మొక్కలు కూడా ప్రాణులే
మొక్కలు కూడా ప్రాణులే
డాక్టరు జె. సి. బోస్ గొప్ప జీవశాస్త్రవేత్త. మొక్కలకు కూడా ప్రాణం ఉన్నదని ఆయన నిరూపించారు. బోసు తండ్రి న్యాయమూర్తి, తల్లి ఒక కరుణామూర్తి.
బెంగాలీ భాషలో బోధించే బడిలో బోసు చిన్నప్పుడు చదివాడు. బీద పిల్లలతో కలిసి మెలిసి ఆడుకున్నాడు. చిన్న బాలుడుగా అన్ని విషయాలు తెలుసుకోవాలని తహతహ పడేవాడు. మిణుగురు పురుగు ఏమిటి? గాలి ఎందుకు వీస్తుంది! నీరు ఎందుకు ప్రవహిస్తుంది? పరిశీలన కోసం కప్పలను, చేపలను ఒక చిన్న నీటిమడుగులో పెంచాడు.
అప్పుడే చిగురిస్తున్న చిన్న మొక్కను పీకి వ్రేళ్ళు ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలించేవాడు. ఎలుకలు, ఉడతలు, విషం లేని పాములను పెంచేవాడు.
బోసుకు చిన్న వయస్సులో, వారింట్లో పనిచేసే నౌకరు భారత వీరుల కధలు చెప్పేవాడు. తల్లి రామాయణ భారతాల నుండి ఘట్టాలు చెప్పేది. ఇవి శ్రద్ధగా విని బోసు భారతీయ సంస్కృతి మీద గౌరవం, ప్రేమ పెంచుకున్నాడు.
పై చదువుల కోసం బోసును ఇంగ్లాండుకు పంపించారు. తిరిగివచ్చి అయన కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకుడుగా చేరారు. కష్టపడి పనిచేసి, ధనం కూడబెట్టి తన స్వంతం కోసం ఒక పరిశోధనశాలను నిర్మించుకున్నాడు. ఆయన ఎక్కువ అభిమానించినది విద్యుచ్ఛక్తి. అనేక పరిశోధనల ద్వారా, మొక్కల ద్వారా విద్యుత్ప్రసారం జరిగినపుడు మొక్కలలో చలనం, కంపన ఉంటుందని నిరూపించాడు. విద్యుత్ప్రసారం వలన మొక్కలలో కలిగే అనుకంపనను చూపించే సాధనాన్ని ఆయన కనిపెట్టాడు.
తన పరిశోధనలను వివరించమని లండన్ లోని రాయల్ సొసైటీ బోసును ఆహ్వానించింది. మొక్కలకు విషం ఎక్కిస్తే అవి కూడా బాధపడి చనిపోతాయని ఆయన నిరూపించాడు. కొన్ని మొక్కలు ఎందుకు నిటారుగా పెరుగుతాయో, కొన్ని ఎందుకు వంకరటింకరగా పెరుగుతాయో కూడా పరిశీలించి వివరించాడు. తాకగానే మొక్కలలో ఏర్పడే అనుకంపనను కొలిచే పరికరాలను ఆయన నిర్మించాడు. ఒక భారతీయ శాస్త్రవేత్త ఇటువంటి సున్నితమైన పరికరాలను నిర్మించ గలడని కూడా ఎవ్వరూ ఊహింలేదు.
మొక్కలు వెలుతురు కోసం తపించిపోతాయని, ఉష్ణోగ్రత ఎక్కువ తక్కువలనుబట్టి మొక్కలు విస్తరించుకోవడము,ముడుచుకోవడం చేస్తుంటాయి అని ఆయన చూపించాడు. మొక్కలు వ్రేళ్ళులేనప్పుడు కూడా నీటిని తీసుకొనగలవని, మొక్కలలోని జీవకణాలకు మానవ హృదయం వలె సంకోచ వ్యాకోచము ఉండగలవని బోసు వివరించాడు.
పాశ్చాత్యులు వీటిని గురించి సందేహాలు వెలిబుచ్చినపుడు బోసు అన్నాడు, “ఇవన్నీ ఏనాడో ప్రాచీన భారత దేశంలో ఋషులు తెలుసుకున్నారు. వారు జీవులన్నిటిలో ఏకత్వం నిరూపించారు”.
రవీంద్రనాథ్ ఠాగూర్, వివేకానందుడు, జగదీష్ చంద్ర బోస్ ను అభిమానించి, సలహాలు కూడా ఇచ్చేవారు.
బోసు తన జీవిత కాలంలో తన ఏకైక ధ్యేయాన్ని నెరవేర్చుకున్నారు. అది ఒక పరిశోధనా సంస్థను ఏర్పంచడం. దాని ద్వారా అనేక మంది యువ శాస్త్రజ్ఞులకు పరిశోధనలు జరుపుకోడానికి అవకాశం కల్పించారు. ఆచార్య బోసు ఇతర దేశాలు పర్యటించి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. శాస్త్ర పరిశోధనకై ఎన్నో వ్యాసాలు రచించి ప్రచురించారు. ఆయన లెక్కలేనన్ని శాస్త్రపరికరాలను నిర్మించారు.
ప్రశ్నలు
- ఆచార్య బోసు బాల్యం గురించి వ్రాయుము?
- ఆయన అభిమాన విషయమేది?
- మొక్కల గురించి ఆయన పరిశోధించి నిరూపించిన వాటిని తెలుపుము.