వివరణ
మానవునకు కర్మ చేయుటకు అధికారము కలదు. కర్మఫలములను ఆశించరాదు. ఫలాపేక్షను దృష్టియందు ఉంచుకొనక కర్మలు చేయుము. అలాగని అసలు కర్మలు చేయకుండా సోమరియై ఉండరాదని పరమాత్మడు తెలుపుతున్నాడు.
ఈ కర్మ నాది. ఈ చేసే కర్మఫలం నాది. ఈ కర్మకు కర్త నేనే, అను సంగము బంధమునకు గురి అగును.
మానవునకు ఇచ్ఛాశక్తి కలదు. ఏ మానవుడైతే పరమాత్ముడు నిర్దేశించిన మార్గమును అనుసరిస్తూ, సర్వమునకు కర్త భగవంతుడే అనియు ఫలాపేక్షను వదిలి, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తాడో తను సులభముగా తన గమ్యమును చేరుతాడు/ పరమాత్మను పొందుతాడు. కర్మ చేయుటకు మాత్రమే అధికారం కలదు. కర్మ త్యాగమునకు అధికారము లేదు. కర్తవ్యకర్మను నిర్లక్ష్యము చేయరాదు. కర్మ మానుట తమోగుణ లక్షణము. ఫలాపేక్ష రజోగుణ సంబంధము.
జనక మహారాజు గొప్ప కర్మయోగి. మహారాజుగా తన కర్తవ్య కర్మలను నిర్వహించినప్పటికీ తనని తాను పరమాత్మ యొక్క పనిముట్టుగా భావించి తాను చేసే పని పరమాత్మునిదిగా భావించి కర్మలను ఆచరించేవాడు. అందువలన కర్మబద్ధుడు కాక, తన జీవితమును ప్రశాంతముగా గడిపి మోక్షమును పొందినాడు.
ఈ శ్లోకము కర్మ యోగము గురించి చెబుతుంది. అంతఃకరణ శుద్ధి పొందవలెనన్న ఫలాపేక్షరహితులై కర్మలాచరించవలెనని కృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకం ద్వారా ఉపదేశిస్తున్నాడు.
తరచుగా మనము చూస్తూ ఉంటాము ఏదైనా ఒక సత్కర్మను ఆచరించాలన్నా, సంఘసంస్కరణలకు పూనుకోవాలన్నా వాటి యొక్క ఫలితములు మన ఆశించిన రీతిలో ఉంటాయో ఉండవో అన్న సంశయముతో సతమతమవుతూ ఉంటాము. కానీ అటువంటి పని మనము చేయవలసి వచ్చినప్పుడు మన శక్తి అనుసారము, అంకితభావంతో, పరిపూర్ణ హృదయముతో ఆ కార్యమును సిద్ధింప చేసినప్పుడు వాటి యొక్క ఫలితముల గురించి ఆలోచించనవసరం లేదు. అవి తప్పక సత్ఫలితాలనే ఇస్తాయి. అంతేకాక కర్మఫలదాత అయిన పరమాత్ముని సంకల్పానసారముగా ఫలితములను స్వీకరించి పరమాత్మని శరణు పొందవలెను. ఆ విధముగా కర్మ చేయుటకు గల అధికారమును వినియోగించుకుని హృదయపూర్వకముగా, శక్త్యానుసారము కర్తవ్య కర్మలను ఆచరించి మిగతాది భగవంతునికి వదిలివేయాలి. నిరంతరము కర్మఫలములు మీద ఆశక్తి, ఆపేక్ష కర్మ యందు ఏకాగ్రతను ఉంచనీయక మన యొక్క శక్తిని వృధాపరచును.
రెండవది కర్మ చేయుటకు అధికారము కలదు కదా అని, కర్మ వదులుటకు కూడా అధికారం ఉంది అనుకోరాదు. ఒక్కోసారి కర్మఫలములు దీర్ఘకాలమున లభించవచ్చు లేదా తక్షణమే ఫలితములను పొందలేము కదా అని ప్రయత్నలోపము కానీ, కర్మ త్యాగము కానీ ఉండరాదు.
భవిష్యత్తు వర్తమానము మీద ఆధారపడి ఉంటుంది. పంటలు సరిగా పండుతాయో లేదో అని రైతు పొలము దున్ని, విత్తనము నాటక పోతే, తదుపరి చేతికి వచ్చే పంట ఏమి ఉండదు. మంచి భవిష్యత్తుకు వర్తమానమును పూర్తిగా ఉపయోగించుకోవాలి/ వర్తమానంలో పునాది వేసుకోవాలి.
అంకిత భావంతో చేసేటువంటి పనికి భవిష్యత్తులో లభించే ఫలితములు/ ఫలములు గురించిన ఆలోచనలు అనవసరము. మనస్ఫూర్తిగా, శక్తి సామర్థ్యానుసారము కర్మలను ఆచరించాలి అనగా ముందుగా వర్తమానములో కర్మలను సక్రమముగా ఆచరించిన అవి మంచి భవిష్యత్తు సాకారమగుటకు దోహదం చేస్తాయి.
అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశం ద్వారా ప్రభావితుడై, ధర్మబద్ధుడై యుద్ధమునకు సుముఖడయ్యెను. రణరంగములో బంధుమిత్రులతో పోరాడుటకు ఒక యోధుడిగా యుద్ధము చేయుట అనే కర్తవ్యమును నిర్వర్తించుటకు సిద్ధపడెను.
కనుక కర్మలో ఎటువంటి హాని లేదు. కానీ మమతానురాగములతో కర్మ బద్ధులమైనప్పుడు, నేను ఆ కర్మ చేయుచున్నాను అను అభిమానమూ, ఫలము నందలి ఆశయు బంధనకు కారణములగుచున్నవి. జనన మరణమనే చక్రంలో బంధింపబడుతున్నాము.
కర్మయోగి (యొక్క) నిర్దేశించబడిన లక్షణములు
- కర్తవ్య కర్మలను ఆచరించవలెను
- పలాపేక్షరహితుడై ఉండవలెను
- ఆశించిన కర్మఫలములు లభించనిచో నిరాశ నిస్పృహలకు గురికారాదు
- కర్మ చేయక సోమరి అయి జడుడై ఉండరాదు
కర్మ యోగి కి కర్మయే బహుమానము. భగవంతుని చేరుటకై సలుపు ఏ అభ్యాసమైన సాధనైనా ఒక సత్క్రియే.
సూర్యుడు గొప్ప కర్మయోగి మహాత్యాగి. తారతమ్యము లేక పేదవారైనా, ధనవంతులైనా, మంచివారైనా, చెడ్డవారైనా అందరి మీద ఒకే రకంగా ప్రకాశిస్తాడు. నిష్కామ కర్మయోగి. తన తేజస్సును అందరికీ సమంగా చేర్చుచున్నాడు. కర్మ చేయకుండిన జీవ యాత్ర దుర్లభము. నడవలేదు. అందులోనూ బంధనలు కలిగించని కర్మలు యజ్ఞ రూపములగు కర్మలు. ఇక మిగిలిన సర్వకర్మలు బంధ కారణములే. కనుక ఆసక్తి వదిలి యజ్ఞార్థముగా కర్మలు చేయుము– బాబా.
ప్రతి కర్మకు ఒక ఫలితము ఫలము ఉండును. ఆ కర్మ ఫలము మరొక కర్మకు కారణం అవుతుంది. ఆ విధంగా కర్మ ద్వారా కర్మఫలము మరియు కర్మఫలము ద్వారా కర్మ, చెట్టు విత్తనం వలె ఒకదానిపై ఒకటి ఆధారపడి, ఒకటి ఇంకొక దానికి కారణభూతమై కారణహేతువై కర్మబంధ చక్రములో మానవుని బంధించుచున్నది. కనుక ఫలాపేక్ష ఎందుకు?
భూతకాలమునందలి దుష్కర్మల ఫలితం వలన వర్తమానములో కష్టాలను దుఃఖములను అనుభవించుచున్నాము. అలా అని కర్మ చేయకుండా ఉండకూడదు. కర్మ త్యాగము చేయరాదు. కర్తవ్యకర్మను విధిగా నిర్వర్తించవలెను. నాటినటువంటి విత్తనము మీద (సలిపినటువంటి కర్మల మీద) సుఖ దుఃఖముల యొక్క ఫలము ఆధారపడి ఉంటుండాది. గడిచిన సమయము నందలి దుష్కర్మల ఫలములను/ ఫలితములను నివారించుట ఎలా? వర్తమానములో సత్కర్మలు ఆచరించుటయే.
స్వామి చెప్తారు “60 సత్కర్మల నుంచి ఒక మంచి భావము వెలువడుతుంది. దేహమును గడియారంతో పోల్చవచ్చు. కర్మలను సెకండ్స్ ముల్లుతో, భావములను నిమిషముల ముల్లుతో, ఆనందమును గంటల ముల్లుతో పోల్చవచ్చు. 60 సత్కర్మలు చేసిన సెకండ్స్ ముల్లు ఒక మంచి భావమును ఇస్తుంది, అటువంటి 60 భావములు గంటల ముల్లును ఒక step జరిపి ఒక ఆనందాన్ని కలుగజేస్తాయి”.
భగవద్గీత అన్నిటినీ త్యజించి సన్యాసము స్వీకరించమని చెప్పదు. కర్తవ్య కర్మలను ఆచరిస్తూ అనాసక్తుడై, కర్మఫలాపేక్షరహితుడై ఉండమని బోధిస్తుంది. కర్మ త్యాగము కాక కర్మఫల త్యాగమును చేయమని చెబుతుంది. కర్మ చేయుటకు అధికారము కలదు. అలాగే కర్మఫలము మీద కూడా అధికారము ఉన్నను ఇష్టపూర్వకముగా కర్మఫలమును వదిలివేయమని సర్వకర్మలను భగవంతునికి అర్పించి పరమాత్మను శరణు పొందమని ఉపదేశిస్తుంది. స్వామి చెప్తారు పరమాత్ముడు సాక్షీభూతుడు. మానవుని స్థితికి మానవుడే కారణము.
సత్కర్మను నాటుదాం మంచి ప్రవృత్తిని/ ధోరణిని పొందుదాం
మంచి ప్రవృత్తితో ఒక అభ్యాసమును అలవర్చుకుందాం
అభ్యాసమును నాటుదాం గుణమును/ శీలమును పొందుదాం
గుణమును నాటుదాం భాగ్యమును అందుకుందాము
నీ యొక్క భాగ్యము నీ చేతిలోనే ఉన్నది. దానిని నీవు నిర్దేశించగలవు లేదా నిర్మూలించగలవు.