రామదాసు ఆధ్యాత్మిక సాధన
బాధ, అశాంతి, సుఖనుఃఖాలతో కూడుకు జీవితంలో “శాంతి ఎక్కడ?” “విశ్రాంతి ఎక్కడ?” అని అలమటించాడు రామదాసు. ఈ ఆక్రందనను విన్నాడు రాముడు. భగవద్వాణి వినిపించింది రామదాసుకు “నిరాశ స్పృహలకు లోనుగావద్దు, నన్ను నమ్ముకో. నీకు ముక్తి లభిస్తుంది” అని. అల్లకల్లోలమైన సముద్రంలో అలల తాకిడికి కొట్టుమిట్టాడుతున్న వాడికి ఆధారంగా ఒక కొయ్యపలక దొరికినట్లు, ఈ దివ్య వాక్కులు రామదాసుకు ఉపశాంతి కలిగించాయి. ఆనాటినుండి ప్రాపంచిక వ్యవహారాల్లో గడుపుతున్న సమయాన్ని రామధ్యానంలో గడపసాగాడు రామదాసు. శాంతిదాత రామునిపై ప్రేమ ఇనుమడించింది. రాముని పై ధ్యానం ఎంత ఎక్కువసేపు చేస్తున్నాడో శాంతికూడా అంత ఎక్కువగా లభిస్తున్నది.
లౌకిక విషయాల ప్రమేయంలేని రాత్రులు పూర్తిగా రామభజనకు వినియోగం అవుతున్నాయి. అంతకంతకు రామ భక్తి పెరిగిపోతున్నది. పగటివేళల్లో డబ్బుకు సంబంధించిన, ఇతర ప్రాపంచిక వ్యవహారాలో రామదాసుకు వచ్చిన చిక్కులు అత్యాశ్చర్యకరంగా రాముని దయవల్ల తొలగి పోతున్నాయి. దినచర్యలో ఏమాత్రం అవకాశం దొరికినా కొన్ని నిమిషాలు అయినా సరే రాముని మీద ధ్యానంలో గడుపుతున్నాడు. వీధుల్లో నడుస్తూ రామ-రామ అంటున్నాడు. భౌతిక సుఖాలు అందించే వస్తువులపై క్రమంగా ఆకర్షణ తగ్గిపోతూంది రామదాసుకు. రోజుకు ఒకటి లేక రెండుగంటలు మాత్రం నిద్రపోతున్నాడు. రామధ్యానం కోసం నిద్రను వదిలేస్తున్నాడు. సన్నని వస్త్రాలు ధరించడం మాని ముతక ఖద్దరు ధరిస్తున్నాడు.
ఆహారం విషయంలో కూడా కఠిన నియమాలు పెట్టుకున్నాడు రామదాసు. రోజుకు రెండుమార్లు ఉన్న భోజనం ఒక పూటకు దిగింది. కొంతకాలానికి అది గూడా విసర్జించి కేవలం అరటిపండ్లు ఉడక బెట్టిన దుంపలు మాత్రం భుజిస్తు న్నాడు. ఉప్పు, కారం పూర్తిగా వదలివేశాడు. రామ నామాన్ని మించిన రుచిలేదు. రామధ్యానం తప్ప వేరే ఆహారం లేదు. వేరే విషయాలకు స్థానం ఉండటం లేదు.
ఈ విధంగా జరుగుతున్న కాలంలో ఒకనాడు రామదాసు తండ్రివచ్చాడు. కుమారునికి రామనామం ఉపదేశించాడు. “శ్రీరాం, జయరాం జయ జయరాం”. ఈ మంత్రం శాశ్వతానందం ఇస్తుందని కుమారునికి చెప్పాడు. తనకు రామ నామం ఉపదేశం చేసిన తండ్రిని గురువుగా భావించాడు రామదాసు. ఈ మంత్రం సహాయంతో ఆధ్యాత్మిక మార్గంలో అతని ప్రయాణం మరింత వేగంగా సాగుతూంది.
అప్పుడప్పుడు ‘రాముని’ అనుమతితో భగవద్గీత, బుద్ధ చరిత్ర, బైబిలు, చదువుతున్నాడు. తన హృదయంలో నాటబడిన ‘రామభక్తి’ అనే చిన్న మోలక ఈ సద్గ్రంధ పఠనంతో శక్తి తీసుకొని చక్కగా ఎదుగుతుంది. రామదాసు లేత మనస్సుపైన ఈ మహనీయుల ప్రభావం బాగా ముద్రవేసింది. ఈ సమయంలో రాముడు ఒక్కడే శాశ్వతము ఇతరములన్నీ అశాశ్వతములు అని రామదాసుకు తోచింది. ప్రాపంచిక సుఖాలకై కోరికలు ఏనాడో నశించాయి. నేను, నాది అనే భావాలు కూడా అడుగునబడుతున్నాయి. మనస్సు, హృదయం, ఆత్మ సర్వము రాముడే రామదాసుకు.
సంసారమనే మహాసాగరాన్ని దాటడానికి రామదాసుకు ఎంతో బలము, ధైర్యము కావాలి. దీనికి రాముడు తన దాసుడైన రామదాసును కఠిన పరీక్షలకు లోనుచేశాడు. ఒక నాడు రాత్రి రామనామామృతాన్ని గ్రోలుతున్న సమయంలో రామదాసుకు ఈ క్రింది విధంగా ఆలోచన వచ్చింది.
“నీ శక్తిని నీ మహిమను ప్రేమను గుర్తించి, నీ మీద అచంచల విశ్వాసము, శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తాయి” అని తెలుసుకున్నపుడు, నీ దాసుడు సంపూర్తి గా ఎందుకు నీ శరణు జొచ్చాడు? నీవి అనుకున్నవి వదిలి వేసినపుడే అది సాధ్యము. నీవే అందరిని కాపాడేవాడివి. మానవులు అజ్ఞానంలో నేను చేశాను, అది నాది ఇది నీది అనుకుంటారు. కాని అన్నిటినీ చేసేది నీవే తప్ప మరొకరు కారు. అన్నీ నీవే. అన్నింటిలో నీవే, నీలోకి పూర్తిగా తీసుకో అని ఈదాసుడు ప్రార్థిస్తున్నాడు. అన్నింటినీ పరిత్యజించి కాషాయవస్త్రాలతో సన్యాసిగా ప్రపంచమంతటా పరిభ్రమించాలనే కోరిక కొద్దికొద్దిగా కలుగుతుంది. రామదాసు బుద్ధుని చరిత్ర తెరిచి
‘లైట్ ఆఫ్ ఏషియా’ అనే గ్రంధము తీసి చదువుతున్నాడు. అతని దృష్టి బుద్ధుడు సర్వ సంగపరిత్యాగం చేసిన ఘట్టంమీద నిలిచింది.
“ఈ బంగారు ఖైదును వదిలి వెళ్ళే సమయం ఆసన్నమయింది. ఇక్కడ నా హృదయాన్ని కట్టివేశారు. సత్యా న్వేషణకై, సకలమానవాళి కోసం, సత్యాన్ని దర్శించేవరకు సత్యాన్వేషణ చేస్తాను.”
అదే విధంగా బైబిలు తెరచి చదివాడు. క్రీస్తు అంటున్నాడు:
“నా కొరకు తోడబుట్టిన వారిని తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, ఇళ్ళను, భూములను వదలి వచ్చినవారికి నూరింతలుగా నిత్యసత్యమైన ఆనందం లభిస్తుంది.”
తర్వాత భగవద్గీత చదివాడు. అందులో “సర్వ ధర్మాన్ తరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామిమా శుచాః”
రాముడు ఈ మూడు అవతారముల ద్వారా చెప్పించాడు (బుద్ధుడు, క్రీస్తు, కృష్ణుడు) ముగ్గురు చెప్పినవి ఒకే మార్గం సూచిస్తున్నాయి. అదే వైరాగ్యము.
దీనితో రామదాసు సందేహాలన్నీ పటాపంచలైనాయి. తిరుగులేని నిర్ణయానికి వచ్చాడు. ఉదయం 5 గంటలకు, ఇప్పటికే ఆకర్షణ కోల్పోయిన సంసారాన్ని వదలి, నావి అనుకున్నవి వదలి, బయట పడ్డాడు. తన శరీరం, మనస్సు ఆత్మ, ఆ ప్రేమమూర్తి, కరుణామూర్తి రామునికి అర్పించుకున్నాడు.
Source- Stories for Children – II
Published by- Sri Sathya Sai Books & Publications Trust, Prashanti Nilayam