పూరీజగన్నాధం
పూర్వము ఇంద్రద్యుమ్నుడనే రాజు పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరాత్రి దేవుడు కలలో కనుపించి ఒక దేవాలయం నిర్మించమని ఆదేశించాడు.
రాజు తన కాలము, ధనము, శక్తి సర్వము వినియోగించి ఒక అద్భుతమైన దేవాలయము నిర్మించాడు. సముద్రంలో ఒక కొయ్యదుక్క తేలుతున్నట్లు ఆ రాజుగారికి మళ్ళీ కలవచ్చింది. ఆ దుక్క నుండి దేవతా విగ్రహం ఎవరు చెక్కుతారు? అనే సందేహం రాజుకు కలిగింది. ఒక విచిత్ర వ్యక్తి వృద్ధుడు వచ్చి ‘నేను దేవతా విగ్రహం చెక్కుతాను?’ అన్నాడు. ఆయన విశ్వకర్మ అయి ఉంటాడు. కాని ఆ వృద్ధుడు ఒక షరతు విధించాడు. “నాకు ఏకాంతంగా పని చేసుకునేందుకు ఒక గది ప్రత్యేకంగా ఇచ్చి, ఆ గది తలుపులు ఎవ్వరు 21 రోజులు పూర్తయ్యే వరకు తెరవకూడదు”
ఆ షరతు ప్రకారం ఏర్పాట్లు చేశారు. రాణిగారు ఆసక్తితో గదిలోనించి వచ్చేశబ్దాలను వింటుండేది. కాని ఒక పక్షం రోజుల తర్వాత ఎటువంటి శబ్దాలు వినరావడంలేదు. రాణి కుతూహలం పట్టలేక గది తలుపులు తెరిపించింది. వృద్ధుడు కనుపించలేదు. లోపల సగం పూర్తి చేసిన జగన్నాధస్వామి,బలరాముడు, సుభద్రల విగ్రహాలు ఉన్నాయి. అవే దేవాలయంలో ప్రతిష్ఠించారు.
ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు జగన్నాధ రథోత్సవానికి ‘పూరి’కి వస్తారు. ఉత్సవిగ్రహాలను అలంకరించిన పెద్ద కొయ్యరధాలలో ఉంచి ప్రధాన వీధుల్లో త్రిప్పుతారు. దీనినే శ్రీకృష్ణుని గోకులం నుండి మధురకు వెళ్ళిన యాత్రవలె స్మరించుకుంటాము.