సమస్యలలో ఉన్న వారికి సహాయం చేయుట
సమస్యలలో ఉన్న వారికి సహాయం చేయుట
దశ 1:
- సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ లో కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
- మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.
- మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
- కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.
దశ 2:
ఇప్పుడు ఐదు ఇంద్రియాల గురించి తెలుసుకోండి… గదిలోని గాలి యొక్క వాసన… మీ నోటిలోని నీటి రుచి… మీ పాదాల క్రింద నేల యొక్క దృఢత్వం. చర్మంపై గాలి యొక్క స్పర్శ. ఇప్పుడు గదిలోని శబ్దాలు వినండి. (ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు). తర్వాత గది వెలుపల ఉన్న శబ్దాలను వినండి. ఈ వినికిడిని మీకు వీలైనంత వరకు విస్తరించండి.
దశ 3:
ఇప్పుడు మీ శ్వాసపై ఎఱుకను కలిగి ఉండండి. మీ ఊపిరితిత్తుల నిండా దీర్ఘ శ్వాసను తీసుకోండి. తగినంత సమయం తీసుకుని మెల్లగా బయటికి వదలండి. కళ్ళను నెమ్మదిగా మూయండి.
మీరు శ్వాసను లోపలికి తీసుకుంటున్నప్పుడు స్వచ్ఛమైన గుణనివారణ శక్తి (హీలింగ్ పవర్) మీ లోపలికి ప్రవేశించినట్లుగా ఊహించుకోండి. ఆ శక్తి మీలో ఆనందాన్ని, ప్రేమను, శాంతిని నింపుతున్నట్లుగా భావించండి. శ్వాసను బయటికి వదులుతున్నప్పుడు మీకు అసౌకర్యాన్ని కలిగించే గుణాలైన విచారము, అలసట, కోపము, చిరాకు, భయము, విసుగు, అసూయ వంటివి బయటికి వెళ్తున్నట్టుగా భావించండి. మీరు సంతోషంగా ఎటువంటి చింతలు లేకుండా ఉన్నట్టుగా ఊహించుకోండి. ఇలా మూడు నాలుగు పర్యాయములు చేసినచో, మిమ్మల్ని ఆందోళనపరచే విషయములు అన్ని ఒక్కొక్కటి దూరంగా వెళ్లిపోతాయి.
దశ 4:
మీరు ఈ వారంలో ఎవరికైనా సహాయం చేసిన సంఘటన గురించి ఆలోచించండి. మీ ఇంట్లో ఎవరికైనా సహాయం చేశారా? మీ పాఠశాలలో ఎవరికైనా సహాయం చేశారా?లేక
ఇంకెక్కడైనా ఎవరికైనా సహాయం చేశారా. ఆవిధంగా
మీకు సహాయం చేసినప్పుడు ఎలాంటి అనుభూతిని పొందారు?
మంచి పని చేసినందుకు మీ వెన్నును మీరు తట్టుకోండి.
దశ 5:
ఇప్పుడు దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి. కూర్చుని చేసే ఈ వ్యాయామం యొక్క అనుభవాలను విద్యార్థులు పక్కవారితో పంచుకోవాలని అనుకోవచ్చు కనుక వారిని ప్రోత్సహించండి.ఈ వ్యాయామం వలన వారు ఎటువంటి అనుభూతిని పొందారో అడగండి. ఆ అనుభూతిని చిత్రంగా గీయమని ప్రోత్సహించడం వల్ల పిల్లలలో సృజనాత్మకత పెంపొందుతుంది.
[BISSE Ltd శ్రీ సత్యసాయి మానవతా విలువల బోధిని ఆధారంగా.]