స్వామి బాల్య జీవితమునకు చెందిన కథలు వారి ప్రేమతత్త్వపు మెఱుపులు -మొదటిభాగము – రెండవభాగము
కవిత్వంలో సత్యానికి మంచి నేర్పుండేది. దుకాణదారులు వాళ్ళసరుకులు బాగా అమ్ముడుపోయేటందుకు ప్రకటనలన్నీ సత్యంతో వ్రాయించుకునేవారు. ఆ పాటలు చాల ఆకర్షవంతంగ ఉండి పిల్లలచే ఉత్సాహంగపాడబడేవి. ఆ వస్తువుల అమ్మకాలు విపరీతంగ పెరిగేవి. దానితో సత్యం పాటలకి పద్యాలకి గిరాకీ విపరీతంగ ఉండేది.
సంఘంలో మంచిమార్పులు తీసికొని రావడానికి కూడ సత్యం పద్యాలు ఉపయోగపడేవి. ఆ ఊరి కరణం బాగ ధనాన్ని పోగుచేశాడు. దానితో అవాంఛనీయమైన అవినీతికరమైన అలవాట్లు అలవడ్డాయి. హిట్లేరియన్ మీసాలు పెట్టుకుని సంప్రదాయమైన వస్త్రాలు మానివేసి ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించి బంగారు గడియారం పెట్టుకొని గర్వంగ తిరిగేవాడు.
ఒకరోజు సుబ్బమ్మ సత్యం దగ్గరకు వచ్చి ‘రాజూ! నీవెంతమందికో సలహాలిచ్చావు. నా భర్త తప్పుమార్గంలో పోతున్నాడు. నీవాయనను ఎందుకు సరిచెయ్యవు? అని అడిగింది. కరణం సాయంత్రాం ఆయన ఇంటిముందు తులసి చెట్టుముందు కూర్చునేవాడు. సత్యం ఒకమంచి బాణిలో పాటకట్టి పిల్లలకి నేర్పించాడు.
ఆపిల్లలు సాయంత్రాలపూటలో ఆపాట పాడుతూ కరణం ఇంటిముందు తిరిగేవారు. “ఈ రోజులలో పురుషులకి స్త్రీలకి ఏమయింది? పురుషులు తమ ఎడమచేతికి ఒకతోలు పట్టీకట్టుకొని గర్విస్తారు! ఈ రోజుల్లో కొందరి స్త్రీ పురుషుల వేషదారణను గూర్చి గౌరవంగ మాట్లాడుకోలేము. అవినీతి మానకపోతే ప్రజలతన్ని సంఘంనుండి బహిష్కరిస్తారు. స్నేహితులతన్ని చెప్పులతో కొడతారు. అని అర్ధం వచ్చేపాట వ్రాసి చివరికి దానిలో హిట్లరు మీసాలను కూడ ప్రస్తావించేప్పటికి కరణంకి చాలకోపం వచ్చి లేచి లోపలికి వెళ్ళిపోయాడు. తరువాత ఆపాటపాడిన పిల్లలను పిలచి ఆ పాట ఎవరు వ్రాశారని అడిగాడు. వాళ్ళు రాజు వ్రాశాడని చెప్పారు. కరణానికి ఈ మొత్తం నాటకం వెనుక రాజు ఉన్నాడనే అనుమానం మొదటినుండి ఉన్నది.
సత్యాన్ని పిలచి రాజూదయచేసి ఇటువంటి పాటలు పిల్లలకు నేర్పవద్దు అని ప్రార్థించాడు. సత్యం “అయ్యా! మీరు ఈ గ్రామానికే పెద్ద ఇటువంటి పనులు మీరు చేయరాదు” అన్నాడు. అప్పటికే హిట్లరు మీసాలు తొలగించి వేసుకొన్న కరణం ఇకముందు సరిగా ప్రవర్తించెదనని మాట ఇచ్చాడు. సత్యం కూడ ఇంక కరణాన్ని బాధించనని మాట ఇచ్చాడు. సుబ్బమ్మ చాల సంతోషించింది.
సత్యం ఎంతో చక్కని పద్యాలు వ్రాసే శక్తికి ఇంకొక మంచి నిదర్శనం చెప్పుకోవచ్చు. భారత స్వాతంత్ర్యోద్యమం జరుగుతున్న ఆ రోజులలో ఎన్నో ప్రదేశాలలో దానికి సంబంధించిన బహిరంగ సభలు నిర్వహింపబడుతూ ఉండేవి. బ్రిటిషు పోలీసువారు. ఈ సభలకు వచ్చి వాటిని భంగపరచేవారు. ఇద్దరు కాంగ్రెసువారు సత్యం దగ్గరకు వచ్చి ” ప్రస్తుత పరిస్థితిని వర్ణిస్తూ నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో పద్యాలు వ్రాసి మాకు ఇవ్వు. బుక్కపట్నంలో జరిగే సభలో మేము వాటిని ఉపయోగించుకుంటాము” అని అడిగారు. సత్యం వ్రాసి ఇచ్చాడు. కాంగ్రేసువారు ఆ పద్యాలే కాకుండ సత్యాన్ని కూడ ఆ సభకు తీసుకువెళ్ళారు. సత్యానికి చీరకట్టి స్త్రీ వేషం వేశారు. ఒకచిన్న ఉయ్యాలను తయారుచేసి అందులో ఒక రబ్బరు బొమ్మను పడుకోబెట్టారు. సత్యం రంగస్థలంపై నిల్చుని ఆ బొమ్మ శిశువుకి లాలిపాటపాడాడు. “ఓ శిశువా! ఏడవకు చిరునవ్వులోలికించకుండ నువ్వు ఇలా ఏడుస్తుంటే నిన్ను భరతమాత పుత్రుడవని ఎట్లు పిలుతురు?” అనే పల్లవితో ఈపాట ప్రారంభం అయింది. ఆపాటలో శిశువుని ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. “ఓ శిశువా! హిట్లరు రష్యాపై దండెత్తినాడని, రష్యావారు తిరిగి ఎదిరించలేకపోయినారని ఏడుస్తున్నావా? వద్దు వద్దు ఎర్రసైన్యం (రష్యన్ సైన్యం) ప్రతీకారం తీర్చుకుంటూ ప్రతిఘటించే సమయం వస్తుంది. మనదేశంలో ఐకమత్యం లేదని ఏడుస్తున్నావా? వద్దు ఏడవకు. అందరూ ఒకటిగా కలసి భరతదేశం ఐకమత్యానికే చిహ్నంగ తయారయే రోజువస్తుంది. అంటూ సాగిందీపాట. పోలీసువారీ పాటకి సంతోషిస్తూ చప్పట్లు కొడుతూ తాము కూడ పాడటం మొదలుపెట్టారు. బ్రిటిషువారు కూడ అక్కడకు వచ్చి విన్నారు. తెలుగుమాట ఒక్కటీ అర్ధంకాకపోయినా సత్యం పాడేతీరు మధురంగ ఆకర్షణీయంగ ఉండటంతో లయబద్ధమైన ఆ పాటకు వీరు కూడ చప్పట్లు కొడుతూ సంతోషించారు. సభచాల జయప్రదంగ ముగిసింది.
ఉరవకొండ హైస్కూలులో సత్యం ప్రఖ్యాత నర్తకి ఋష్యేంద్రమణిగ నటించి అందరిని నమ్మించాడు. అది ఆస్కూలు వార్షికోత్సవం. స్కూలు కొఱకై కొత్తభవనాలు నిర్మించుటకు స్కూలువారు డబ్బుపోగుచెయ్యాలని నిర్ణయించారు. ఋష్యేంద్రమణి నృత్యప్రదర్శనను ఏర్పాటుచేసి టికెట్లు అమ్మారు. కాని చివరిక్షణంలో ఏదో కారణంతో ఋష్యేంద్రమణి రాలేకపోయింది. ఆ ఉత్సవానికి జిల్లా కలెక్టరైన బ్రిటిష్ వ్యక్తిని, జిల్లా బోర్డు ప్రెసిడెంట్ (స్త్రీ) ను ఆహ్వానించియుండుటచేత స్కూలు ప్రధానోపాధ్యాయుడు చాల చికాకుతో కంగారుపడ్డారు. అలా భయపడుతున్న ఆయన దగ్గరకు సత్యంవెళ్ళి “అయ్యా! ఆహ్వానితులను, ప్రేక్షకులను నిరాశపరచేకంటె ఆనర్తకి చేసే నటనా కార్యక్రమం అంతా ఈసాయంత్రం నేను చెస్తాను” అన్నాడు.
ఋష్యేంద్రమణి తన తలపై ఒకసీసా, ఆ సీసామూతిపై ఒక పళ్లెం, ఆ పళ్లెంలో వెలుగుతున్న ఒక కొవ్వువత్తి పెట్టుకొని నాట్యంచేస్తూ వంగి నేలమీదనుండి ఒక రుమాలును నెత్తిపైనున్న వస్తువు లేవీ కిందపడకుండా పైకి తీసేది.
సత్యం చీర, గజ్జెలు కట్టుకొన్నాడు. పల్లెలో ఒకపాతకారులో సత్యాన్ని తీసుకువచ్చి ఋష్యేంద్రమణి వస్తోంది అని ప్రకటించారు. ప్రేక్షకులంతా జాగ్రత్తగా సర్దుకొనికూర్చున్నారు.
సంగీత వాద్యములు మ్రోగుచుండగ ఆకర్షణీయమైన గజ్జెలమ్రోతలో అందరి చూపులను ఆకట్టుకొంటూ సత్యం రంగస్థలప్రవేశం చేశాడు. ఒక టీచరు అతని తలపై సీసాను, పళ్లెం, కొవ్వొత్తి వీటన్నింటిని పెట్టారు. ఇలా విడివిడిగ తెచ్చిపెట్టకపోతే అవన్నీ పెట్టి సీసాని నెత్తికి అంటించారని ప్రేక్షకులు అనుకోవచ్చుకదా! నాట్యం అంతాచేసి చివరకు రుమాలును తీయుటకు బదులుగ వంగి కనురెప్పలతో క్రింద ఉన్న సూదినిఎత్తి ఋష్యేంద్రమణిని మించిపోయాడు సత్యం. ప్రేక్షకుల ఆహ్లాదం మిన్నుముట్టింది. బ్రిటిష్ కలెక్టరు వేదిక పైకివచ్చి ఒక పతకం (మెడల్) ఋష్యేంద్రమణి చీరకు గుచ్చి బహూకరించాలనుకున్నాడు. దీన్ని తప్పించుకోవాలని సత్యం “నేను స్త్రీని కనుక సంప్రదాయవిరుద్ధంగ నాచీరకు పతకం తగిలించవద్దు. నాచేతికివ్వండి” అన్నాడు.
మరుసటిరోజు బహుమతి ప్రధానోత్సవం జిల్లా బోర్డు ప్రెసిడెంట్ అయిన మహిళ ఋష్యేంద్రమణి ప్రదర్శన వలన పోగైన డబ్బుకు మెచ్చుకోలుగ, కృతజ్ఞతాసూచకంగ ఋష్యేంద్రమణికి ఒక చీరను బహూకరించాలనుకున్నారు. ఋష్యేంద్రమణి అని పేరు పిలవగానే అందరూ చుట్టూచూశారు. ప్రేక్షకులలోనుండి నిక్కరు వేసుకున్న ఒకచిన్న బాలుడు వచ్చాడు. పోలీసువారాతనిని ఒక ప్రక్కకు నెట్టివేసి అడ్డుతప్పుకో. ఋష్యేంద్రమణి వస్తోంది అన్నారు. అపుడు ప్రధానోపాధ్యాయుడే స్వయంగ సత్యాన్ని వేదిక మీదకు తీసికొనివచ్చి క్రిందటి రోజు సాయంత్రం ఋష్యేంద్రమణిగ నాట్యం చేసినది ఈ చిన్నపిల్లవాడే అని ప్రకటించారు. జిల్లాబోర్డు అధ్యక్షురాలైన ఆ మహిళ ఎంతో సంతోషించి సత్యాన్ని ఎత్తుకొని నువ్వు ఒక స్కూలుకేకాదు, మొత్తం దేశానికే కీర్తితెచ్చావు అన్నారు. అప్పటినుండి ఆమె ఎక్కడికి వెళ్లినా ఈ సంఘటననే చెప్పుతుండేవారు. సత్యమంటే ఆమెకి అంతగౌరవం.