శ్రీ సత్య సాయి దివ్య జీవితము దివ్య సందేశముపై – ప్రశ్నా వినోదము
Part – IV
- శ్రీ సత్యసాయి సేవా సంస్థల ముఖ్య లక్ష్యమేమి?
జ: శ్రీ సత్య సాయి సేవా సంస్థల ముఖ్య ఉద్దేశము మరియు లక్ష్యమేమనగా
a) ఆత్మ సంస్కరణ, ఆత్మ అభ్యున్నతి, ఆత్మ పరిశీలన,
b) మానవతా విలువలైన సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ద్వారా, నిస్వార్ధ సేవల ద్వారా సర్వమత సమత్వమును పెంపొందించుట.
- శ్రీ సత్యసాయి సేవా సంస్థల యందు మూడు విభాగములు ఏవి?
జ: కర్మ, భక్తి, జ్ఞానములకు ప్రతీకగా సేవా విభాగము, ఆధ్యాత్మిక విభాగము, విద్యా విభాగములు శ్రీ సత్యసాయి సేవా సంస్థల యందు రూపొందించబడినవి.
- బాల్ వికాస్ అనగా ఏమి?
జ: విద్యా విభాగమున బాల వికాస్ శిక్షణ ప్రప్రధమమైనది. వ్యక్తి వికాసమునకు మానవతా విలువలను పెంపొందించుటకు రూపొందించినది. ఈ శిక్షణ పిల్లల దయనందిన జీవితములో క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసమును, సత్శీలమును వికసింప చేయును. తద్వారా వ్యక్తిగత, సామాజిక,దేశాభివృద్ధికి తోడ్పడును.
- సేవాదళ్ యొక్క లక్ష్యమేమి?
జ: కర్తవ్యమే దైవము. కార్యాచరణయే దైవ పూజ.
- “ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న” అన్న సూక్తి అర్థమేమి?
జ:సేవ కన్నా ప్రార్ధన తక్కువ అను రీతిన ఈ సూక్తిని చూడరాదు ప్రార్థన సలుపుచు సేవ చేయవలెను. అందుకనే భగవాన్ బాబా వారు “నాలుకపై భగవన్నామము చేతులతో దీన జనసేన చేయండి” అని ప్రబోధించినారు.
- స్టడీ సర్కిల్ అనగానేమి?
జ: ఆధ్యాత్మిక సాధకులు ఒకచోట సమావేశమై ఒకే అంశముపై విభిన్న కోణములలో తమ తమ ఆధ్యాత్మిక చింతనలను వ్యక్తపరచుట తద్వారా తమ తమ సందేహములను నివృత్తి గావించుకొనుట, వాదోపవాదములకు నిందాపనిందనులకు తావివ్వక, ఒకరినొకరు చైతన్య పరచుకొనుట స్టడీ సర్కిల్.
- సత్సంగము అనగానేమి?
జ: సజ్జన సాంగత్యము వలన మూడుడు జ్ఞానిగా మార్పు చెందును. సజ్జన సాంగత్యం, సత్ గ్రంథ పఠనము, సచ్ఛీంతనల మనలో పెంపొందించుట సత్సంగము.
- భజనల యొక్క ప్రాశస్త్యమేమి?
జ: ఎక్కడ నా భజనలు జరుగును అక్కడ నేను నివసించెదను అన్నారు భగవాన్ బాబా. నామ సంకీర్తనలు ఆధ్యాత్మిక సాధనలలో ప్రప్రధమమైనది. సామూహిక భజనల ద్వారా శారీరక, మానసిక అవస్థల నుండి సాధకుడు దివ్య దివ్యత్వము వైపుకు మార్పు చెందును. భారతీయులు ఈ మహోన్నతమైన సాధన ద్వారా భగవత్సాక్షాత్కారమును పొందుచున్నారు.
- నగర సంకీర్తన అనగా ఏమి?
జ: తెల్లవారుజామున నగర వీధులలో భగవాన్ నామ సంకీర్తనలతో నిద్ర లేదా తమస్సు నుండి ప్రజలను చైతన్య పరచడమే నగర సంకీర్తన యొక్క ముఖ్య ఉద్దేశము.
- ధ్యానము అనగానేమి?
జ: గాఢమైన నిశ్శబ్దములో మాత్రమే మనము భగవంతుని మాటలు వినగలము. ప్రార్థన అనేది భగవంతుని తో సంబంధం ఏర్పరచు కునేది. అదే, ధ్యానము భగవంతునతో ఐక్యమయ్యే విధానము. గాఢమైన ధ్యానంలో, ధ్యానము చేసేవాడు, ధ్యానవిధానము, ధ్యేయము, ఈ మూడూ ఒకటే అవుతాయి.
దీర్ఘాలోచన,ఏకాగ్రతల తరవాత పొందగలిగేదే ధ్యానము.అది ఎంతో ప్రశాంతతను కలగ చేస్తుంది. - ధ్యానమును స్వామి ఏ విధముగా బోధించిరి?
జ: గులాబీ మొక్క యందు ఆకులు ముళ్ళ నడుమ గులాబీ పువ్వులు గుర్తించుటయే ఏకాగ్రతగా, ముళ్లను తాకక సావధానముగా ఆ పువ్వును కోయుట చింతనగా, కోసిన ఆ పువ్వును భగవంతుని చరణములయందు సమర్పించుట ధ్యానముగా భగవాన్ బాబా వారు ఉదాహరించిరి.
- ఆధ్యాత్మిక సాధనలో మన పండుగల యొక్క ప్రాశస్త్యమేమిటి?
జ: పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం మనలోని దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి ప్రబోధించుట. ప్రతి ఒక్క పండుగ ద్వారా మనము కర్మ, భక్తి, జ్ఞాన మార్గములను సాధన ద్వారా అనుసరించవలెను.
- నవవిధ ప్రవర్తనా నియమావళి అనగా ఏమి?
జ: బాబా వారు బోధించిన నవవిధ ప్రవర్తనా నియమావళి ఈ క్రింది విధముగా తెలుపబడినవి
- నిత్యము జపము, ధ్యానము చేయవలెను.
- కుటుంబ సభ్యులతో వారమున కొకసారి అయినా ఇంటిలో భజన చేయవలెను.
- కుటుంబ బాల బాలికలను బాలవికాస్ క్లాసులకు విధిగ పంపవలెను.
- సంస్థ నిర్వహించు భజన, నగర సంకీర్తనలలో పాల్గొనవలెను.
- సంస్థ నిర్వహించు సేవా కార్యక్రమములలో పాల్గొనవలెను.
- సాయి వాఙ్మయము నిత్యము 30 నిమిషములైన అధ్యయనము చేయవలెను.
- ప్రతిఒక్కరితో మృదువుగ, ప్రేమతో మాట్లాడవలెను.
- పరులను గురించి, ముఖ్యముగ, వారి పరోక్షములో చెడుగ మాట్లాడరాదు.
- నిత్యము పిడికెడు బియ్యము తీసియుంచి, నారాయణ సేవకు వినియోగించవలెను. మరియు ఆహారమును వృధాచేయని అలవాట్లను కలిగియుండవలెను.
- భగవాన్ బాబా వారు బోధించిన దివ్యత్వానికి పది మెట్లు ఏమిటి?
జ: బాబా వారు బోధించిన దివ్యత్వానికి పది మెట్లు ఈ క్రింది విధముగా తెలుపబడినవి
- జన్మభూమి కన్నతల్లి వంటిది
- ఏ మతాన్ని ద్వేషించక సర్వమతములను గౌరవించాలి
- ఎటువంటి తేడాలు చూడక అందరినీ ప్రేమించు
- మన ఇంటిని మన ఇంటి పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకొనవలెను
- యాచకులకు ధనమునిచ్చుటకన్న, వారికి ఉపాధి అవకాశములనిచ్చి వారి దైన్యతను పోగొట్టుట మంచిది.
- లంచము ఇవ్వవద్దు, పుచ్చుకొనవద్దు.
- జాతి, మత భేదాములకు అవకాశమివ్వక, విశాల భావముతో మెలగవలెను.
- ఇతరులపై ఆధారపడక అందరూ తమ పనులను తాను చేసుకొనవలెను.
- దైవప్రీతి పాపభీతి కలిగి ఉండవలెను.
- ప్రభుత్వ శాసనములను అనుసరించవలెను. చట్ట నిబంధనలను మనము ఏ మాత్రము అతిక్రమించరాదు.
- జాతీయ మరియు అంతర్జాతీయ సమగ్రతకు ఏ విధముగా పాటుపడవలెను?
జ: విభిన్న వ్యత్యాసములైన – దైవారాధన, మత, వర్గ, భాష, వృత్తూలనడుమ సమగ్రతను సాధించాలనుకున్న భగవాన్ బాబా వారు బోధించిన ఈ క్రింది సూత్రములను పాటించవలెను
ఉన్నది ఒకటే మతము అదియే ప్రేమ మతము.
ఉన్నది ఒకటే భాష అదియే హృదయ బాషా.ఉన్నది ఒకటే జాతి అదే మానవజాతి.
ఉన్నది ఒకటే దేవము అతడే సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు.