ద్వారక
మన దేశంలోని నాలుగు పవిత్రధామాలలో ద్వారక ఒకటి. కృష్ణుడు రాజుగా రాజ్యం చేసిన నగరం ద్వారక. ఇది మానవ నిర్మిత నగరం కాదు. శ్రీకృష్ణుడు స్థల నిర్ణయం చేసిన తర్వాత విశ్వకర్మ దీనిని నిర్మించాడు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కొంతకాలానికి గాంధారి శాపం ప్రకారం యాదవులు తమలో తాము పోట్లాడుకొని నాశన ముయ్యారు. ఇదే ద్వాపరయుగానికి అంతము. కలియుగానికి నాంది. దీనితో కృష్ణావతార ప్రయోజనము పూర్తి అయింది.
ఒకప్పుడు స్వర్గాన్ని తలదన్నిన ద్వారక ఎడారివలె అయింది, కృష్ణుని రాజ్య వైభవాన్ని చూపించే అవశేషాలు గూడా క్రమేణా సముద్రగర్భంలో కలిసిపోయాయి. కాని ఈ నాటికి వేలల యాత్రికులు ద్వారక దర్శించి తమ జీవితాలు ధన్యం అయినట్లు భావిస్తారు. ఇప్పుడు ద్వారకలో గోమతి నది ఒడ్డున ఉన్న దేవాలయలం లో చతుర్భుజాలతో ఉన్న కృష్ణ విగ్రహం ప్రతిష్ఠించారు. అది ఆ నాటి కృష్ణుని దివ్య లీలా వైభవాన్ని, యాత్రికులకు గుర్తుచేస్తూ ఉంటుంది.
భక్త మీరాబాయి ఇక్కడే తన చివరి రోజులు గడిపి భగవంతునిలో ఐక్యం అయిందని చెప్తారు.