చమత్కార జ్ఞాని ససీరుద్దీన్
ముల్లా నసీరుద్దీన్ టర్కీలో నివసించాడు. మహామేధావి, చమత్కారి. ఈనాటికి ఆయన పేర ఏడాది కొకసారి టర్కీలో పండుగ చేసుకుంటారు.
ఒకనాడు నసీరుద్దీను సబ్బుబిళ్ళ ఒకటి తెచ్చి భార్యను తన అంగీ ఉతకమన్నాడు. ఆమె సబ్బును అంగీకి పట్టిస్తూంది, హఠాత్తుగా ఒక కాకి ఎక్కడినుంచో వచ్చి సబ్బు బిళ్ళను తన్ను కొనిపోయి ప్రక్కనే ఉన్న చెట్టుమీద కూర్చుంది. నసీరుద్దీను భార్య కోపం పట్టలేక కాకిని పెద్దగా తిట్టసాగింది.
నసీరుద్దీను వచ్చి ‘ఏమిటి విషయమని’ భార్యను అడిగాడు.
“మీ అంగీకి సబ్బు పట్టిస్తున్నాను. చూచారా ఆ చెడ్డ కాకి వచ్చి సబ్బుబిళ్ళను ఎగ రేసుకు పోయింది”, అని మళ్ళీ కాకిని తిట్టసాగింది.
నసీరుద్దీను తాపీగా “ఆ కాకి రంగు చూడు, అంగీను చూడు. సబ్బుబిళ్ళ అవసరం కాకికే ఎక్కువగా ఉంది కదూ! పరవాలేదు మరొక సబ్బు తెచ్చి ఇస్తానులే” అని వీధిలోకి వెళ్ళాడు.
ఇంకొక రోజు నసీరుద్దీను వీధిలో పోతుండగా ఒక ఇంటి అరుగు మీద ఒక బాటసారి దిగులుగా కూర్చొని ఉండడం చూచాడు. అతన్ని సమీపించి “అయ్యా ! ఎందుకు అలా ఉన్నారు ?” అని అడిగాడు.
ఆ వ్యక్తి “అయ్యా! నాకు డబ్బు ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. కాని ఏమిటో మనశ్శాంతి ఉండడం లేదు” అన్నాడు.
నసీరుద్దీను ఏమి మాట్లాడకుండ ఆ వ్యక్తివద్ద ఉన్న చేతిసంచిని తీసుకొని పరుగెత్తాడు. బాటసారి గూడా శక్తి కొద్ది ఇతని వెంటబడ్డాడు. కాని నసీరుద్దీను దొరక లేదు. కొంత సేపు అలా పరుగెత్తి దారిపక్కన ఆ సంచిని ఉంచి దూరంగా నిలబడి నసీరుద్దీను గమనిస్తున్నాడు. బాటసారి ఆత్రంగా ఆ సంచిని తీసుకొని గుండెకు హత్తుకున్నాడు.
నసీరుద్దీను అతనిని సమీపించి “అయ్యా! మనశ్శాంతి దొరికింది కదూ?” అనేసి వెళ్ళి పోయాడు.
ప్రశ్నలు:
- నసీరుద్దీను భార్య ఎందుకు కోపించింది?
- నసీరుద్దీను సమాధానమేమి?
- నసీరుద్దీను బాటసారికి మనశ్శాంతి ఎలా కలిగించాడు?