ఆచరణ లేని ప్రచారము వ్యర్ధము
మహర్షులు ఏమి ఆచరించెడివారో అదే మనకందించెడి వారు. అందుచేతనే వారి బోధనలలో మహత్తరమైన శక్తి ఉంటుంది. అట్టిశక్తి వల్ల మనకు శ్రేయస్సు కలుగుతుంది.
పరమ గురువైన శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులలో ఒకామె వుండేది. ఆమె చాలా నిరుపేద. ఒకరోజున ఆమె తన కొడుకును తీసుకొనివచ్చి “గురుదేవా! మా అబ్బాయి ప్రతిరోజూ మిఠాయిలు ఎక్కువగా తింటూ ఉంటాడు. అందువల్ల అతనికి అనారోగ్యము ఏర్పడింది. విపరీతమైన ఖరీదు అవడంచేత నేను ఆ ఖర్చు భరించలేకుండా వున్నాను. నేను చెప్పినది వినక పెడచెవిని పెడుతున్నాడు. భయాన, నయాన చెప్పి చూశాను. చివరకు విసుగెత్తి చాలా బాదాను. అయినా వాడు వినడం లేదు. మీరు దయవుంచి అతని చేత మిఠాయిలు తినడం మాన్పించి అతనిని ఆశీర్వదించండి”అని ప్రార్థించింది. అంతా వినిన రామకృష్ణులవారు, ఆ అబ్బాయి వంక ఒకసారి చూశారు. అతనితో ఏమీ మాట్లాడలేదు. కాసేపాగి “అమ్మా! ఒక 15 రోజులు పోయిన తరువాత ఇతనిని తీసుకొని మళ్ళీరా” అన్నారు.
ఒక పక్షం గడిచింది. ఆమె అతనిని తీసుకొని మళ్ళీ వచ్చింది. వచ్చి కూర్చోగానే రామకృష్ణుల వారు ప్రేమతో అతవి వంక చూచి, “ఏం నాయనా! ప్రతిరోజు మీ అమ్మను మిఠాయిలు తెమ్మని వేదిస్తున్నావట! నిజమేనా?” అని అడిగారు. అతను తలవంచుకోని, “అవునండి” అని మాట్లాడకుండా నిలబడ్డాడు. “చూడు నాయనా! నీవు చాలా తెలివైన వాడవు.ఆ మిఠాయిలు తినడం వల్ల నీ ఆరోగ్యం పాడయిపోతుంది. అందువల్ల నీ తల్లి చాలా ఇబ్బంది పడుతూంది. నీ గురించి చాలా బాధ పడుతున్నది. నీకోసం ప్రతిరోజు మిఠాయిలు కొనవలసివస్తే, నీకు పుస్తకాలు, కొత్త బట్టలు కొనడం ఎలా వీలవుతుంది. నీవు చేసేది తప్పా? కాదా?” అని ప్రశ్నించారు.
ఆ మాటలకు కుర్రవాని హృదయం కరిగింది. రామకృష్ణుల వారిని చూస్తూ “అవునండి” అని వూరుకున్నాడు. “అయితే ఈనాటి నుండే మీ అమ్మను మిఠాయిలు అడగటం మానెయ్యి. మానేస్తావా?” అని అనునయంగా అడిగారు. ఆ కుర్రవాడు నవ్వుతూ “మిఠాయి కోసం ఈనాటి నుండి మా అమ్మను ఇబ్బంది పెట్టను”అన్నాడు.అతని సమాధానానికి ఆనందంతో రామకృష్ణుల వారు అతనిని ఆలింగనం చేసుకుని “నీవు చాలా మంచి వాడవు నాయనా! నీకు మంచిదేదో, చెడ్డదేదో తెలుసు. నీవు సుఖంగా జీవించు”అని ఆశీర్వదించారు. ఇదంతా అక్కడ చేరిన భక్తులు ఆనందంగా వింటున్నారు.
ఆ కుర్రవాడు అక్కడ నుండి తోటలోకి వెళ్ళాడు. అతని తల్లి ఆనందంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ “గురుదేవా! ఈ సలహా చెప్పడానికి 15 రోజులు ఎందుకు తీసుకున్నారు” అని అడిగింది. రామకృష్ణుల వారు నవ్వుకొంటూ “చూడమ్మా! రెండు వారాల క్రితం మీరు వచ్చేసరికి, నేను అప్పుడప్పుడూ భక్తులు తెచ్చే మిఠాయిలు తింటూ ఉండేవాణ్ణి. అటువంటప్పుడు తినవద్దని నేను ఎలా చెప్పగలను? నేను ప్రతిరోజు మిఠాయిలు తింటూ అతన్ని తినవద్దని చెప్పటం సమంజసం కాదు. అందుచేత నేను ఆ రోజు నుంచీ తీపి పదార్ధాలు తినడం మానేశాను. అదే నీ కొడుకుని మాని వెయ్యమని చెప్పడానికి తగిన శక్తిని ఇచ్చింది. తాను ఆచరిస్తు ఇతరులకు చెపితే చెప్పడానికి సార్ధకత ఉంటుంది. వినే వారికి దానిని ఆచరించడానికి ఆసక్తి ఏర్పడుతుంది. అందుకే ఈరోజు నేను చేస్తున్నది మాత్రమే చెప్పాను”. అక్కడ ఉన్న భక్తులంతా తాము కూడా ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకున్నామని ఆనందించారు.
ప్రశ్నలు:
- రామకృష్ణులు తీపి తినడం మానెయ్యమని ఆ కుర్రవానికి వెంటనే చెప్పకుండా రెండు వారాల తర్వాత ఎందుకు రమ్మన్నారు?
- తాను ఆచరించకుండా ఇతరులకు చెప్పినందువల్ల వచ్చేదేమిటి?