ఆత్మవిశ్వాసము – భగవదనుగ్రహము
బుద్ధికి పదును పెట్టు. ప్రకృతిలో ఏకత్వం గోచరిస్తుంది. వేదాలలో చెప్పబడిన అతి పవిత్ర మంత్రము గాయత్రీ మంత్రము. ఇది మంత్రరూపంలో ఉన్న ప్రార్థన. సకల జీవులకు తేజస్సు ప్రసాదించమని, బుద్ధిని ప్రేరేపించమని గాయత్రీ మంత్రం ద్వారా భగవంతుని ప్రార్ధిస్తాము.
ఆంధ్ర కవులలో ప్రఖ్యాతి చెంది, కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండిన తెనాలి రామకృష్ణుడు ఒకసారి ప్రయాణం చేస్తూ దారితప్పి ఒక అడవిలో ప్రవేశించాడు. ఇటూ అటూ తిరుగుతుండగా అతనికి ఒక సాధువు కన్పించాడు.
రామకృష్ణుడు అతని పాదాలకు నమస్కరించి, “స్వామీ! మీరు ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నారు? అని అడిగాడు. దానికి సాధువు “ఏ మహత్తర శక్తి నిన్ను ఈ అడవికి తీసుకొని వచ్చిందో అదే శక్తి నన్ను గూడా లాక్కుని వచ్చింది. ఏమయినా ఈ శరీరం తుచ్ఛ శరీరం. వదలిపెట్టే సమయం ఆసన్న మయింది. ఈ చివరి ఘడియల్లో నీకు ఒక మంత్రము ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని నేను నా జీవితమంతా ఉపాసించి సత్యమని నమ్మాను” అని మహాకాళి పై ఒక మంత్రాన్ని రామకృష్ణుని చెవిలో ఉపదేశించి తనువు చాలించాడు.
రామకృష్ణుడు ఎంతో శ్రద్ధతో, సంతోషంతో ఆ మంత్రాన్ని స్వీకరించాడు. అడవిలో అటు ఇటు తిరుగుతూ ఒక అమ్మవారి గుడి చూచి అందులో కూర్చుని మంత్రాన్ని జపిస్తున్నాడు.
కొందరు కోయలు ఒక మేకను అమ్మవారికి బలి ఇవ్వడానికి తీసుకొని వచ్చారు. రామకృష్ణుడు విగ్రహం వెనుక దాక్కొని, గంభీర కంఠంతో “మిమ్మల్నందర్ని రక్షించే దేవతను నేను. ఆ మేకపిల్ల కూడా నా బిడ్డే. దాన్ని చంపితే నేను ఊరుకోను, మిమ్మల్నందరిని చంపుతాను” అన్నాడు.
అవి అమ్మవారి వాక్కులే అని వారు నమ్మి మేక పిల్లను వదిలి వెళ్ళిపోయారు. చీకటి పడింది. రామకృష్ణుడు విశ్రమించాడు. అర్ధ రాత్రి అమ్మవారు అతనికి కలలో కనుపించింది. ఆమె ఒక చేతిలో పెరుగు అన్నం గిన్నె, మరొక చేతిలో పాల అన్నం గిన్నె ఉన్నాయి. “ఈ రెంటిలో ఏది కావాలో కోరుకో,” అన్నది.
“అమ్మా! వీటివల్ల వచ్చే ప్రయోజనాలు చెప్తే కోరుకుంటాను” అన్నాడు. “పెరుగు అన్నంవల్ల సంపద కలుగుతుంది. పాల అన్నం వల్ల బుద్ధిబలం, పాండిత్యం వస్తుంది” అన్నది. రామకృష్ణుడు తనలో అనుకున్నాడు “కేవలం ధన సంపద ఉండి బుద్ధి బలం లేకపోతే మూర్ఖుణ్ణి అవుతాను. కేవలం బుద్ధిబలం, పొట్ట నింపదు” అని కొంత ఆలోచించి “అమ్మా! వీటి రుచి తెలియకుండా ఎలా కోరుకొనేది? రుచి ఎలా ఉంటుందో చెప్పవా తల్లీ?” అన్నాడు.
అమ్మవారు విసుగుతో “ఆ రుచి ఏదో నీవే చూడు అని రెండు గిన్నెలు అతని ముందు ఉంచింది. కొంటె రామకృష్ణుడు గబగబ రెండు గిన్నెలలోని అన్నాన్ని తినివేశాడు. అతని గడుసు తనానికి అమ్మవారికి కోపం వచ్చింది. అది గమనించి అతడు “క్షమించు తల్లీ. నేను నీ బిడ్డనేగదా! ఏ శిక్ష అయినా భరిస్తాను” అన్నాడు. కాళి శాంతించింది. ఎంత చెడ్డవాడయినా స్వంత బిడ్డను తల్లి శిక్షిస్తుందా? “నీవు వికట కవిగా పేరు పొందుతావు. రాజు ఆస్థానాల్లో విదూషకునిగా కవిగా, పండితునిగా రాణిస్తావు, అందరు నీ సలహా కోరుకుంటారు” అని దీవించి అంతర్ధాన మయింది.
ప్రశ్నలు:
- రామకృష్ణుడు ‘కాళి’ మంత్రం ఎలా పొందాడు?
- అమ్మవారిచ్చిన వరాన్ని రామకృష్ణుడు తన ప్రయోజనం కోసం ఎట్లు మార్చుకున్నాడు?
- రామ కృష్ణుడు ఎవరి రాజ్యంలో ఉండేవాడు?
- రామ కృష్ణునికి కాళీ మాత యిచ్చిన గిన్నె ల లో ఏమున్నది? అవి తింటే ఏమి లభిస్తుంది?
- రామ కృష్ణ ఎలాంటి కవిగా ప్రసిద్ధి చెందాడు?