తొందరపాటు వలన నష్టము
ఒకప్పుడు ఛత్రపతి శివాజీ ఒక కోట నుండి బయలుదేరి మరొక కోటక చేరే మార్గం తప్పాడు. కొండ శిఖరానికి చేరి అక్కడ నుండి సమీపములో ఏదైనా గ్రామం వుందేమోనని వెదికాడు. కానీ ఏమీ కనిపించలేదు. అంతకంతకూ చీకటి కమ్ముతున్నది. కొండ నుండి క్రిందికి దిగి వస్తుంటే కొంతదూరాన మిణుకు మిణుకు మంటూ ఒక వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు చూచుకొంటూ వెళ్ళేసరికి అక్కడొక గుడిసె వుంది.
గుడిసెలో ఎవరున్నారో చూద్దామని గుఱ్ఱందిగి రెండు అడుగులు వేశాడు. లోపల ఉంటున్న ఒక వృద్ధురాలు అతన్ని చూసి మహారాష్ట్ర సిపాయేమోనని భావించి ఆప్యాయతతో ఆదరించింది. అతడు అలసిపోయి ఉన్నాడని గ్రహించి, కాళ్ళు చేతులు కడుక్కోమని వేడి వేడి నీళ్ళు ఇచ్చింది. ఒక చాప పరచి “కాస్సేపు విశ్రమించు నాయనా!” అంది. అలసట తీర్చుకుని మళ్ళీ బయలుదేరుదామనుకొన్నాడు. అంతలోనే ఒక పళ్ళెంనిండా కుప్పగాపోసి జొన్నన్నం పెట్టుకొని వచ్చి ముందు పెట్టి “తిను నాయన” అంది. అప్పుడే వండి వార్చడంచేత అది చాలా వేడిగా ఉంది. శివాజీకి బాగా ఆకలి దహించుకుపోతూంది. ఆ అన్నం మధ్యలో పిడికెడు అన్నం తీయబోయాడు, పాపం చేయి కాలింది. చేయి విదిలించేసరికి చేతిలోని అన్నము చిందర వందరగా నేలమీద పడింది.
అది చూచిన ఆ వృద్ధురాలు ఒక నవ్వు నవ్వి “ఓ! నీకు కూడా నీ యజమాని శివాజీలా సహనం తక్కువ, ఆతృత ఎక్కువ!” అన్నది. నేలమీద పడిపోయిన అన్నాన్ని ఎత్తుతూ అనురాగంతో ఇలా అన్నది. “చూడు! అందుకనే నీ చేతులు కాలాయి, అన్నం పాడయ్యింది” అన్నది. శివాజీకి ఒకవైపున ఆనందం, మరొకవైపున ఆశ్చర్యం ముంచెత్తాయి. మాతృభావంతో అన్నమాట ఆయన్ని ముగ్ధుణ్ణి చేశాయి. “అమ్మా! మా యజమానికి ఆతృత ఎక్కువ, సహనం తక్కువని మీరెలా అనుకొంటున్నారు” అని దీనంగా అడిగాడు శివజీ.
ఆమె తన సహజమైన నిష్కపట ధోరణిలో యిలా అన్నది. “చూడు నాయనా! శివాజీ ముందు పెద్ద పెద్ద రాజ్యాల్ని జయించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన శత్రుకూటమిలోని చిన్నచిన్న కోటలన్నీ వదిలేస్తున్నాడు! నీవు చూడు తొందరపడి ఆ అన్నంకుప్ప మధ్యనున్న అన్నాన్ని అందుకోవడానికి చెయ్యి పెట్టి వేళ్ళు కాల్చుకొని అన్నం పాడుచేశావు! అట్లానే శివాజీ కూడా పెద్ద పెద్ద కోటలు పట్టుకొని శత్రు సంహారం చెయ్యడానికి పాపం అతనికి కష్టంగా ఉంది. ఎంతో ధైర్య సాహసాలు గల సైనికులను కూడా పోగొట్టుకుంటున్నాడు. మొదట నీవు పళ్ళెంచుట్టూ పల్చగా వున్న ప్రదేశంలో చల్లారిన అన్నం తినడం ప్రారంభించి, నెమ్మది నెమ్మదిగా కుప్ప మధ్యకు వస్తే చేతులు కాలివుండేవి కావు. అన్నం పాడయ్యేదికాదు. అలానే శివాజీ మొదట తన ప్రక్కల గల చిన్న చిన్న కోటలను జయించి, బలాన్ని సమీకరించుకోవాలి. అప్పుడు పెద్దకోటలను పట్టుకొంటే, ఎక్కువ సైన్యం నష్టపోదు. అతి తేలికగా జయించ వచ్చు” అన్నదామె.
ఆమెలోని విజ్ఞతను అర్థంచేసుకొన్నాడు శివాజీ. “ఆతృత లేకుండా కంగారు పడకుండా ప్రయత్నిస్తే, ప్రతి పని తప్పక విజయవంతమవుతుంది. ఏ పనిచేసినా బాగా ఆలోచించి ముందుగా ఆ పని ఎలా చెయ్యాలో ఒక పథకం వేసుకోని, నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కడుగు వేసుకొంటూ ముందుకు సాగితే, తప్పక ఆ కార్యాన్ని సాధించవచ్చు అని తెలుసుకున్నాడు.. ఆనాటి నుండి అతను ఆ విధంగా ఆచరించబట్టే గొప్ప మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు.
ప్రశ్నలు:
- ఆతురతపడితే అనర్థం ఏవిధంగా ఏర్పడుతుంది?
- ఆ వృద్ధురాలు అతనిని విమర్శించినపుడు శివాజీకి కోపం ఎందుకు రాలేదు?
- కంగారు పడడంవల్ల వచ్చిన నష్టాన్ని గూర్చి, నీ స్వానుభవాన్ని కాని, నీకు తెలిసిన మరెవరి గురించి కానీ వ్రాయి.