అత్యంత విలువైన సంపద – తృప్తి
కథ:1 ఒక వీధి వ్యాపారి తన తలపై ఖాళీ సీసాలు నిండిన బుట్టను పెట్టుకుని బజారుకు వెళ్ళాడు. అతను 10 రూపాయల లాభంతో బుట్టను విక్రయించాలని ఆశించాడు. ఆ విధంగా విక్రయించినచో, పది రోజుల్లో తన సంపాదన100 రూపాయలకు చేరుతుందని అతడు తన మనసులో లెక్కించాడు. దానిని పెట్టుబడిగా అతను మరింత లాభదాయకమైన మారు బేరాలకు సిద్ధమయినట్లుగా ఊహించాడు. దానిద్వారా కొన్ని నెలల్లో లక్ష రూపాయల లాభాన్ని సంపాదించి, సేవకులతో, చుట్టూ అందమైన తోటను కలిగి ఉన్న పెద్ద బంగళాను నిర్మించాలని ఊహించాడు. ఆ ఊహలోనే అతడు బంగ్లా ముందు పచ్చికలో తన మనవరాలితో ఆడుకుంటున్నట్టుగా భావించాడు. అకస్మాత్తుగా అతను తన మనవరాళ్లతో పాటు సేవకుల పిల్లలను చూశాడు. వెంటనే కోపంతో ఆ పిల్లవాడిని పట్టుకుని వేగంగా నెట్టాడు. అప్పుడు తలపై ఉన్న సీసాల బుట్ట రోడ్డుపై పడిపోయింది. రావాల్సిన 10 రూపాయలు కూడా రాకుండా పోయాయి. తన దురాశనే తనకు దుఃఖాన్ని మిగిల్చింది
కథ:2 ఒక రైతు దక్షిణ భారతదేశంలో నూరు ఎకరాల భూమిని కలిగి ఉన్నాడు. సాగు కోసం ఇంకా కొంత భూమిని తీసుకోవాలని ఆరాటపడ్డాడు. సాగు భూములు తుంగభద్రా నది మరియు నాగార్జునసాగర్ ప్రాంతంలో ఉంటాయని వెళ్ళాడు. అక్కడ ధర ఎక్కువగా ఉన్నదని గుర్తించి ఉత్తర భారతదేశానికి వెళ్ళాడు. హిమాలయ ప్రాంతాల్లో మంచి భూమి చౌకగా దొరుకుతుందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడ రాజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎంత భూమి చుట్టి వస్తావో, ఆ భూమిని ఉచితంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. అప్పుడు అతను దురాశతో సూర్యోదయం నుండి అవిరామంగా, అల్పాహారం కోసం కూడా ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా నడవడం ప్రారంభించాడు. సూర్యాస్తమయం లోపల వీలైనంత ఎక్కువ భూమిని ఉచితంగా పొందడం కోసం, ఒక్క సెకను కూడా విశ్రాంతి తీసుకోకుండా చాలా వేగంగా పరిగెత్తాడు.అలా సూర్యాస్తమయానికి ముందే కొన్ని అడుగులు కూడా వేయనంత అలసిపోయి, తుది శ్వాసను విడిచాడు. అతను వేగంగా పరిగెత్తడం, అతని హృదయం ఒత్తిడికి లోనయ్యింది. చివరికి అతని సమాధి కోసం కేవలం 6 అడుగుల భూమి మాత్రమే లభించింది. అతని దురాశనే అతనికి వినాశనాన్ని చేకూర్చింది.
కథ 3: దురాశ వల్ల వచ్చే విపత్తు గురించి మహాభారత ఇతిహాసం కథ.
దుర్యోధనుడు చాలా దురాశపరుడు. ఆస్తిపై న్యాయపరంగా హక్కు ఉన్న వారికి కూడా, వారి ఆస్తిని వారికి స్వాధీన పరచటానికి ఇష్టపడడు. పాండు కుమారులకు వారి రాజ్యాన్ని ఇవ్వటానికి నిరాకరించాడు. అతని దురాశనే అతని వంశాన్ని, రాజ్య ప్రజలను నాశనం చేసింది.
నేర్చుకోవలసిన అంశములు:
దురాశ మరియు స్వార్థం కారణంగా మనిషి తన మానవత్వాన్ని కోల్పోతాడు. కనుక మానవుడు తనకు లభించిన దానితో, తనకు ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకోవాలి. మరియు భగవంతుని నుండి మనం పొందవలసిన దానిపై దృష్టి పెట్టాలి. ఉన్నదానితో తృప్తిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండగలడు. అలా కాకుండా కోరికలు ఎక్కువైనప్పుడు అసంతృప్తి మరియు దుఃఖాన్ని పొందుతాడు. మనసులో ఏవైనా ప్రాపంచిక కోరికలు తలెత్తినప్పుడు, అవి ఉపయోగం లేని చెత్తగా పరిగణించాలి. దీని ద్వారా నిర్మలమైన మార్గంలోనికి ప్రవేశిస్తారు. అప్పుడు స్వయంగా ఆ పరమాత్మ మిమ్మల్ని స్వాగతించి ఆనందాన్ని నింపుతాడు. నిరంతర భగవన్నామాన్ని జపించడం ద్వారా కోరికలను నియంత్రించుకోవచ్చు. న్యాయబద్ధమైన కోరికలు మాత్రమే నెరవేరుతాయి.
ప్రస్థావనలు:
- సత్యసాయి వచనామృతం 5 వ భాగము, 49వ అధ్యాయము.
- సత్యసాయి వచనామృతము 6 వ భాగము, 22 మరియు 40 వ అధ్యాయము.
- సత్యసాయి వచనామృతము 20వ భాగము, 4 మరియు 55 వ అధ్యాయం.
- ఆదర్శసాయి. హ్యాండ్ బుక్ పేజీ నెంబర్ 367
- సత్య సాయి వచనామృతం 29వ భాగము, 38వ అధ్యాయం
- సత్యసాయి వచనామృతం 28వ భాగము, రెండవ అధ్యాయం
[Adapted from ‘Divine inspiration volume 1 – pg 119’]