మహావీర జయంతి
మహావీర జయంతిని మహావీర జన్మ కళ్యాణం అని కూడా అంటారు. ఇతడు క్రీ.పూ. 599 సంవత్సరంలో చైత్ర మాసమున జన్మించెను. వైశాలీ రాజ్యమునేలు త్రిశాలా, సిద్ధార్ధులను క్షత్రియ రాజదంపతులకు కుండలపురము నందు జన్మించెను. జైన మతము ఒక మత స్థాయికి సమర్ధవంతంగా పెంపొందింప చేసినవాడు వర్ధమానుడు. ‘వర్ధమాన’ అనగా అభివృద్ధి చెందు వాడు అని అర్థం. అతను పుట్టినప్పుడు రాజ్యము అన్ని విధాల అభివృద్ధి గాంచెనట. త్రిశాల గర్భవతిగా నున్నప్పుడు ఆమెకు అనేక రకముల కలలు వచ్చెడివట. వాటిని విచారించి జ్యోతిష్కులు పుట్టబోయే శిశువు గొప్ప చక్రవర్తి కావచ్చు లేదా గొప్ప తీర్థంకరుడైనా కావచ్చునని చెప్పిరి. తీర్థంకరుడు అనగా “సంసార సాగరమును దాటుటకు తెప్పను సమకూర్చువాడు” అని అర్థము. ఆ తెప్పయే ధర్మము. వర్ధమానుడు ‘జినుడు’ అనియు పిలువబడు చుండెను. జినుడనగా జయించిన వాడని అర్థం. భూ తలముపై రాజ్యములనేగాక ఆధ్యాత్మిక సామ్రాజ్యములను గూడ జయించిన వాడు. ప్రాపంచిక విషయములను, ఇంద్రియములను, ఆత్మను జయించినవాడే జినుడు.
మహావీరుడు తన ముప్పదివ యేట రాజ ప్రసాదము, ప్రాపంచిక సుఖము లందు విముఖుడై సన్యసించి కఠోర క్రమశిక్షణతో పన్నెండు సంవత్సరములు నియమబద్ద జీవితము సాగించెను. తరువాత అతనికి జ్ఞానోదయ మయ్యెను. తరువాత అతను దుఃఖహేతువులను, దుఃఖ నివారణ మార్గమును కనుగొనెను. దానిని తన జిన ధర్మ మార్గమునందు స్థాపించి, ఆ ధర్మమును ముప్పది యేండ్లు ప్రజలకు బోధించెను. మహావీరుడు తన డెబ్బది రెండవ ఏట బీహారులోని “పవపురి” లో నిర్వాణమును పొందెను. ఇతడు బలమైన జైన సమాజమును నిర్మించెను.
ఇతని జన్మ దినమును జైనులు గొప్పగా చేసుకుంటారు. ఈ రోజున వర్తమాన మహావీరుని విగ్రహాన్ని రథముపై ఊరేగిస్తారు. ఈ రథయాత్ర సాగుతున్నంత సేపు భజనలు చేస్తు సాగుతారు. స్థానికంగా గుడులలో ఉన్న విగ్రహాలకు అభిషేకాలు చేస్తారు. ప్రముఖ వక్తలు వర్తమానుని గురించి, ఆ మత ప్రాశస్త్యము గూర్చి ఉపన్యాసము లిచ్చెదరు. జైన మతస్థులు గుడులకెళ్ళి ధ్యానము, ప్రార్థనలు చేయుదురు. కొందరు సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహించెదరు. గో సంరక్షణ, బీదలకి అన్నదానం లాంటి ఇతరత్రా సేవా కార్యక్రమాలకు నిధులు సేకరిస్తారు.
జైనమత ధర్మములు : భగవంతుని యందలి విశ్వాసము కంటెను, దేవుడున్నాడా యను మీమాంస కంటెను అధికముగా నైతికమైన ఉత్తమ ప్రవర్తనమునకు అత్యంత ప్రాముఖ్యత నిచ్చినదీ మతము.
జైన ధర్మములు
1. అహింస: జైనుల నీతి నియమములకు అహింస పునాది వంటిది. అహింస యనగా జీవులకెట్టి బాధ కలిగించకుండ నుండుటయే కాదు. జీవులపట్ల ప్రత్యక్షముగా దయాదాక్షిణ్యములను ప్రకటించుట. అహింసా మార్గము ననుసరించిన పునర్జన్మ ఉండదు.
2. సత్యము: సర్వకాల సర్వావస్థల యందు నిజమును మాట్లాడుటయే సత్యము.
3. ఆస్తేయము: దొంగిలించకుండుట. దొంగతనము చేయవలయునని భావించుటయు మహాపాపము.
4. అపరిగ్రహము: ఇతరుల నుండి ఏమియు గ్రహింపకుండుట. ప్రాణము పోకుండ శరీరమును పోషించుకొనుటకు మాత్రము తగినంత ఇతరుల నుండి గ్రహింప వచ్చును.
5. బ్రహ్మచర్యము: ఇంద్రియ నిగ్రహము, వివాహమాడకుండుట బ్రహ్మచర్య మనబడును. మనోవాక్కాయ కర్మలయందు పవిత్రతయే బ్రహ్మచర్య లక్షణము. ఈ ఐదు వ్రతములను నియమ నిష్ఠలతో ఆచరించినచో కర్మబద్ధులు కారు. ఇట్టి వారిని పరమేష్ఠులందురు.
నిర్వాణము: నిర్వాణమనగా అత్యంత పవిత్రము, సుందరము, ఆనంద రూపము అయిన జీవస్థితికి చేరుకొనుటకు ఎత్తెడి కొత్త జన్మ. అట్టి స్థితి ఆశా బంధముల నుండి, కర్మ సంగముల నుండి విముక్తమైనది. అది అత్యంత ప్రశాంత నివృత్తి స్థితి.