గాంధీజీ
1936 లో గాంధీజీని మగల్ వాడీ (వార్థాలో) మొట్ట మొదటిసారిగా కలుసుకున్నపుడు నాకు ఒక విధంగా నిరాశ కలిగింది. అంటే నా కోరిక తీరలేదని కాదు. గాంధీజీ అలా ఉంటాడు అనుకోలేదు. చాలా మంది అనుకున్నట్లు గాంధీజీ మొండివాడు, ‘తన కుందేలికి మూడే కాళ్ళు’ అనే వాడు కాదు. ఒంటి గా ఉండే స్వభావం కలవారు కాదు. నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటంటే గాంధీ ఎంతో చలాకీగా, సరదాగా అందరితో కలివిడిగా ఉంటున్నారు.
“నీవు ఇక్కడ ఏ పని చేయగలవు” అన్నాడు గాంధీజీ.”
“బాపూజీ నేను మీరు ఏది చెప్పినా చేస్తాను. మీరే అనుజ్ఞ యివ్వండి”
“నీవు ఈ మధ్యనే ఇంగ్లాండు నుంచి వచ్చావని తెలుసు. సాహిత్య రంగంలో రాణిస్తావని తెలుసు. కాని ఆ పని ఇవ్వను. చర్ఖాను గురించి నీకు తెలుసా? ఇదిగో ఈ చర్ఖా తిరగడం లేదు. బాగు చేయగలవా?”
“అయ్యో! అది నాకు రాదే!”
“అయితే నీవు నేర్చుకున్నదంతా వృధా అన్నమాట. హిందుస్థానీలో ఒక సామెత ఉంది. ‘ఖక్ చనా’ అంటే ఇసుకను జల్లించడం. అటువంటిది నీవు నేర్చిన విద్య”
“అది నిజమే బాపూజీ”
“సరే నీకు సరిగ్గా ఆపనే ఇస్తాను. ఇక్కడ పాయి ఖానాలలో ఉపయోగించడానికి మెత్తటి ఇసుక కావాలి. జల్లించి ఇస్తావా? సుజిత్ కి ఈ పనిలో సాయపడు”
“ఓ! మీరు ఏ పని ఇచ్చినా సంతోషంతో చేస్తాను. నేను కొంచెం తోటపని చేసి ఉన్నాను కాబట్టి ఈ పని కష్టం కాకపోవచ్చు” అన్నాను.
“మంచిది” అన్నారు గాంధిజీ. ఆ పనిని ప్రతి ఆదివారం నాడు కొన్ని నెలల పాటు చేశాను.
గాంధిజీ వార్ధాలో నా కుటీరంలో పోయిన సంవత్సరం రెండుమార్లు బస చేశారు. మొదట 1944 డిసెంబరులో వున్నప్పుడు ఆయన నిద్రించడానికి మూడుతలగడాలు తీసుకొన్నారు కాని ఫిబ్రవరి 1945లో వచ్చినపుడు తలగడ వాడడం పూర్తి విసర్జించారు.
“బాపూజీ తలగడలు ఎందుకు వాడరు?” అని అడిగాను.
“శవాసనం వల్ల మంచి నిద్ర పట్టింది అని ఎక్కడో చదివాను. అది అలవాటు చేసుకుంటున్నాను” అన్నారు.
“బాపూజీ మీ జీవితం అంతా ప్రయోగాలే. ఈ వృద్ధాప్యం లో మీరు కొన్ని ప్రయోగాలు చిన్న వారి పైన చేయండి. మీ ఆరోగ్యం దెబ్బతినవచ్చు.”
“లేదు, లేదు, నా జీవితమే ఒక ప్రయోగము. నా ప్రయోగాలకు అంతం నా మరణంతోనే” అన్నారు.
పోయిన సంవత్సరం గాంధిజీ బెంగాలు పర్యటన చేసే సమయంలో ఆయన కొరకు రెండు మూడవతరగతి పెట్టెలు కేటాయించారు. రెండు పెట్టెలు అవసరం లేదని ఆయన భావించారు. తన బృందానికి ఒక పెట్టె సరిపోతుందని ఆయన గ్రహించారు. కనూ ను, గాంధీజీ పిలిచి రెండవ పెట్టెను ఖాళీ చేయమన్నారు.
కనూ అన్నాడు “బాపూజీ! రెండు పెట్టెలు మనకు కేటాయించారు గదా ! వాటికి రైల్వేవారికి ధనం కూడా చెల్లించాము.”
“అయితే ఏమి? మనం ఇప్పుడు వెళ్ళేది బీదప్రజలు అన్నంకోసం. కటకటలాడుతుండే బెంగాలుకు, వారి సేవ కోసం పోతున్నాము. రైలులో దొరికినంతవరకు సుఖాలను అనుభవించడం భావ్యంకాదు. ప్రక్క పెట్టెల్లో ఎంత రద్దీగా ఉందో చూడలేదా? ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఎంత అవసరమో అంత స్థలమే మనము వాడుకుందాము. మూడవ తరగతిలో ప్రయాణం చేస్తూ ఎక్కువ స్థలాన్ని కేటాయించుకోడం అంటే బీద ప్రజలను అవమానించినట్లే” అన్నారు గాంధిజీ.
మళ్ళీ ఎవరూ మాట్లాడలేదు. బృందం అంతా ఒకే పెట్టెలో ప్రయాణం చేసింది. అది జరిగిన తర్వాతే గాంధీజీ విశ్రమించారు.