స్వామి ప్రేమకు కొలబద్ద
స్వామి కారుణ్యానంద భగవాన్ బాబావారి భక్తులలో గౌరవనీయుడు. కుష్ఠురోగులకి ఒక ఆస్పత్రి, అనాధలకు అంగవికలులకు ఒకస్థావరం నడుపుతుండేవారాయన. ఒకరోజు ప్రసవించడానికి సిద్ధంగ ఉన్న ఒక అనాధ గర్భిణి స్త్రీని ఎవరో జాలితలచి, ఆమెకు తలదాచుకునేచోటు, సహాయం లభిస్తుంది కదా అని وع ఆస్పత్రికి తీసికొనివచ్చారు. ఆమె రెండేళ్ల వయసున్న కొడుకుని కూడ తీసుకువచ్చింది. స్వామి కారుణ్యానంద ఆమెను ఆస్పత్రిలో చేర్చి ఆపిల్లవానిని కొందరు స్త్రీల సంరక్షణలో ఉంచారు.
ఒకనాటి సాయంత్రం ఆహాస్పిటల్లో పనిచేసే వారందరు సినిమా చూడడానికి వెళ్లారు. వారు తిరిగివచ్చి అప్పుడే పుట్టిన శిశువు ఏడుపువిని ఆశ్చర్యపోయారు. ఆ ఆస్పత్రిలో ఒక్క డాక్టరు, ఒక్క నర్సు మాత్రమే ఉన్నారు. ఈ అనాధ స్త్రీ ప్రసవించడానికి ఇంకా చాల వ్యవధి ఉన్నదనుకున్నారు వాళ్ళు. వాళ్ళు త్వరత్వరగా లోపలికి పోయి చూస్తే ఆ స్త్రీ మగశిశువును ప్రసవించి ఉన్నది. ఆ శిశువుకి స్నానం చేయించబడి తెల్లని తువ్వాలులో చుట్టబడి తొట్టెలో పడుకోబెట్టబడి ఉన్నది. తల్లికి కూడ తగిన సంరక్షణ చేయబడింది. వారు ఆశ్చర్యపోయి అదంతా ఎవరు చేశారని ఆతల్లిని అడిగారు. నేను అరచి ప్రార్ధించి పిలిచాను. అదృష్టవశాత్తు ఇంకొక నర్సు విని వచ్చింది. అని చెప్పింది తల్లి. ఏ నర్సు? అంటూ వారు ఇంకేనర్సూ ఇక్కడ లేదే! అని ఆశ్చర్యంతో అడిగారు. గోడమీద ఉన్న బాబా పటాన్ని వేలితో చూపిస్తూ ‘ఆనర్సు’ అన్నది ఆమె. “ఇప్పటివరకు ఆమె ఇక్కడే ఉన్నది. ఇప్పుడే ఇంకొక రోగిని చూడడానికి వెళ్లింది అని చెప్పింది.
స్వామి కారుణ్యానంద పుట్టపర్తికి వెళ్ళినపుడు ఆయన ఇంకా ఏమీ చెప్పకుండానే స్వామి ఆయనను మందలిస్తూ “ఆస్పత్రిలో విషయాలు సక్రమంగ జరిగేట్లు చూచుకో. నాకవసరమైన వస్తువులు వెతుక్కునేప్పటికి నాకు కొంచెం టైము పట్టింది” అన్నారు.