష్ ఏమీ చేయలేక యూనిఫారం వెనక్కి తిరిగి తీసికొని వెళ్లిపోయాడు. పుష్పగిరిలో పండుగకి ఇంకమూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. పిల్లలందరూ ‘రాజూ! నీవు రాకపోతే మేమూ పోము’ అన్నారు. ఈవిధంగ సత్యం మిద చాల వత్తిడి వచ్చింది.
ప్రతిపిల్లవాడు 10 రూ||లు బస్సుకోసం 2 రూ॥లు ఇతర ఖర్చులకోసం మొత్తం 12 రూ॥లు చందా ఇచ్చారు. సత్యం దగ్గర 12 రూ||లు లేక పోవటం వలన ఆగుంపుతో వెళ్లే ప్రశ్నే లేదనుకున్నాడు. చివరికి తనకి విపరీతమైన కడుపునొప్పి వచ్చినట్లు నటించాడు. దానితో టీచర్లు, విద్యార్థులు సత్యం లేకుండానే వెళ్లవలసివచ్చింది.
వాళ్ళు వెళ్ళిన తరువాత సత్యానికి ఒక ఆలోచన వచ్చింది. తన స్కూలు పుస్తకాలు అమ్మేసి పుష్పగిరికి నడచివెడితే బాగుంటుంది అనుకున్నాడు. తన పుస్తకాలన్ని సరిక్రొత్తగ ఉన్నాయి. కొన్నయితే ఏనాడూ తెరిచినవి కూడ కాదు. తను పాస్ అయిపోయిన క్లాసులో ఒక బీదహరిజన బాలుడు చేరాడు. ఆ పిల్లవాని దగ్గరకు పోయి “ఇవన్నీ కొత్త పుస్తకాలే అయినా నీకు సగం ధరకే ఇస్తాను” అన్నాడు. కాని ఆ పిల్లవాడు ఆ సగం ధరకూడ ఇవ్వలేని బీదవాడని తెలుసుకొని పోనీలే! ఈపుస్తకాలన్నీ తీసికొని అయిదు రూపాయలు ఇవ్వు నాకంత కంటె అవసరంలేదు” అన్నాడు. బస్సు ఖర్చులేదు కనుక తన భోజనానికి చిల్లర ఖర్చుకి అది సరిపోతుందని అతని అభిప్రాయం. హరిజన బాలుడు సంతోషించి అయిదు రూపాయలు చిల్లర చిల్లరగ ఇచ్చాడు.
ఈ చిల్లరంతా వేసుకోడానికి సత్యానికి జేబులులేవు. ఒక చిరిగిపోయిన చొక్కా నుండి చించిన గుడ్డ పీలికలో ఆచిల్లర మూటగ కట్టుకున్నాడు. మూట గట్టిగ బిగిస్తుంటే ఆగుడ్డ చిరిగి చిల్లరంతా కిందపడిపోయింది.
ఆ చప్పుడుకి ఇంటి ఆమెవచ్చి “ఈ డబ్బంతా నీకెక్కడిది? నాయింట్లోంచి దొంగిలించావా” అని అడిగింది. సత్యం జరిగిన విషయం చెప్పినా ఆమె నమ్మలేదు. ఆమెను నమ్మించి తన నిజాయితీ నిరూపించుకోటానికి తన పుస్తకాలు కొనుక్కొన్న విద్యార్థిని తీసుకువచ్చి చెప్పించినా ఆమె నమ్మలేదు, ఆమె సత్యాన్ని కొట్టి నువ్వు ఈ డబ్బు నాయింట్లో దొంగిలించావు కనుక ఈ ఇంట్లో నీకు అన్నం పెట్టను.” అని శిక్షించింది.
కుటుంబగౌరవం ఎక్కడ చెడిపోతుందో అనే చింత సత్యాన్ని వేధించింది. ఏం జరిగింది? ఎందుకని అన్నం తినటంలేదు? అని అందరూ అడగటం అతనికి ఇష్టం లేకపోయింది. కుటుంబం కీర్తి నిలపెట్టాలని వెంటనే అతడు ఇల్లువదలి తొమ్మిది మైళ్ళు నడచి పుష్పగిరి వెళ్లాడు.
అది మండువేసవి త్రాగేనీరు దొరకటం కష్టం. సత్యానికి చాలా దాహం వేసింది. పశువులను కడిగే నీళ్ల తొట్టెలో నీళ్లేగతి అయినాయి. ఆ మురికి నీరే క్రొద్దిగ తాగి దాహం తీర్చుకున్నాడు.
పుష్పగిరి చేరుకోగానే తన తోటివారిని కలసికొని తనకు కేటాయించిన పనిలో నిమగ్నుడైనాడు సత్యం. తనతోటి పిల్లలందరిని నిస్వార్ధ సేవ చేయుటలో ప్రోత్సహించాడు. సత్యం మూడు రోజులు ఏమీ తినలేదు. ఎవరూ దీనిని గుర్తించలేదు కాని సత్యం స్నేహితుడు రమేష్ మాత్రం పసికట్టాడు. ఎవరైనా తెలిసికొంటె సత్యానికి ఇష్టం ఉండదు. కాన మెల్లగ ఏదో ఒకటి తినడానికి తెచ్చి ఇచ్చేవాడు ఈ ప్రకారంగ మిగిలిన రోజులన్నీ గడిచిపోయాయి.
తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. సత్యం రమేష్ ఒక అణా అప్పు అడిగాడు. అది ఊరికే ఇవ్వటం కాదని అప్పుగ అని స్పష్టంచేశాడు. ఆ అణాతో పూలు పళ్ళు కొని తొమ్మిది మైళ్ళు నడచి వెనక్కివెళ్లాడు.
సత్యం ఎనిమిదిరోజులు ఊళ్లో లేకపోవుటతో ఇంటికి మంచినీళ్లు తెచ్చేవారెవరూ లేకపోయారు. ఆ కుటుంబ సభ్యులు నీళ్లులేక చాలకష్టపడ్డారు. ఇంతేకాకుండ ఆ ఇంటి ఆమె సత్యంమీద శేషమరాజుకింకా ఎన్నో చాడీలుచెప్పారు.
సత్యం ఇంటికి చేరుకునేప్పటికి అంతవరకు పట్టుకొని ఉన్న కోపాన్ని అంతా శేషమరాజు సత్యంపై వెళ్లగ్రక్కాడు. నోటు పుస్తకంలో రూళ్ళ కఱ్ఱతో గీతలు గీస్తున్న అతడు ఆ కర్రనుపెట్టి సత్యం వేళ్లపై కఱ్ఱు విరిగేదాక కొట్టాడు.
ఇంట్లో నీళ్లులేని కోపాన్ని శేషమరాజు సత్యంపై ఎలా తీర్చుకొన్నాడో ఇరుగు పొరుగువారికి తెలిసింది. తండ్రి వెంకప్పరాజు కమలాపురానికి కొద్దిరోజుల్లోనేవచ్చారు. ఇరుగు పొరుగువారు తండ్రికి శేషమరాజు సత్యాన్ని కొట్టిన విషయం సత్యం పడుతున్న బాధలు చెప్పారు. తండ్రి సత్యం ఒంటరిగ కనిపించినపుడు చెయ్యి ఎందుకు వాచి ఉన్నదని చేతికి కట్టు ఎందుకున్నదని అడిగారు. సత్యాన్ని గురించి తనకు చాల చింతగ ఉన్నదని పుట్టపర్తికి తిరిగి వచ్చినట్లయితే ఈ కష్టాలు ఉండవని అన్నారు. సత్యం తండ్రితో మెల్లగ మంచిగ మాట్లాడి కమలాపురంలో ఇంటివారు కష్టపడుతారని తానూ వెంటనే వచ్చినట్లయితే ప్రజలు వారిని గూర్చి చెడ్డగ మాట్లాడుకొంటారని చెప్పి సమాధానపరచి ఏదిఏమైన త్వరలోనే పుట్టపర్తికి వచ్చెదనని కూడ మాట ఇచ్చాడు.
ఇప్పుడు కూడ స్వామి కుటుంబప్రతిష్టకు భంగకరమైన విధంగ ఏమీ మాట్లాడరాదని విద్యార్థులకు బోధిస్తారు.
సత్యం పుట్టపర్తికి రాగానే సత్యం ఎడమభుజంపై చర్మం నల్లగ కమిలిపోయి ఉండుట ఈశ్వరమ్మగారు చూచారు. ఇదేమి అని ఆమె అడుగగ సత్యం నవ్వేశారు. ఆమె నొక్కి నొక్కి అడుగగ నీళ్లకుండల కావడి మోయుటవలన జరిగి ఉండవచ్చునని “అమ్మా అది నావిధి. విషపూరితమైన నీటిని త్రాగి పిల్లలెలా ఉంటారు? నేను జీవనాధారమైన నీటిని మోయుటకే వచ్చాను. ఈ సేవచేయుటకే నేనున్నది” అని నర్మగర్భంగ చెప్పారు.
[Illustrations by C.Sainee, Sri Sathya Sai Balvikas Alumna]