మతృదేవత ఈశ్వరమ్మ ఆమె దివ్య పుత్రుడు
తల్లి ఈశ్వరమ్మ జీవితం మంచితనంతో, నిర్మలత్వంతో కూడినది. “నేను నా అవతార జననమునకు నిర్ణయించుకొన్నప్పుడు నాతల్లి ఎవరై ఉండవలసినది నిర్ణయించుకున్నాను” అని బాబా చెప్పారు. కరుణార్ద్ర హృదయము, పవిత్రత మూర్తీభవించిన నిరక్షరాస్యయైన పల్లెటూరి పేదగృహిణి ఈశ్వరమ్మ అవతార పురుషునిచే ఎన్నుకొనబడిన తల్లి.
అవతారపురుషులు, మతప్రవక్తలు జన్మించుటకు ముందు మహిమాన్విత సంఘటనలు జరుగుట సర్వసాధారణము. ఈశ్వరమ్మ అత్తగారికి కలలో శ్రీ సత్యనారాయణస్వామి కనుపించి ఆమెకేదైన అసాధారణ విషయం జరిగితే భయపడవద్దని చెప్పినారట. ఒకనాడు ఈశ్వరమ్మ బావివద్ద నీళ్ళు తోడుతుండగా ఒక పెద్ద నీలపు కాంతిగోళము దొర్లుకుంటూ ఆమె దగ్గరకువచ్చి ఆమె గర్భములోకి జారిపోగా ఆమె మూర్ఛపోయింది. అవును!! అప్పుడే భగవాన్ బాబా ఆమెను తల్లిగ ఎన్నిక చేసుకొన్నారు.
శిశువు సత్యం తొమ్మిది నెలలవాడై ఉండగ ఒకరోజు ఈశ్వరమ్మ శిశువుకి స్నానం చేయించి బట్టలు తొడిగి, కాటుక, విభూతి, కుంకుమ పెట్టి ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపింది. ఇంతలో పాలుకాగుతుండగ వెనుకకు తిరిగి పొయ్యిదగ్గరకు వెళ్ళింది. ఉన్నట్లుండి శిశువు సత్యం ఏడ్చాడు. ఎప్పుడూ ఏకారణానికీ ఆకలివేసినా, బాధకలిగినా ఏడువని ఆ శిశువు నిష్కారణంగ ఏడ్చాడు.
ఆమె శిశువును ఎత్తుకొని ఒళ్లోపడుకో పెట్టుకున్నది. ఆశ్చర్యం!! ఆమె ఆ శిశువు చుట్టూ చల్లని తెల్లని పెద్దకాంతి పుంజంచూచింది సంతోష సంభ్రమాలలో మునిగిపోయింది.
సత్యం ఆగ్రామంలోని ప్రతివారి మెప్పును, ఆకర్షణను పొందాడు. ఈర్ష్యాద్వేషములతో కూడిన ‘దృష్టి’ ఆతనికెక్కడ తగులుతుందో అని ఈశ్వరమ్మ భయపడింది. కొబ్బరికాయలుకొట్టి, కర్పూరం వెలిగించి ఎన్నోవిధాలుగ అతనికి దృష్టితీసేది. కాని సత్యం ఆనాటి కృష్ణుడు యశోదతో చెప్పినట్లుగ “ఎవరిదృష్టి నన్నేమి చేస్తుంది” అంటూ పారిపోయేవాడు. మట్టి నోట్లోవేసుకున్నందుకు కోపపడితే ఆదివ్య శిశువు “నేను కేవలం ఒక చిలిపి చిన్నపిల్లవాడినని భ్రమపడకండి” అనేవాడు. క్రొత్తవారు నీపేరేమని అడిగితే నాపేర్లలో ఏదని చెప్పను? అనేవాడు. బాబా ఇప్పటికీ “అన్నీ పేర్లునావే, అన్ని రూపాలు నావే” అంటారు. ఈశ్వరమ్మకు సత్యం ప్రతిరోజు చిన్ని కృష్ణుని గుర్తుచేస్తూ ఉండేవాడు. ఆమెకుకూడ అదిచాల ఇష్టంగ ఉండేది.
ఆరుబయట నిలబడి, నిశ్శబ్దంగా ఆనందంగా కొండలు, నక్షత్రాలు, ఆకాశం చూస్తూ ఉండడం సత్యానికి చాల ఇష్టం. కొంచెం ఎదిగిన తరువాత మిగిలిన పిల్లలతో వీధిలో దాగుడుమూతలాడుకుంటూ దారిపోయే ప్రతి ఆవును, గేదెను ప్రేమతో వీపు నిమిరేవాడని ఈశ్వరమ్మగారు చెప్పేవారు. ఒకసారి ఒకచిన్న పిల్లవాడు ఒంటిమీద బట్టలు లేకుండ చలికి వణుకుతూ వీధిలో నిల్చుని ఉన్నాడు. సత్యం అతడిని చూడగానే తన చొక్కాతీసి అతనికిచ్చేశాడు. “ఎవరైనాసరే బాధలో ఉంటే ఆబాధను సత్యం తీర్చాల్సిందే” అలా ఉండేవాడు. అనేవారు ఈశ్వరమ్మ. తాను ఎరిగిఉన్న పిల్లలందరికంటే సత్యం మాట మృదుమధురంగ ఉండేదని ఆమె అనేవారు.
“సత్యం! నీకేమి కావాలో చెప్పు! అని ఆమె తరచు సత్యాన్ని బ్రతిమాలేవారు. ఇష్టాయిష్టాలు, దేనియెడలనైనా కావాలనే కోరిక సత్యానికి ఉండేవేకావు. తన చుట్టూ ఉన్న పిల్లలు సంతోషంగ ఉంటే అతని ముఖం చిరునవ్వుతో వెలిగిపోయేది.
బాబా 14 సం||ల పిల్లవాడుగ ఉన్నప్పుడు తల్లి ఈశ్వరమ్మకు ఆమె జీవితంలో రానున్న కాలంలో ఎటువంటి పాత్రను పోషించాలి అనే విషయంలో మొదటిసారి శిక్షణ ఇచ్చారు. తన భక్తులు తనను పిలుస్తున్నారని తానింక ఆమెకు చెందినవాడనుకానని ఒక చేదునిజాన్ని ఆమెకు చెప్పారు. అయితే నేనెవరికి చెందినదానను? అని ఆమె అడిగారు. ప్రపంచానికి, అక్కడి జనానికి అని సమాధానం వచ్చింది. ఆవిధంగ ఈశ్వరమ్మ ప్రశాంతినిలయానికి వచ్చే వేలాది కుమారులకు కుమార్తెలకు తల్లి అయింది. అలా వచ్చినవారిలో రోగగ్రస్థులను, బాధాతప్తులను ఆమె మరీ ఎక్కువ ప్రేమతో చూచేవారు.
ఆమె అమాయకత్వానికి ఆమెను ఆట పట్టించటం బాబాకు ఇష్టం. స్వామి తూర్పు ఆఫ్రికాకు వెళ్లేముందు సముద్రాలపైన ఆకాశంలో స్వామి విమానంలో ప్రయాణిస్తారు అనే భావం తల్లి ఈశ్వరమ్మను కలచివేసింది. ఆమె భయం పోగొట్టడానికి స్వామి ఏప్రయత్నమూ చేయలేదు. పైగా ఆఫ్రికాలో మనుష్యులను తినే జాతివారుంటారని, అది ఒక అడ్డదిడ్డమైనదేశమని కాని అక్కడ బంగారం మాత్రం ఖర్జూరపండ్లంత చౌక అని చెప్పి భయపెట్టారు. పైగా బొంబాయిలో మధ్యాహ్నం 3 గం॥లకు టీ తాగి బయలుదేరితే 4 గంటలు వెనక్కిపోయి. అదే రోజు ప్రొద్దున 11 గం॥కి వారి భోజనం వేళకు ఆఫ్రికా చేరుతామని అమాయకురాలైన ఆ తల్లి ఆశ్చర్యపోయేట్లు చెప్పేవారు. భయంతో వణకిపోయిన ఈశ్వరమ్మ ఈ అమానుషదేశానికి పోవద్దని స్వామిని ఎంతో బ్రతిమాలింది. బాబా ఆమె దృష్టిని విశాలం చేశారు.
ఆ తల్లి ఆలోచనలు పవిత్రమైనవి. భావాలు ఉత్తమమైనవి. ఒకరోజు ఆమె “స్వామి! పుట్టపర్తి ఒక చిన్నగ్రామం. ఇక్కడ స్కూలు లేక పిల్లలు దూరం నడిచి బుక్కపట్నమో లేక మిగిలిన పొరుగు గ్రామాలకో స్కూలుకి వెళ్ళవలసివస్తుంది. ఇక్కడ ఒక స్కూలు కట్టించండి” అని అడిగారు. స్వామి అలాగేచేసి తల్లిని సంతోషపెట్టారు. ఆ తరువాత స్వామిని ఆపల్లెలో ఒక హాస్పిటల్ కట్టించమని అడిగారు ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మగారు నిర్వహించిన స్వయంసేవక బృందాలే ప్రతి ఇటుకపేర్చి హాస్పిటల్ గోడలు కట్టారు. ఆహాస్పిటల్లో ఎందరో రోగుల జబ్బులు మహిమాన్వితంగ నయం చేయబడ్డాయి. అదంతా ఆ హాస్పిటల్ కట్టిన స్వయంసేవకుల ప్రేమ ఫలితమే అన్నారు స్వామి. ఆ తరువాత ఈశ్వరమ్మ గారు “స్వామీ! నాకింక ఏచింతాలేదు. మీరు నాకోరికలు తీర్చారు. చాలవరకు గ్రామస్తుల బాధలు తీరినాయి” అన్నారు. బాబానవ్వి “ఇంకేమైనా కోరికలుంటే ఇప్పుడే అడుగు” అన్నారు. ఈశ్వరమ్మ మెల్లగా “స్వామీ వర్షాకాలంలో చిత్రావతీనది వరదలైపారుతుంది. కాని వేసవిలో పూర్తిగ ఎండిపోయి ప్రజలకు త్రాగడానికి నీరే ఉండటం లేదు. కాబట్టి ఈ పల్లెలో కొన్ని బావులు త్రవ్వించండి” అని అడిగారు. “ఈచిన్న చిన్న బావులతో ఆగను రాయలసీమ ప్రాంతం అంతటికీ మంచినీరు ఏర్పాటు చేస్తాను” అన్నాడు స్వామి.
అవతారంతో గల సాన్నిహిత్యంతో స్వామి స్త్రీ విద్యకుగల ప్రాధాన్యాన్ని గుర్తించారు. అనంతపురంలో స్వామి మహిళా కళాశాల స్థాపించినపుడు ఆమె ఎంతో సంతోషించారు.
ఆ తల్లి మూడు కోరికలు తీర్చుటతో ప్రారంభమైన కార్యక్రమం పుట్టపర్తి గ్రామానికి, ఆచుట్టు ప్రక్కల ప్రాంతాలకేకాదు ప్రపంచానికంతటికీ ఒక వరంగ మారింది. స్వామి పాఠశాలలు, విశ్వవిద్యాలయం స్థాపించి కె.జి. తరగతినుండి పి.జి. తరగతి వరకు ఉచిత విద్యాబోధనను ఏర్పాటుచేశారు. మానవతావిలువలకు ఇక్కడ బీజాలునాటి పోషించారు. అక్కడి విద్యార్థులు ఆదర్శమానవులుగ తయారవుతున్నారు. బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటి హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉచితంగ చేస్తున్నారు. స్వామి ఏర్పాటు చేసిన మంచినీటి పధకం వేలాది పల్లె ప్రజలకి లాభదాయకంగ ఉన్నది. భర్తృహీనులైన స్త్రీలకు ఇళ్ళుకట్టించి ఆర్ధిక భద్రతను ఏర్పాటు చేయుటకూడ స్వామి అనంతమైన ప్రేమకు చిహ్నం.
జీవితం ఆఖరిరోజులలో ఈశ్వరమ్మగారు బృందావనంలో ఉండగ పూర్తి మెలకువలో ఉన్నప్పుడే స్వామి ఆమెకు శ్రీరామునిగ దర్శనమిచ్చారు. 1972 మే 6వ తేదీన ఈశ్వరమ్మ ప్రొద్దున్నే మామూలుగ స్నానంచేసి కాఫీతాగి కూర్చున్నారు. ఉన్నట్లుండి బాత్రూమ్లోకి వెడుతూ ఆమె స్వామీ! స్వామీ! స్వామీ! అని మూడుసార్లు గట్టిగ పిలిచారు. స్వామి వస్తున్నా! వస్తున్నా! వస్తున్నా! అన్నారు. అంతలోనే ఆమె ఆఖరి శ్వాసను తన దివ్యపుత్రుని సన్నిధిలో వదిలారు. “ఒకరు మరణించిన తీరు వారి మంచితనానికి నిదర్శనం” అంటారు స్వామి.