భద్రాచలము
తెలంగాణా ప్రాంతంలో గోదావరి నది ఉత్తరపు ఒడ్డున ఉన్న ఒక పుణ్య క్షేత్రము భద్రాచలము. భద్రుడనే ఋషి పేరుతో ఆ గ్రామం వెలిసింది. ఇక్కడ దేవాలయం ఒక చిన్న కొండమీద ఉంది.
అరణ్యవాస సమయంలో శ్రీరాముడు, సీతా, లక్ష్మణులతో పాదం పెట్టినచోటు భద్రాచలము. అందుకే ఆ స్థలానికి అంత పవిత్రత చేకూరింది. భద్రాచలానికి 35 కి.మీ. దూరాన పర్ణశాల అని ఒక ఊరు గోదావరినది ఒడ్డున ఉంది. శ్రీరామలక్ష్మణులు అక్కడే ఒక పర్ణశాల నిర్మించుకొని చాలా కాలం గడిపారని ప్రతీతి. ఇప్పటికీ దానికి చిహ్నంగా ఒక గుడిసె, సీతమ్మ కు దాటిరావద్దని లక్ష్మణుడు గీచిన గీత చూపిస్తారు. ఇక్కడే మారీచుడు బంగారులేడి రూపంలో సీతకు భ్రాంతి కలిగించాడని ఒకచోటు చూపిస్తారు. దానికి దగ్గరలోనే స్వచ్ఛమైన నీటితో ప్రవహించే ఒక చిన్న నది ఉంది. దానిలో సీతారాముల్మణులు ప్రతిదినము స్నానం చేసేవారట. అక్కడ శుభ్రమైన నీరు దొరకక లక్ష్మణుడు భూమిలోకి ఒక బాణం గ్రుచ్చితే జలం పొంగిందని చెప్తారు.
రాముడు సీతాన్వేషణార్ధము దక్షిణ దిక్కుగా పయనిస్తూ గోదావరిని దాటిన ప్రదేశంలో భద్రావతి దేవాలయం నిర్మింపబడింది. 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న ఈ దేవాలయాన్ని నిర్మించాడు. గోపన్న గోల్కోండ నవాబు అబ్దుల్ హసన్ తానీషా తాసిల్దారుగా ఆ ప్రాంతంలో ఉండేవాడు.
గోపన్న పరమ రామభక్తుడు. రామభక్తితో తన్మయుడుగా ఉంటూ తన ఉద్యోగ ధర్మాలనుకూడా విస్మరించేవాడు. సర్కారు సొమ్మునుండి రు.6 లక్షలు ఖర్చుపెట్టి రామాలయం కట్టించాడు. తానీషాకు ఈ విషయం తెలిసి గోపన్నను గోల్కొండ కోటలో ఖైదు చేయించాడు. కొన్ని దినాలు గాలి వెలుతురు సరిగాలేని ఖైదులో మ్రగ్గి గోపన్న విరక్తితో ప్రాణత్యాగం చేయదలిచాడు. ఆ రాత్రి కలలో శ్రీరాముడు కనుపించి “ఆలయ నిర్మాణంలో వినియోగించిన ధనం చెల్లించబడింది” అని చెప్పి అదృశ్య మైనాడు. ఆనాడే తానీషా వద్దకు ఇద్దరు వ్యక్తులు సేవక వేషంలో వెళ్ళి డబ్బు చెల్లించి రసీదు తీసుకున్నారు. మరునాడు ఉదయము తానీషా స్వయంగా ఖైదుకు వెళ్ళి తనకు డబ్బు ముట్టిందని చెప్పి గోపన్నను విడిపించాడు. గోపన్న కూడా తనకు కలలో రాముడు కనుపించిన విషయం చెప్పాడు. తానీషా మనస్సులో రాముని ఎడల భక్తి భావము కలిగింది. తాను గోపన్నకు చేసిన అపచారానికి క్షమాపణ కోరాడు. గోపన్నను తిరిగి భద్రాచలానికి తాసీల్దారుగా నియమించి గౌరవమర్యాదలతో సాగనంపాడు. దేవాలయ నిర్వహణకు శాశ్వతపు ఏర్పాటు కూడా చేశాడు.
శ్రీరామనవమి ఉత్సవాలకు లక్షల సంఖ్యలో యాత్రికులు భద్రాచలానికి వస్తారు. ఈ ఉత్సవాలలో ప్రధానమైనది సీతారామకళ్యాణము. ఆనాడు సీతారాముల విగ్రహాలను గోదావరి నదిలో స్నానం చేయించి, ఊరేగింపుగా దేవాలయానికి తీసుకొని వెళ్ళి విలువైన వస్త్రాలతో, నగలతో అలంకరించి, అతి సుందరంగా నిర్మించిన విశాలమైన కళ్యాణమంటపంలో వేద మంత్ర పఠనంతో, కళ్యాణోత్సవం శాస్త్రో క్తంగా జరిపిస్తారు. పర్ణ శాలవద్ద సీతారాముల మందిరం చిన్నది ఒకటి నిర్మించారు. దాని నిర్వహణ భద్రాచల దేవస్థానం భరిస్తుంది. ఇక్కడ ఒక అత్యాశ్చర్యకరమైన సంఘటన జరిగింది. హఠాత్తుగా భూమి కంపించి, ఆ మందిరం చుట్టిఉన్న భాగంలో భూమి విచ్చుకొని కొంత మేరకు కూలి పోయింది. కాని గుడిలోని గర్భాలయం మాత్రం చెక్కుచెదరక ఉంది. ఈ దైవమహిమ చూచి గ్రామప్రజలకు శ్రీరాముని విూద భక్తి ఇనుమడించింది.