లూయీ పాశ్చర్

Print Friendly, PDF & Email
లూయీ పాశ్చర్

కమ్మరివాళ్ళు చేసేపనిని చూస్తూ ఒక బాలుడు కన్నీరు కారుస్తున్నాడు. పిచ్చికుక్క కరిచిన ఒక వ్యక్తిని కొందరు కమ్మరివాని వద్దకు తీసుకొని వచ్చారు. కమ్మరి ఒక కడ్డీని కొలిమిలో ఎర్రగా కాల్చాడు. కొందరు కుక్క కరచిన వ్యక్తిని కదలకుండా పట్టుకున్నారు. కమ్మరి ఎర్రని కడ్డీని కుక్క కరచిన గాయంమీద పెట్టి గట్టిగా వత్తాడు. రోగి బాధను తట్టుకోలేక హృదయ విదారకంగా కేకలు పెడుతున్నాడు

అది 1831 సంవత్సరము, ఇదంతా చూస్తున్న బాలుడు జేన్ జోసెఫ్ పాస్చర్ కుమారుడు, లూయీ పాశ్చర్. జోన్ తోళ్ళు శుభ్రపరిచే వృత్తిలో ఉన్నాడు. లూయీ చూచినది ‘కుక్క కాటుకు’ ఆ కాలంలో అందరూ చేసే చికిత్స. కుక్కల లాలాజలం ద్వారా సంక్రమించే ‘రాబీస్’ అనే వ్యాధి మహాభయంకరమైనది. ఇది కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, గబ్బిలాలద్వారా వ్యాప్తి పొందుతుంది. కాని ముఖ్యంగా కుక్కల ద్వారానే ఎక్కువగా వస్తుంది.

జబ్బుపడిన కుక్కలు పిచ్చిపట్టి దొరికిన వారినల్లా కరుస్తూ ఈ వ్యాధిని అంటిస్తాయి. వెంటనే తగిన చికిత్స చేయక పోతే, భయంకర మరణం సంభవిస్తుంది. లూయీ చూచిన గాయాలపై ఎర్రగా కాల్చిన కడ్డీలు పెట్టీ చికిత్స ఒక్కొక్కసారి అసలు వ్యాధి కన్నా బాధాకరంగా ఉండి మరణానికి దారి తీస్తుంది.

లూయీ పాశ్చరు 1822లో ‘డోల్’ అనే ఫ్రెంచి గ్రామంలో జన్మించాడు. చిన్నప్పుడు అతనిని చూచిన వారెవరూ, ఇతడు గొప్పవాడవుతాడని అనుకోలేదు. విద్యార్ధిగా, భౌతిక, రసాయన శాస్త్రాలపై ఎక్కువ శ్రద్ధ చూపించే వాడు. వీటిపై పరిశోధన చేసి రసాయన శాస్త్రాచార్యుడు అయ్యాడు. ద్రాక్షతోటలకు ప్రసిద్ధి పొందిన లిల్లీ (Lille) పట్టణంలో ఆచార్యుడుగా పనిచేసి అక్కడే భవిష్యత్తులో మానవ ప్రపంచానికి ఉపయోగించిన శాస్త్ర పరిశోధనలు ఎన్నో చేశాడు.

Louis Pasteur doing reseach

పాలు, వెన్న, ద్రాక్షసారాయి కంటికి కనుపడని సూక్ష్మ జీవుల ప్రభావం వల్లనే పులుపు ఎక్కుతాయి అని లూయీ నిరూపించాడు. ఈ జీవులను మైక్రోస్కోపు ద్వారా మాత్రమే చూడగలము. ఈ వస్తువులను కాచినట్లయితే సూక్ష్మజీవులు నశిస్తాయని ఆయన కనుగొన్నాడు. దీనినుండి మానవులకు జంతువులకు వచ్చే అనేక వ్యాధులకు కారణము సూక్ష్మజీవులే అనే సిద్ధాంతం ఆయన ధృవీకరించాడు.

ఈ సమయంలో ఫ్రాన్స్ దేశంలో పట్టుపరిశ్రమ సర్వ నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం పటుపురుగులు ఏదో వ్యాధికి గురిఅయి వేలు, లక్షల సంఖ్యలో చనిపోవడమే. ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి అ సూక్ష్మ జీవుల బారినుంచి పట్టు పురుగులను ఎలా కాపాడుకోవాలో సలహా ఇచ్చాడు.

దీని తర్వాత పరిశోధన ‘రాబీసు’ వ్యాధినుంచి అనేక మందికి విముక్తి కలిగించింది. పాశ్చరు అనేక పరిశోధనలు చేసి, వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు ఏవో నిర్ధారణ చేసుకున్నాడు. అవి కుక్కల లాలాజలంలో ఉండవచ్చునని అతడు అనుమానించాడు, దీనిని తేల్చుకోడానికి కుక్కల లాలాజలం గ్రహించేది ఎలా? ఇది చాలా ప్రమాదకరమయిన పని. ఇద్దరు దృఢ కాయులు జబ్బు చేసిన కుక్క నొకదానిని పట్టుకొని ఒక బల్ల మీద పడుకో బెట్టారు. పాశ్చరు దాని నోటిలో నుంచి ఒక గాజు గొట్టం ద్వారా లాలాజలాన్ని గ్రహించాడు. కుక్క ఏ మాత్రం కదిలి, వారి నెవరినైనా కరిచిందా, అది ప్రాణాపాయానికే దారి తీయవచ్చు, కాబట్టి ఇది ఆ వ్యక్తుల పట్టుదల, కార్యదీక్ష పై ఆధారపడి ఉంది.

తర్వాత ఈ లాలాజలాన్ని ఆరోగ్యంగా ఉండే కుక్కలకు ఎక్కించాడు. వాటిలో జరిగే పరిణామాలను గ్రహించి ఆయన ఒక మందును తయారు చేశాడు. అది కుక్కల మీద సక్రమంగా ప్రయోగించిన తర్వాత మానవులమీదు ప్రయోగించాడు.

తన ప్రయోగానికి సహాయకారులుగా పాశ్చరు, జోసెఫ్, మెయిస్టరు, జూపిల్ అనే ఇద్దరు బాలురను ఎన్నుకున్నాడు. వారిద్దరూ పిచ్చి కుక్కల చేత ఎన్నోమార్లు కరిపించుకొని కూడా ఆ జబ్బుకు లోనుకాలేదు.

ఈ పరిశోధనల ఫలితాలు ప్రపంచం అంత తెలిసాయి. వివిధ దేశాల నుండి ప్రముఖులు పాశ్చరును అభినందించారు. అనేక దేశాలు పాశ్చరును గౌరవించాయి. ఫ్రాన్సులో జన్మించిన మానవోత్తములలో ఒకడుగా అతనిని కీర్తించారు.

ప్రశ్నలు:
  1. పాశ్చరును కదిలించిన సంఘటన ఏది?
  2. కుక్కకాటుకు నాటు వైద్యం ఏది?
  3. పాశ్చరు ఏమి కనిపెట్టెను?
  4. పాశ్చరు మహనీయుడుగా ఎందుకు గుర్తింపబడెను?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *