Swami’s Childhood Stories and Glimpses of his Love – Part III
మాఘమాసంలో సత్యం పిల్లలందరిని తెల్లవారుజామున 4 గంటలకు ఆంజనేయస్వామి గుడికి తీసికొని వెళ్లేవాడు.
కొందరు మరీ చిన్నపిల్లలు అంత పెందలకడనే లేవలేకపోతే సత్యం వాళ్ళని ఎత్తుకొని తీసుకొని పోయి దగ్గరలోనే ఉన్న చెరువులో మాఘస్నానం చేయించి ఆలయానికి ప్రదక్షిణచేయించడానికి తీసుకొని వెళ్లేవాడు.
పిల్లలందరు ప్రదక్షిణ చేస్తుంటే సత్యం గుడిలో కూర్చునేవాడు. ఒకరోజు వాళ్లందరు సత్యం కూడ వాళ్ళతో పాటు ప్రదక్షిణచెయ్యాలని లేకపోతే తాముకూడ చేయమని పట్టుపట్టారు. మొదట్లో తాను గుడిలోకూర్చుని వాళ్ళందరిని కనిపెట్టి చూస్తున్నాననే నెపంచెప్పి తిరస్కరించినా చివరికి ప్రదక్షిణ చేయకతప్పలేదు సత్యానికి.
తరువాత ఈ సంఘటనను గూర్చి చెప్తూ స్వామి సాక్షాత్తు ఆంజనేయుడేవచ్చి తనను ప్రదక్షిణ చేయకుండ ఆపాడని “ఓస్వామీ! శ్రీరామా! నేను నీకు ప్రదక్షిణ చెయ్యాలి కాని నువ్వు నాకు చేయరాదు” అని బ్రతిమాలినాడని చెప్పియున్నారు.
పిల్లలందరు సత్యాన్ని పట్టుకొని లాగేవారని అయినా అతడిని కొంచెమైనా కదల్చలేకపోయేవారని అంటారు. ఆంజనేయుని సాధారణమైన కోతిగ భావించవద్దని ఆంజనేయుడే తనను గుడికి ప్రదక్షిణచేయుటకు కూడ ఒప్పుకోలేదని స్వామి పిల్లలతో అన్నారు.
అప్పటినుండి పిల్లల హృదయాలలో ‘ఒక గొప్ప మార్పు వచ్చింది. వారు ఆంజనేయస్వామి గుడిలో చూచినదానిని గ్రామం అంతా తిరిగి అందరికి చెప్పారు.
ఈవార్త సుబ్బమ్మకి తెలిసింది. ఆమరుసటిరోజు ఆమె సత్యాన్ని తన ఇంటికి వచ్చి తాను చేసిన దోసెలు తినమని కోరింది. ఆ రోజులలో ఇడ్లీ, దోసె వంటివి భాగ్యవంతుల ఆహారంగ పరిగణింపబడేవి. సత్యానికి ఎప్పుడూ ఒంటరిగా కూర్చుని తినటం ఇష్టం లేదు. పిల్లలందరికీ కూడ దోసెలు తినిపించేట్లయితే తాను వచ్చెదనని సుబ్బమ్మతో చెప్పాడు. అలాగే అని సుబ్బమ్మ అందరికీ దోసెలు తయారుచేసింది.
సత్యం లేనపుడు సుబ్బమ్మ పిల్లలందరినీ పిలచి మీరు రాజుతో స్నేహం చేయ కలిగినందులకు మీరెంత అదృష్టవంతులో తెలుసా! అతడు సామాన్యబాలుడు కాదు అని చెప్పేది. “అతని ఆజ్ఞను అనుసరించండి ఎట్టి పరిస్థితులలోను అతనికి అవిధేయులు కాకండి. అతనిని సంతోషపెట్టి మీరు సంతోషంగ ఉండండి. మీరేదైనా తప్పుచేస్తే – అతని బాధపైకి చెప్పడు కాని ఆ చర్యల ఫలితాలను మీరు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి అతడు అసంతృప్తి చెందేట్లుగ ఏనాడూ ప్రవర్తించవద్దు” అని ఆమె వారికి చెప్పేది.
సుబ్బమ్మ తన జీవితాన్ని స్వామికి అంకితం చేసింది. ఆమె కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు స్వామికి సేవ చేసింది. అంతేకాదు స్వామి భక్తులందరికి ఉచితంగ ఆహారం సమకూర్చేది. ఒకరోజు స్వామి ఆమెతో ఎడ్లబండిలో ప్రయాణంచేస్తూ “సుబ్బమ్మా! నీకేంకావాలి? అని అడిగారు. ఆమె స్వామి నాకేమీ వద్దు కాని నేను నా ప్రాణం విడిచేటప్పుడు నీచేతులతో నానోట్లో కాసిని నీళ్లు పొయ్యి అని అడిగింది. ఆమె కోరిక తీరుస్తానని స్వామి మాట ఇచ్చారు. ఆ తరువాత కొందరి భక్తుల కోరికపై స్వామి పదిరోజుల కొఱకు చెన్నై వెళ్లారు. “అది యుద్ధకాలం” ప్రతినిమిషం వాయుసేన దాడుల ధ్వనులు వినిపిస్తూ ఉండేది. వీధులన్ని నిర్మానుష్యంగ మారేవిఈ పరిస్థితులలో స్వామి అనుకున్న రోజుకి పుట్టపర్తికి రాలేకపోయారు. ఇంతలో సుబ్బమ్మ విపరీతంగ జబ్బుపడింది. ఆమెను బుక్కపట్నం తీసుకువెళ్లారు. ఆమె అక్కడ మరణించింది. ఆమె బంధువులు వ్యంగ్యంగ ఆమె చివరిక్షణాలలో నోట్లో నీళ్లుపోస్తానని స్వామిమాట ఇచ్చారు. ఎక్కడవచ్చారు? అని అన్నారు.
స్వామి చెన్నైనుండి తిరిగివస్తూ స్మశానవాటికను దాటుతున్నారు. చెక్కదూలాలు అక్కడ గుట్టగ పెట్టబడి ఉన్నాయి. ఎవరిని దహనం చేయబోతున్నారని స్వామి అడిగారు. చాకలి సుబ్బన్న “స్వామీ! సుబ్బమ్మ మూడు రోజుల క్రితం చనిపోయింది” అన్నాడు. సుబ్బమ్మ మృతదేహం ఉంచిన ఇంటికి స్వామివెళ్లారు. స్వామిని చూడగానే స్వామి అక్క ఏడుస్తూ “బాబా! సుబ్బమ్మ తననోట్లో మీరు చివరిక్షణాలలో నీరు పోస్తారని ఎదురుచూచి చూచి నిరాశతో చనిపోయింది”. అలా ఎన్నటికీ జరగదు అన్నారు స్వామి. స్వామి కొంచెం నీరు తెమ్మని అడిగి సుబ్బమ్మ ముఖం మీదనుండి వస్త్రం తొలగించారు. అప్పటికే ఆమె చనిపోయి మూడు రోజులగుటచేత శరీరమంతా చీమలు ప్రాకుతున్నాయి. స్వామి ప్రేమగ సుబ్బమ్మా అని పిలిచారు. ఆమె కళ్ళుతెరచి స్వామిచేతులు పట్టుకొని ఏడ్చారు. ఆమె కన్నీళ్ళు తుడిచి స్వామి ఇపుడు ప్రశాంతంగ కళ్ళుమూసుకో అన్నారు. పవిత్రోదకం ఆమె నోట్లో పోసి తనమాట నిలపెట్టుకున్నారు స్వామి.
ఇంతవరకు స్వామి బాల్యదశలోని కధలు వింటున్నాం. స్వామి విద్యార్థి దశలోనే ఆదర్శవంతమైన జీవితంగడిపారని వీటివల్ల గుర్తించాలి. బాల్యంలో ఇన్ని కష్టాలు అనుభవించుటకు కారణమే లేదు. కేవలం ఆదర్శాన్ని చూపించుటకే అలా చేశారు. ధనం, కాలం ఏదీ వృధాచేయరాదు. మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, మంచిపనులు అలవరచుకోవాలి. “మీ జీవితాలను దైవంపై ఆధారం చేసుకోండి. భగవంతుని సంతోషపెట్టండి. జీవితాలను చరితార్ధం చేసుకోండి” అంటారు స్వామి.