ధర్మరాజు
పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు ధర్మానికి ప్రతిరూపం అనిపించుకున్నాడు. ఇతని ధర్మబుద్ధిని ఎత్తిచూపే సంఘటనలు మహాభారతంలో ఎన్నో ఉన్నాయి. కాని వాటన్నిటిలో సాక్షాత్తు యమధర్మరాజు పెట్టిన పరీక్ష కే నిలబడిన ఘట్టము చాలా ప్రధానమైనది.
అరణ్యవాసంలో పాండవులు ఒకనాడు అడవిలో తిరుగుతూ ఉండగా వారికి విపరీతమైన దప్పిక వేసింది. అందరిలోకి చిన్నవాడైన సహదేవుడు ఒక చెట్టు ఎక్కి దూరాన ఒక మడుగును చూశాడు. అన్నలను అక్కడే ఉండమని చెప్పి తాను చూచిన మడుగువైపు వెళ్ళాడు. మడుగులో నీటిని చూచి, దిగి నీరు త్రాగి దప్పిక తీర్చుకొని తర్వాత తన సోదరులకు ఒక పాత్రలో తీసుకొని పోదామనుకున్నాడు. కాని మడుగులో దిగబోయే ముందు ఒక కంఠ ధ్వని వినపడింది.
“ఆగు నేను ఒక యక్షుణ్ణి. ఈ మడుగును కాపలా కాస్తున్నాను. నీవు నా ప్రశ్నలకు సమాధానము చెప్పనిదే ఈ మడుగులో దిగగూడదు.” సహదేవుడు దీన్ని లక్ష్య పెట్టక ఒక్క గ్రుక్కెడు నీళ్ళు త్రాగాడు. వెంటనే మత్తుగా క్రిందపడి ప్రాణాలు కోల్పోయాడు. కొంతసేపటికి తమ్ముణ్ణి వెదుకుతూ నకులుడు వచ్చాడు. అతడు కూడా అదేవిధంగా మరణించాడు. అర్జునుడు, భీముడు కూడా ఇట్లే ప్రాణాలు కోల్పోయారు. చివరకు యుధిష్ఠిరుడు మడుగు వద్దకు చేరాడు. చచ్చిపడిఉన్న తన సోదరులను చూచి దిగ్భ్రమ చెందాడు. నెమ్మదిగా మడుగులోకి దిగబోయాడు. యక్షుని కంఠస్వరం నుండి అవే మాటలు వినిపించాయి. ధర్మజుడు సమాధానాలు చెప్పడానికి సన్నద్ధుడై నిలబడ్డాడు.
ప్రశ్న : మానవుని ఆపదలో రక్షించేది ఏది?
జవాబు : ధైర్యము.
ప్ర : ఏ శాస్త్రాన్ని చదివి మానవుడు వివేకవంతుకు అవుతాడు?
జ: శాస్త్రజ్ఞానంవల్ల వివేకం రాదు. సజ్జన సాంగత్యం వలన వివేకం వస్తుంది.
ప్ర: భూమికన్నా ఉదార మైనది, నిలకడ కలది ఏది? జ : పిల్లలను ప్రేమతో పెంచే తల్లి భూమికంటే ఉదార మైనది, నిలకడ కలది.
ప్ర: గాలికన్నా వేగంగా వెళ్ళేది ఏది?
జ : మనస్సు
ప్ర: దేశాటనము చేసేవానికి తోడు ఏది?
జ: అతని విద్య.
ప్ర: ఏది ఆనందము!
జ: తన సత్ప్రవర్తనవల్ల వచ్చు ఫలితమే ఆనందము.
ప్ర: ఎప్పుడు మానవుని అందరు ప్రేమిస్తారు?
జ: తన అహంకారాన్ని వదలుకున్నప్పుడు.
ప్ర: వదులుకున్నా దుఃఖము కలుగచేయక ఆ సుఖమిచ్చేది ఏది?
జ : కోపము.
ప్ర: దేన్ని వదలితే మానవునికి సంపద పెరుగుతుంది?
జ : కోరిక.
ప్ర: ప్రపంచంలో అన్నింటికన్నా వింత అయినది ఏది?
జ : ప్రతి నిత్యము ఎందరో మరణిస్తున్నారు కాని బ్రతికి ఉన్న వారు ఎప్పటికి జీవించాలనే అను కొంటారు. రేపు చావుకు సిద్ధమయే మానవుడు, ఈనాడు మరణించిన వాడికోసం రోదిస్తున్నాడు, ఇంతకన్నా ప్రపంచంలో వింత ఏముంది?
ఈ జవాబులు విని యక్షుడెంతో సంతోషించాడు ·
ధర్మరాజును వరమేదైనా కోరుకోమన్నాడు. చనిపోయిన తమ్ములలో ఒకరిని బ్రతికిస్తాను ఎవరు కావాలో కోరుకోమన్నాడు. ధర్మరాజు నకులుని బ్రతికించమని కోరాడు యక్షుడు ఆశ్చర్యపడి కారణమడిగాడు. “అయ్యా! మా తండ్రికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుంతీ దేవికి నేనున్నాను- రెండవ భార్య కుమారులలో ఒకడైనా ఉంటే అది న్యాయమని భావిస్తాను” అన్నాడు. అతని ధర్మబుద్ధికి యక్షుడు సంతోషించి తన స్వరూపం విడిచి యమధర్మరాజు ప్రత్యక్షమైనాడు. మరణించిన పాండవులను బ్రతికించి, వారిని ఆశీర్వదించి అంతర్ధానమైనాడు.
ప్రశ్నలు:
- పాండవులు నీటి మడుగువద్ద ఎందుకు మరణించారు?
- ధర్మరాజు చూపిన ధర్మబుద్ధి ఏది?
- ధర్మరాజు నకులుడుని ఎందుకు కోరాడు