పండుగలు ప్రాముఖ్యత -నవరాత్రి

Print Friendly, PDF & Email
నవరాత్రి

భారతదేశంలో నవరాత్రి ముఖ్యమైన పండగ . ఇది ఆశ్వయుజ శుక్ల పాఢ్యమి నుండి ప్రారంభమవుతుంది. (ఆంగ్ల మాసం ప్రకారం అక్టోబర్లో జరుపబడుతుంది). తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు జరుపబడుతుంది కనుక దీనికి “నవరాత్రి” అని పేరు.ఈ నవరాత్రులలో శక్తిస్వరూపిణియగు అమ్మవారిని అనేక విధములైన రూప నామములతో ఆరాధిస్తారు. కాళీ, లక్ష్మి, సరస్వతి, చండిక, దుర్గ, భవాని, అంబిక మొదలగునవి అమ్మవారి నామములు. దుష్ట సంహరణమే తన ధ్యేయంగా అవతరించిన మాత అనేక బాహువులను కల్గి యుండి, అనేక విధములైన ఆయుధములను ధరించి, శక్తిస్వరూపిణిగా గోచరించును. సింహాసనారూఢురాలై, శక్తి సామర్థ్యములు, ధైర్యసాహసములు కలిగిన మాతను ‘మహిషాసురమర్దిని’ అని కూడా పిలిచెదరు.

మహిషాసురుడను రాక్షసుణ్ణి సంహరించుటచే మాత ‘మహిషాసుర మర్దిని’ గా పేరుగాంచెను. మహిషము అనగా దున్నపోతు. దున్నపోతు జడత్వానికి, బద్ధకానికి ప్రతీక. ఈ గుణాలు మానవుని ఆధ్యాత్మిక పురోగతిని నిరోధిస్తాయి. కనుక ప్రతి మానవుడు తనలోని ఈ రెండు లక్షణాలను నిర్మూలించుకొనవలెని అంతరార్థము.

అమ్మవారిని ఆరాధించే వివిధ పద్ధతులు:

నవరాత్రి పండుగ తొమ్మిది రోజులు అమ్మవారిని త్రిమూర్తి స్వరూపిణిగా అనగా దుర్గా లక్ష్మి సరస్వతి గా ఆరాధిస్తారు. దుర్గాదేవి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి ఉత్తమగుణ సంపత్తిని అనగా జ్ఞాన సంపద, శీలసంపద, ఆరోగ్య సంపదలను ప్రసాదిస్తుంది. సరస్వతి దేవి బుద్ధిని పవిత్రం చేసి, విచక్షణ జ్ఞానాన్ని, మేధాశక్తిని ప్రసాదిస్తుంది.

ఆచారాలు మరియు వేడుకలు:

ఈ దసరా నవరాత్రులలో అమ్మవారి శక్తిని తెలియజేయు పవిత్ర గ్రంథములయిన దుర్గా సప్తశతి, దేవీ మహత్యం, లలితా సహస్రనామ పారాయణలు చేస్తారు. అమ్మవారి ప్రతి నామము ప్రత్యేకమైన గుణాన్ని, ప్రత్యేకతను, కీర్తిని కలిగి ఉంటుంది. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో దసరా పండుగను వివిధ పద్ధతుల్లో జరుపుకుంటారు. అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరిస్తున్నట్టుగా మట్టితో అందమైన విగ్రహాలను రూపొందించి, దేవాలయాలలోనూ, వివిధ ప్రాంతాలలో ప్రతిష్ఠిస్తారు. అమ్మవారిని ప్రతిష్టించిన ఆ పవిత్రమైన స్థలంలో మొదటి రోజు రాత్రి ఘట స్థాపన చేస్తారు. కుండలో నూనెతో అఖండ దీపాన్ని ప్రజ్వలింప చేస్తారు.

గుండ్రటి కుండ యెక్క రూపం విశ్వానికి ప్రతీక. నిరంతరాయంగా వెలుగుతున్న ఆ అఖండ దీప ప్రకాశాన్ని ఆదిశక్తిగా అనగా దుర్గాదేవిగా పూజిస్తారు.అమ్మవారి
ముందు కలశస్థాపన చేస్తారు. పవిత్ర మంత్రాలను పఠిస్తూ కలశంలోమట్టి, నీరు పోసి దానిపై ధాన్యం చల్లు తారు. ఆ ధాన్యం తొమ్మిది రోజుల్లో మొలకెత్తటం, సంపద అభివృద్ధికి సూచన అని గుర్తిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నవరాత్రుల్లో “ఏకభుక్త” నియమాన్ని పాటిస్తారు.

బెంగాల్ ప్రాంతంలోని ప్రజలంతా దుర్గా పూజను సామూహికంగా భక్తిప్రపత్తులతో ఆనందంగా జరుపుకుంటారు. పెద్ద పెద్ద పందిళ్ళు వేసి అందులో అందమైన దుర్గా, లక్ష్మి, సరస్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ప్రాతః కాలంలో భక్తితో పూజలు చేసి తర్వాత అందరికీ ప్రసాదాలను పంచుతారు. సాయంత్రం వేళలో భక్తితో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నవరాత్రులలో ఎనిమిదవ రోజున చిన్నారి బాలికలకు “కుమారిపూజ” చేస్తారు. అనగా ఆ బాలికలను అమ్మవారిగా ఆరాధిస్తారు. కొన్ని ప్రాంతాలలో “కుమారి పూజను” తొమ్మిదవ రోజు జరుపుకుంటారు.
అలాగే భారతదేశంలో పలు ప్రాంతాల్లో నవమి రోజున ఆయుధపూజ జరుపుకుంటారు. అమ్మవారు మహిషాసురుని సంహరించాక ఆయుధములతో పనిలేదని తిరిగి వాటిని దాచి పెడతారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు వారి వృత్తికి చెందిన పనిముట్లకు “ఆయుధ పూజ” చేస్తారు.

చివరి రోజు అనగా పదవరోజు అమ్మవారికి అశ్రు నయనాలతో వీడ్కోలు ఇచ్చి, నదులలో, చెరువులలో లేదా సముద్రాలలో నిమజ్జనం చేస్తారు. సాకార రూపిణియైన అమ్మవారు నిరాకార రూపిణిగా, అనంత రూపిణిగా రూపొందుతుంది.

దక్షిణ భారతదేశంలో స్త్రీలు అనేక దేవతా మూర్తుల విగ్రహాలను తమ తమ గృహాల్లో ”బొమ్మల కొలువు” గా ఏర్పాటు చేస్తారు. గుజరాత్ లో ఈ నవరాత్రులలో సామూహికంగా ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తారు.

సాయంత్రం వేళలో భక్తితో కూడిన నృత్యాలతో, భక్తి గానాలతో ఆనందంగా గడుపుతారు. స్త్రీలంతా గాగ్రా చోళీల వంటి ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులను ధరించి, అందంగా అలంకరించుకుని, దీపం వున్న కుండ చుట్టూ ఒక వృత్తాకారంలో నిలబడి నృత్యం(గర్భా) చేస్తారు. అలాగే ప్రసిద్ధి పొందిన దాండియా నృత్యం కూడా చేస్తారు.

ఉత్తర భారతదేశంలో దసరా పండుగలలో రామాయణ గాథలు తెలియచేసే “రామలీల” ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. రామాయణంలోని ముఖ్య ఘట్టాలను పారాయణం చేస్తారు. విజయదశమి రోజున జరుపుకునే వేడుకలో రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు మొదలగు రాక్షసుల ఓటమిని సూచించే రీతిగా దిష్టి బొమ్మలను చేసి కాలుస్తారు. రావణాసుని పై శ్రీరాముని విజయాన్ని చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తారు.

దసరా పండుగ అంతరార్థం:

నవరాత్రులలో దుర్గా లక్ష్మి సరస్వతి లను ఆరాధిస్తారు.ఈ ముగ్గురు దేవతలు ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమో గుణములు. ప్రకృతి అనుగ్రహం పొందటానికి దుర్గా లక్ష్మి సరస్వతి లను ఆరాధించటం.ఈ ఆరాధనలో నవ విధ భక్తి మార్గముల సాధన కూడా ఇమిడి ఉంది. నవరాత్రి అనగా తొమ్మిది రాత్రులు. రాత్రి చీకటితో కూడినది. చీకటి అజ్ఞానమునకు చిహ్నం. మానవత్వం లో ప్రవేశించిన తొమ్మిది విధములైన దుష్ట ప్రవృత్తులను పారద్రోలి జ్ఞాన ప్రకాశాన్ని అనుభవించే నిమిత్తమై చేయు ఆరాధనయే నవరాత్రి ఆరాధన. అంతేకాక మానవుడు తనలో వున్న మహి షత్వమును(అసుర సంపదను)పారద్రోలి మనీషత్వమును పొందుట అని అర్థం.
అమ్మవారు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియా శక్తి స్వరూపిణి. మానవులు తమ ఇచ్ఛాశక్తిని దైవం పై ఇచ్ఛగా మార్చుకోవాలి. క్రియాశక్తిని దైవ కర్మలలో ప్రవేశపెట్టాలి.

జ్ఞానశక్తి తో ఆత్మజ్ఞాన సముపార్జనకు కృషి చేయాలి. తమ మాతృమూర్తిని దుర్గా లక్ష్మీ సరస్వతుల సమన్వయ రూపంగా గుర్తించి, వర్తించాలి. ఆయుధపూజను “మానవుని మనుగడకు తోడ్పడే శ్రామికుల జీవనాధారమైన ఆయుధముల యందు ఆరాధన భావమును కలిగి యుండుటను సూచించును. బొమ్మల కొలువు స్త్రీలలోని కళాభిజ్ఞతను, సృజనాత్మకతను తెలియజేయును. కుమారిపూ, స్త్రీలు శక్తిస్వరూపిణులు అని తెలియజేయను. ప్రకృతిలోని శక్తియే దుర్గామాత. దుర్గామాత మానవత్వాన్ని పోషించి, దానవత్వాన్ని సంహరిస్తుంది. దుర్గ యొక్క రక్షణ శక్తి యే లక్ష్మి. లక్ష్మిగా దైవీ భావాలను ఆవిర్భవింప జేస్తుంది. సరస్వతిగా పవిత్రమైన వాక్కును ప్రసాదిస్తుంది. ఈ దసరా పండగ దైవచింతను, దైవారాధను పెంపొందించు జేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: