బదరీనాథ్- కేదారనాథ్
హిమాలయ పర్వతాలు భారతీయులకు అతి పవిత్రమైనవి. భగవద్గీతలో కృష్ణుడు, “పర్వతాలలో హిమాలయాన్ని నేను”అన్నాడు. ఈ పవిత్ర పర్వతాల మీద, దాదాపు 3 వేల మీటర్ల ఎత్తున బదరీనాథ్ దేవాలయం ఉంది. దాని చుట్టూ ఎత్తయిన పర్వత శ్రేణులు మంచుతో కప్పబడి అతి రమణీయంగా ఉంటాయి.
అక్కడి దేవత విష్ణుమూర్తి అవతారం అయిన బదరీ నారాయణుడు. అతి సుందరమైన ఈ విగ్రహం ధ్యానముద్రలో కనుపిస్తుంది. ఆయన లలాటం మీద ఒక పెద్ద వజ్రం, శరీరం మీద విలువైన బంగారు ఆభరణాలు అలంకరింప బడిఉన్నాయి. బదరీనాధ క్షేత్రము అతిపురాతనమైనది. అయినా చాలా కాలం దాని సంగతి ఎవ్వరు పట్టించుకోలేదు. ఆదిశంకరుల ధ్యాన సమయంలో విగ్రహం అలకనందా నదిలో మునిగిపోయిఉన్నట్లు కనుగొని, దానిని వెలికి తీసి, పూర్వ ఔన్యత్యాన్ని తిరిగి కలుగచేశారు.
సంవత్సరంలో ఆరుమాసాలు మాత్రమే ఈ దేవాలయం తెరచి ఉంటుంది. మిగిలిన ఆరు నెలలు ప్రకృతిమాత ఈ దేవాలయాన్ని తన ఒడిలోనే ఉంచుకుందా అన్నట్లు, పూర్తిగా మంచుతో కప్పుబడి ఉంటుంది. ఈ సమయంలో ఒక ప్రతి విగ్రహాన్ని జోషీమఠంలో పూజిస్తారు. ఆరు నెలల తర్వాత దేవాలయం తలుపులు తెరచినపుడు, తలుపులు మూసే సమయంలో వెలిగించి వదలి వేసిన దీపారాధన ఇంకా వెలుగుతూ ఉంటుంది.
కేదారనాథ్ శివ క్షేత్రము. ఈ కేదారనాథ్ మార్గం కూడా ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. మరొక లింగాన్ని ఉభీనాథ్ లో పూజిస్తారు. పాండవులు మహాప్రస్థానంలో స్వర్గారోహణకు ముందు భూమిమీద ఆఖరిమెట్టు కేదారనాధ్ అని ప్రతీతి. అప్పటికే ద్రౌపది మరణించింది. తర్వాత సహదేవుడు చనిపోయాడు. అతి రమణీయ దృశ్యాల మధ్య, ఈ క్షేత్రంలో పాండవులు శివుని గురించి ధ్యానించారు. అప్పటినుండి కేదారనాధ్ ప్రఖ్యాత శివక్షేత్రమయింది.