“నీ హృదయములోను విశ్వహృదయములోను మారుమ్రోగుచున్న అనాది ప్రణవనాదమును – ఓంకారమును వినుము” – బాబా
హిందువులకు ఓంకారము అత్యంత పవిత్రమైన పదము. వారికది పరమాత్మకు పర్యాయపదము, వారు తమ ఇష్టదైవములనైనను, మరియే దైవమునైనను ఓంకార రూపముగనే భావించెదరు. వారి దృష్టిలో ఓంకారమే భగవంతుని ప్రతీక, భగవంతుని నామము కూడా. మానవుడు భగవంతుని పొందుటకు సహాయము, సాధనము నగు మహా మంత్రముగా వారు గ్రహింతురు. శ్రీ సత్యసాయి సర్వధర్మ చిహ్నమునందు ‘ఓం’ హిందూ ధర్మమునకు ప్రాతినిధ్యము వహించుచున్నది.
సృష్టికంటే ముందే అనాదియందు బ్రహ్మమొక్కటే కలదని చెప్పుదురు. అప్పుడది మహానిశ్శబ్ద రూపముగా నుండెడిది. అట్టి మహానిశ్శబ్దము నుండి నాదబ్రహ్మము ఉదయించినది. అదియే భగవంతుని నాదాత్మకమైన అభివ్యక్తి. అదియే అనాదినాదము. అదియే ఓంకారము. దాని నుండి పంచభూతాత్మకమైన సృష్టి వెలువడినది. పంచభూతము లనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము,పృథివి (పృధివ్యాపస్తేజోవాయురాకాశములు). ఓంకారము సృష్టియందు అంతర్లీనమై యున్నది. సృష్టిస్థితికి కారణమై, సృష్టికి జీవసూత్రమైనది. అందువలన ఓంకారమును ప్రణవమని పిలిచెదరు. ప్రణవమనగా ప్రాణమునందు ప్రసారమగునది, ప్రాణులన్నింటిలో వ్యాపించియుండునది అని చెప్పుకొనవచ్చును. ప్రణవ మంత్రము యొక్క ప్రాముఖ్యత వేదములలోను, ఉపనిషత్తులలోను ప్రకటింపబడినది.
వేదమునందు ఇట్లు చెప్పబడియున్నది –
ప్రజాపతి వై ఇదం అగ్ర అసీత్, తస్యవాక్ ద్వితీయ అసీత్, వాగ్వై పరమంబ్రహ్మ
(ఆదియందు ప్రజాపతి యుండెను. అతనితో కలసి అతని వాక్కు ఉండెను. ఆ వాక్కే పరబ్రహ్మము)
బైబిలులోని క్రొత్త నిబంధనలో సెంట్ జాన్ చెప్పిన శుభవార్తలో కూడా ఇట్టిభావమే ప్రతిధ్వనించుచున్నది.
ఆదియందు వాక్కు కలదు. ఆ వాక్కు భగవంతునితో కలసి యుండెను.ఆ వాక్కే భగవంతుడు.(“In the beginning was the word and the word was with God and the word was God”)
పైన చెప్పబడిన వాక్యములన్నియు ఓంకారము యొక్క మాహాత్మ్యమును తెలుపుచున్నవి. ఓంకారమే స్వయముగా భగవంతుడు. అంతేకాదు భగవత్సాక్షాత్కారమునకు అది ఉత్తమమైన సాధనము.
ఓంకారము వంటి పవిత్ర పదము ఇతర మతముల యందును కనపడును. కాని అవి దానికంటే కొంత మారురూపమున కనపడును. క్రైస్తవులు “ఆమెన్” అందురు; ముసల్మానులు “అమిన్” అందురు. ఆ పదములకున్న అర్ధ సమన్వయము, ఉపయోగము ఓంకారమునకు తుల్యమైనవి కాకపోయినను అవి ఆ యా మతస్థులచే పవిత్రములైన పదములగా భావింపబడుచున్నవి.
మన ఇష్ట దైవముల నామరూపముల కన్నింటికి ఓంకారమే ప్రతీక
ఉపనిషత్తులలో భగవంతుడు నిరాకారమైన బ్రహ్మముగనే మిక్కిలి కీర్తింపబడినాడు. జనసామాన్యమునందు ప్రచారములో నుండు మతదృక్పథములలో ఇష్టదైవములకు ప్రాముఖ్యముండును. ఇష్టదైవములకు నామ, రూప, గుణములు ప్రధానములు. నిరాకార బ్రహ్మముపై మనసు నిలిపి, సమాహిత పరచుట మనలో చాలామందికి చాల కష్టము.
భగవంతుని ప్రతి నామములో బీజాక్షర మొకటి యుండును.
అకార,ఉకార,మకారములను మూడు బీజాక్షరముల త్రిపుటి ఓంకారము.
- ‘అ’ కారము బ్రహ్మను
- ‘ఉ’ కారము విష్ణువును
- ‘మ’ కారము మహేశ్వరుని వ్యంజింపజేయు బీజాక్షరములు.
బ్రహ్మ పదములోని అకారము, విష్ణు పదములోని ఉకారము, మహేశ్వర పదములోని మకారము బీజాక్షరములు. ఓంకారమును ఉచ్ఛరించినచో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కీర్తించినట్లే యగును. హిందువులు ఆ మూర్తిత్రయమును భగదద్భావముతో భజించుట సంప్రదాయము. కావున, ఓంకారము ఆ మూర్తిత్రయ నామ సంపుటిగా ఆవిర్భవించినది.
ఓంకారము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నామములే కాక హిందువులు, పూజించెడి ఇష్టదైవముల నామముల కన్నింటికి కూడా ప్రాతినిధ్యము వహించుచున్నది. లక్ష్మీ, పార్వతి, గణేశుడు, మారుతి మొదలైన ఇష్టదైవముల పేర్లన్నియు ఓంకారముచేత వ్యక్తమగుచున్నవి.
ఓంకారములోని ‘అ’ కారము బ్రహ్మను తెలుపును. బ్రహ్మదేవుని భార్య సరస్వతి. ఆమె బ్రహ్మ యొక్క నాలుకపై వసించును. బ్రహ్మయొక్క వాక్కే సరస్వతి. ఆమె అతని వాక్ శక్తి. అతని నుండి ఆమెను వేరుపరచుటకు వీలుకాదు. బ్రహ్మ యొక్క విజ్ఞానము, ప్రజ్ఞానము- సరస్వతి. కావున
‘అకార’మనెడి బీజాక్షరము నందు సరస్వతీ దేవి కూడ వ్యక్తమగుచున్నది.
విష్ణుదేవుని భార్య లక్ష్మీదేవి. ఆమె విష్ణువు యొక్క వక్షస్థలము నందు వసించును. అతని నుండి ఆమెను వేరుచేయుటకు వీలుకాదు. విష్ణువు క్షీరసాగరము నందు వసించునని చెప్పుదురు. కానీ విష్ణుదేవుని హృదయమే ఒక దయాసాగరము అతని దివ్యకరుణయే ఒక క్షీరసాగరము. లక్ష్మీదేవి క్షీరసాగరమునుండి పుట్టినదని పురాణములు చెప్పుచున్నవి. లక్ష్మీదేవి విష్ణుదేవుని వక్షస్థలము నందు ఉండు ననగా అర్థమేమి? విష్ణుదేవుని దయాస్వరూపమే లక్ష్మీదేవి యను భావము. కావున ‘ఉకార’ మనెడి బీజాక్షరము లక్ష్మీ యొక్క అంశతో కూడుకొనిన విష్ణు తత్వమును వ్యంజింపజేయుచున్నది.
ఓంకారమును ఉచ్ఛరించిన చాలును. భగవంతుని అన్ని రూపములు దానికి మారు పలుకును. అందువలననే “ఓంకారము నా టెలిఫోన్ నెంబరు” అని అంటారు బాబా. బాబా పుట్టపర్తిలోనున్నను, బృందావనములో నున్నను, అనంతపురములో నున్నను, పర్యటనలో మరే ప్రదేశమునందు నున్నను, మనము ఓంకారమును ఉచ్చరించిన చాలును, మన పిలుపు బాబాకు వినబడును. ఓంకారము, రామనామము ఒక్కటే అని బాబా ప్రవచించినారు. ప్రణవమే శ్రీరామచంద్రుడు. అందులోనున్న అకార, ఉకార, మకారములు వరుసగ లక్ష్మణ, భరత, శత్రుఘ్నులని బాబా వ్యాఖ్యానించినారు. ఓంకారము శబ్ద ప్రపంచమునకు స్ఫోటము, శబ్ద శాస్త్రమునకు మూలము, ధ్వని శాస్త్రమునకు సారము.
ధ్వనులన్నింటికిని, శబ్దములన్నింటికిని మూలము ప్రణవము. వివిధ వర్ణములతో కాని, అచ్చులతో కాని కలిపి ఉచ్చరింపబడు ధ్వనులన్నియు ఓంకారములోని అకార, ఉకార, మకారములు ఉత్పత్తియగు స్థానముల సరళి నాశ్రయించియే పుట్టుచున్నవి. సర్వనాద మూలము ప్రణవ శబ్దము. అందువలననే సర్వ వేద సారము ఓంకారమని చెప్పబడినది. ప్రణవమునందే భగవన్నామములన్నియు పర్యవసించు చున్నవి. మనము భగవంతుని నెన్ని రూపములు ధ్యానించినను ఎన్ని నామముల నుతించినను ఓంకారము సర్వదేవతారాధనకు మూలరూపమై నిలచియున్నది.
ఓంకారము నాలుగు మానసికావస్థలకు ప్రాతినిధ్యము వహించును.
బ్రహ్మము, ఆత్మ, నిజమునకు రెండు కావు. అద్వైతమైన ఏకైక సత్యము. ఓంకారము ఆత్మకు ప్రాతినిధ్యము వహించునని ఉపనిషత్తులు కీర్తించుచున్నవి. ఆత్మకు నాలుగు విధములైన అవస్థలు కలవని చెప్పుదురు. అందులో మూడు మనకందరకు తెలిసినవే. అవి-
- (జాగ్రదావస్థ, (మేలుకొనియుండు స్థితి)
- స్వప్నావస్థ (నిదురలో కలలుగనుస్ధితి)
- సుషుప్త్యవస్థ (ఎట్టి కలతలులేని గాఢమైన నిద్రాస్థితి)
మన నిత్యజీవితములో ప్రతివారును ఈ మూడు అవస్థలను అనుభవించు చుండుట మనందరకు తెలిసిన విషయమే. యోగులు మాత్రము ఈ అవస్థలను మూడింటిని దాటి, అన్నిటికంటే ఉత్తమమైన తురీయావస్థను గూడ పొందుచుందురు. ఇది ఇంద్రియములకు అతీతమైన ఆధ్యాత్మిక స్థితి. అట్టి తురీయావస్థలో యోగి తన ఆత్మయొక్క నిజస్థితిలో తాను నిలిచి సమాధి అనెడి ఆత్మానంద స్థితిని పొందును, సత్- చిత్ ఆనంద రూపమైన ఆత్మను పరమాత్మకు అభేదముగా భావించి ఆత్మానంద స్తితియందు నిలిచి యుండుటయే ‘తురీయావస్థ’ లేదా ‘సమాధ్యవస్థ’.
పై నాలుగు మానసికావస్థలను ఓంకారము తెలుపుచున్నది.
ఓంకారము జీవిత నియమసారము: విశ్వమంతయు నిండిన ప్రధాన చైతన్యము ,శ్వాసనిశ్వాసల సూక్ష్మనినాదము.
ప్రకృతిలో వినపడు ప్రతి ధ్వనిలోను భగవంతుని ఉనికిని ప్రకటించు
ఓంకారమను, సూక్ష్మగ్రహణ శక్తి గల ప్రతివ్యక్తియు వినగలడు. మన చెవులకు వినపడక పోయినను, సుషుమ్న నాడిలో అనాహత శబ్దముగా ఓంకారము ఒక్కటే ఎల్లవేళలా నినదించుచుందును. ఓంకార నాదస్పందనలలో – “సోహం” అను నాదములు మారుమ్రోగుచుండును. ఆ నాదములు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో వినపడు సూక్ష్మధ్వనులు.
‘సో (సః)’ అనగా -అతడు(భగవంతుడు), ‘అహమ్’ (హం) అనగా- నేను (జీవాత్మ), “సోహం”-నాదముతో మన జీవాత్మ పరమాత్మతో చేరుచున్నది.
భగవంతుని నామములు సహజముగా మహాశక్తిమంతములయ్యును ఓంకారముతో మొదలై ఉచ్చరింపబడుచుందును.
మనమే పుణ్యకార్యము నైనను ప్రారంభించుటకు ముందు విఘ్నేశ్వరుని పూజించి ఆయా కార్యములను ఆరంభించుట అలవాటు. అట్లే, ఏ మంత్రమునైనను, ఏ భగవన్నామము నైననూ ఓంకారమును ముందు ఉచ్చరించియే ఆపైన పలుకవలెను. గణేశుని పవిత్ర నామమును ఉచ్చరించునప్పుడు ప్రణవమును ముందుగా జతచేర్చి ‘ఓం గణేశాయ నమః’ అని పల్కవలెను. ఓంకారముతో కూడి ఏ నామమైనను, ఏ మంత్రమైనను ఎన్నియోరెట్లు శక్తిని కలిగియుండును.
ఓంకారోచ్ఛారణ వైఖరులు (వైఖరీ, మధ్యమా, పశ్యంతీ,పరా)
ఏ మంత్ర జపము ఉచ్చరించునప్పుడైననూ, నాదము వెలువడుటలో
నాలుగు అవస్థలు దాటవలసి యుండును. ఓంకార మంత్రమును బిగ్గరగా ఉచ్చరించునప్పుడు వెలువడు నాదవిధానమును ‘వైఖరి’ యని అందురు.
రెండవ అవస్థ ‘మధ్యమ’. దీనిలో ఉచ్చరింపబడుచున్న ఓంకారము కాని, మంత్రము కాని నాదరూపముగా బయటికి వినపడదు. మంత్రోచ్చారణము చేయుచున్నవారి పెదవులు మాత్రము కదలుచుండును. ఇది ఒక విధముగా నాదమునకును, నాదము లేకపోవుటకును నడుమ నుండెడి ఒకదశ.
మూడవ అవస్థ ‘పశ్యంతి’, దీనిలో నాదభివ్యక్తియే ఉండదు. నోరు తెరచినను, మూసినను మంత్రోచ్ఛారణము మచ్చుకైనను కానరాదు. కాని అప్రయత్నముగా మనస్సులో జపము నిరంతరము సాగుచుండును. ఈ దశలో నాదాభివ్యక్తి నిలిచిపోవును.
నాలుగవ అవస్థ ‘పరా’. దీనిని అందుకొనుసరికి సాధకుడు మంత్రమునే మరచిపోవును. కాని, దాని ప్రభావ ముద్రమాత్రము సాధకుని వ్యక్తచైతన్యముపై బలముగా నిలచును. ఇదియే తురీయావస్థ. తురీయావస్థలో ఆనందము, సంతోషము సుఖతరంగముల పొంగు తప్ప మరియేమియు ఉండవు.
మనము ప్రయత్నపూర్వకముగనే ఓంకార మంత్రమును జపించుట అలవాటు చేసికొనవలెను. ఆ మంత్రము మన మనస్సుకు అనుకూలముగా నుండుటకై ఓంకారమునకు మన ఇష్టదైవము యొక్క దివ్యనామమును చేర్చిపలుకు చుండవలయును. మనము శ్వాసనెంత సహజముగా చేయుచుందుమో, మన మనస్సు ఓంకారమునంత సరళముగా జపించుచుండును.
ఓంకార మంత్రోచ్ఛారణము మన జీవితములో ఒక మంచి అలవాటుగా స్థిరపడవలెను. ఆ అలవాటే మనదైనందిన జీవితములో మనబ్రతుకులో భాగమై పోవలెను.
ఓకారోచ్చారణమును మన శ్వాస నిశ్వాసలతో సమాంతరముగా శృతి
కలుపుకొని సాగునట్లు నియమించుకొనవలెను. ఇట్టి సాధన ముందుకు సాగినకొలది శరీరారోగ్యము పెంపొందును, మనస్సు పవిత్రమగును . బుద్ధి వికసించును. హృదయము విప్పారును. ఆధ్యాత్మికత అభివృద్ధి చెందును. పరమపదమును పొందగలుగుటకు కొంతకాలము పట్టినను, మనకు సద్యః ఫలముగా దేహారోగ్యము, సునిశిత బుద్ధి వికాసము తప్పక లభించును.
ఈనాటి నుండి ఓంకారము మననెల్లప్పుడు అంటిపెట్టుకొని యుండెడి ఉత్తమ మిత్రునిగా స్వీకరించెదముగాక.
మన మనస్సు ఓంకారమునే సదా స్మరించుచుండునుగాక!
ఓంకారమును ఒక్కొక్కసారి స్మరించిన కొలది, ఒక్కొక్క అడుగు ముందుకు వేయుచు, బాబాకు మరింత దగ్గరగా మనము చేరుచుందుము. కొద్దిగా వెనుకగనో, ముందుగనో, మనము భగవంతుని పాదపద్మములను చేరికొని, వారి సన్నిహితులము, హితులము అగుట మాత్రము తథ్యము.
“ఓంకారం బిందుసంయుక్తం, నిత్యం ధ్యాయన్తి యోగినః
కామదం మోక్షదం చైవ. ఓంకారాయ నమోనమః”
బిందువుతో కూడికొనిన ఓంకారమునకు అర్ధమేమి?
మన మందరము ఓంకారము నుండి జనించిన బిందువులమే అను తాత్పర్యమును తెలుపుచున్నది. ఈ సత్యమును సదా మననము చేసికొనుచు యోగులు ఓంకారమును ధ్యానించుచుందురు. ప్రణవమును సదా ఉచ్చరించుట వలనను మరియు పరమార్ధమును తెలిసికొనుటవలనను మానవుడు ఆనందమును, మోక్షమును పొందగలుగుచున్నాడు. అట్టి ప్రణవమునకు నేను ప్రణామములు అర్పించు చున్నాను”.