జపానుదేశపు భౌగోళిక శాస్త్రవేత్త
బాబా తరచుగా “అన్ని పేర్లూ నావే, అన్ని రూపాలు నావే” అంటారు. అంటే స్వామి తనపిల్లలు స్వామిని ఆరూపంలో చూడకపోయినా, విని ఉండకపోయినా వారి ఆర్తితోకూడిన ప్రార్థనలు విని ప్రతిస్పందిస్తారు అన్నమాట.
ఒక జపానుదేశపు భౌగోళికశాస్త్రవేత్త భారతదేశం వచ్చినపుడు తన సహచరుని ఇంట్లో స్వామి పటాలు చూడటం జరిగింది. ఈ శాస్త్రవేత్త బాబాను చూచి ఆయనను గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడ్డారు. భక్తుడైన అతని సహచరుడు అతన్ని ‘బృందావనం’ తీసుకువెళ్ళారు. స్వామి అప్పుడక్కడే ఉన్నారు.
బాబా అతన్ని ఇంటర్వ్యూకు పిలిచారు. అది ఒక అంతర్దర్శనం! ఆ భౌగోళిక శాస్త్రవేత్త పుట్టినపుడు ఒక నీలిరంగు శిశువుగ ఉన్నాడని, వైద్యులా శిశువు బ్రతుకడని అతని తండ్రితో చెప్పారని ఆతని చిన్ననాటి విషయం ప్రస్తావించారు. “అపుడాతని తండ్రి బుద్ధదేవుని ఆలయానికి వెళ్లి బుద్ధుని పాదాలచెంత శిశువునుంచి “దేవా! ఇతడు నీవాడు ఇతడు బ్రతికినాలేకున్నా అది నీదివ్యసంకల్పం” అని ప్రార్ధించి శిశువును ఇంటికి తీసికొని వెళ్ళాడు. అప్పటినుండి నేను నిన్ను కాపాడుతూ వస్తున్నాను అన్నారు బాబా. అలా అంటూ బాబా హృదయం ఆకారంలో ఉన్న ఒక లాకెట్ సృష్టించి ఆ జపాను శాస్త్రవేత్తకు చూపించారు. ఆ హృదయంలో 3 అరలేఉన్నాయి. అతడు దిగ్రమచెంది నిశ్చేష్టుడైనాడు. తన రహస్యం బాబా కెలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తనతండ్రి తన హృదయంలో మూడు అరలే ఉన్నాయని చెప్పిన సంగతి అతడెప్పుడూ ఎవరితోను చెప్పలేదు. అది అతడు జాగ్రత్తగ కాపాడుకుంటూ వచ్చిన రహస్యం. ఏ రహస్యమూ బాబా దగ్గర దాచలేము అని బాబా సర్వవ్యాపకులు సర్వశక్తివంతులు సర్వజ్ఞులు అని ఆతడానాడు గుర్తించాడు.
విడివిడి పూసలను ఒకటిగ పట్టి ఉంచే దారం వంటిది దివ్యత్వం. ప్రతిపూసలోపలి విషయము దారానికి తెలుస్తుంది కదా!