శాంతియే తృప్తి
ఒకానొకప్పుడు గౌతమబుద్ధుడు అడవి మార్గాన ఒక పట్టణానికి వెళ్తున్నాడు. అతనికి దారిలో ఒక చల్లని నీటి ప్రవాహం కనిపించింది. దానిలో కాళ్లు,చేతులు కడుక్కొని ప్రక్కనున్న ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానంలో నిమగ్నుడయ్యాడు.
అదే దారిన ఆ దేశపు రాజు గుఱ్ఱం మీద వెళ్తున్నాడు. అతనికి తన రాజ్యాన్ని విస్తరింప చెయ్యాలనే వ్యామోహం చాలా ఉంది. అందుచేత అతనెప్పుడూ భయాందోళనలచేత, అసూయ చేత అలమటించేవాడు. చెట్టుకింద ధ్యానం చేసుకొంటున్న బుద్ధుని చూసి, “యీ సన్యాసులు పనిపాట లేకుండా కళ్ళుమూసుకుని కూర్చుని, కాలాన్ని వ్యర్థంచేస్తూ, కాయాన్ని పెంచుకుంటారు” అని తనలోతాను అనుకొని ఉగ్రుడై గుఱ్ఱం దిగి బుద్ధుని సమీపించాడు.”ఏయ్ సన్యాసీ! ఇక్కడెవరున్నారో కళ్ళు తెరచి చూడు. ఈ దేశానికి రాజునైన నేను క్షణంకూడా ఖాళీగా కూర్చోను. బుద్ధి లేని మీలాంటి సన్యాసులు మాత్రం సంసారులు పెట్టిన తిండి తిని నీతుల పేరుతో వాళ్లని కూడా బద్ధకస్తులుగా తయారుచేసి సన్యాసం ఇప్పిస్తున్నారు” అంటూ గట్టిగా తిట్టి, తిట్టి నోరార్చుకొని అలసిపోయాడు.
గౌతముడు ఆ తిట్లన్నీ విని కళ్ళు విప్పి చిరునవ్వుతో యిలా అన్నాడు. “కూర్చో నాయనా!నీవు చాలా అలసిపోయావు. దాహంకూడా వేస్తున్నట్టుంది. చల్లటి నీరు ఉంది. కొంచెం తెచ్చి ఇస్తాను” అని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. గౌతముడంతటి ప్రేమతో మాట్లాడుతూ ఉంటే ఆ రాజు ఆశ్చర్యపోయాడు.
“నేను అంత కఠినంగా తిడితే ఈయన ఇంత ప్రేమగా పలుకరిస్తున్నాడు. ఇతనికి నేనే విధంగా క్షమాపణ చెప్పుకోవాలి? ఇతడే సకల సౌఖ్యాలను వదలుకొని వచ్చిన సిద్ధార్థుడై ఉండాలి. ఇతడు నిజంగా మహా జ్ఞాని” అని అనుకుంటూ అప్రయత్నంగా గౌతముని కాళ్ళమీద పడ్డాడు. నోరు జారి నందుకు క్షమించమని ప్రార్ధించాడు. కొంత సేపాగి ‘నాకొక విషయం చెప్పండి! మిమ్మల్ని నేనెంత కఠోరంగా తిట్టినప్పటికీ, నాపై యెంతో దయచూపించి అనురాగంతో ఆదరిస్తున్నారు. ఇంతటి నిగ్రహాన్ని ఎలా సంపాదించగలిగారు?’ అని ప్రశ్నించాడు.
అతని పశ్చాత్తాపానికి బుద్ధుడు ఎంతో ఆనందించి “విను నాయనా! నీవొక పళ్ళెము నిండా మంచి మిఠాయిలు తెచ్చి యెవరికన్నా యివ్వబోతే వారు పుచ్చుకోలేదనుకో! ఏం చేస్తావు?”ఆవి అడిగాడు. తడుముకోకుండా ఆ రాజు “తెచ్చినవారే పట్టుకు పోతారు” అన్నాడు. వెంటనే బుద్ధుడు “మరి, నీవు అన్నవి అన్నీ నేను అందుకోలేదు కదా! నన్ను అవి ఏ విధంగా బాధించగలవు?” అని అడిగాడు.
ఆది విన్న రాజు ఇతడు నిస్సందేహంగా బుద్ధుడయి ఉంటాడు అని భావించాడు. తలవంచి వినమ్రుడై నమస్కరించి’ “స్వామీ! అసలైన ఆనందం అందుకోవడానికి నాకు మార్గాన్ని బోధించండి” అని వేడుకొన్నాడు. బుద్ధుని కళ్ళనుండి దేదీప్యమానమైన వెలుగు ప్రసరించింది. ఆ రాజు అతని వంక నివ్వెరపోతూ చూస్తూవుంటే బద్ధుడిలా అన్నాడు “కోపము, ఆశ, ఆసూయ, భయము మొదలైన దుర్గుణములు మానవుని లోని మహోన్నత శక్తులను కొల్లగొట్టి అశాంతికి గురి చేస్తాయి”.
“సంతృప్తి, శాంతి, ప్రేమలు జీవితానికి ఆనందాన్ని అందిస్తాయి. సంతృప్తి, శాంతము లేనివాడు నిత్యదరిద్రుడు. ముష్టివాని కన్నా హీనుడు.తోటివారితో ప్రేమతో సహకరించ లేని జీవితం నిరర్థకము. దొరికిన దానితో సంతృప్తి చెందేవాడు సకలైశ్వర్య సంపన్నుడు. అతడే శాంతి సౌఖ్యాలతో తులతూగ గలడు. ప్రతివానికి ప్రేమ పంచిపెట్టేవాడు ప్రపంచానికి అధినేత. అతనికి అందరూ మిత్రులే. అట్టి వాడే అసలైన ఆనందాన్ని అందుకొన గలడు” అని బోధించాడు.
రాజు హృదయంలో రాజ్య కాంక్ష నశించింది. క్రోధం తగ్గింది, శౌర్యం పోయింది. బుద్ధునికి పాదాక్రాంతుడై “నన్ను నీ శిష్యునిగా స్వీకరించు. నేటినుంచి నీవే నా గురువు, దైవము, సర్వస్వము. నాకు సరియైన మార్గాన్ని చూపించి నన్ను నడిపించు” అని ప్రార్థించాడు.
ప్రశ్నలు
- గౌతమబుద్ధుని చూసి రాజు కెందుకు కోపం వచ్చింది? అతడు బుద్ధుడిని తిట్టడం సరియైనదేనా, కాదా? సహేతుకంగా వ్రాయుము?
- రాజు కోపోద్రిక్తుడై, కఠినంగా తిడుతున్నప్పటికీ, బుద్ధుడెలా నిశ్చలంగా, నిర్మలంగా వుండగలిగాడు?
- రాజుకు బుద్ధుడిచ్చిన సలహా ఏమి?