గీతాంజలి
లక్ష్యము:
పిల్లలు నేర్చుకున్న గీతా శ్లోకాలను గుర్తుకు తెచ్చుకుని, జ్ఞాపకశక్తికి పదునుపెట్టే తమాషా ఆట.
సంబంధిత విలువలు:
- ఉత్సుకత
- గమనించుట
- ఏకాగ్రత
- జ్ఞాపక శక్తి
- ఓర్పు
- ఖచ్చితత్త్వము
- ఆత్మ సంతృప్తి
కావాల్సిన సామాగ్రి:
- అట్ట
- రంగుల పెన్నులు / స్కెచ్ పెన్స్
గురువు ముందస్తు తయారీ:
- గురువు పది భగవద్గీత శ్లోకాలను గుర్తించాలి.
- చిన్న కార్డ్స్ ఒక 20 (పేక ముక్క పరిమాణం లో) కత్తిరించుకోవాలి.
- 10 నీలిరంగు, 10 గులాబీ రంగు కార్డ్స్ చెయ్యాలి.
- నీలి కార్డ్స్ మీద ఎంచుకొన్న 10 శ్లోకాల మొదటి పంక్తిని, గులాబీ కార్డ్స్ లో రెండవ పంక్తులను రాయాలి.
- కార్డ్స్ వెనకాల స్వామి వారి బొమ్మ ను అతికించాలి.
- కార్డ్స్ అందంగా, కళగా ఉండాలి. (స్వామి వారి పాకెట్ సైజు క్యాలెండరు వెనక వైపు రాయొచ్చు)
- ఇలా కార్డ్స్ తయారు చేసుకోవాలి.
ఎలా ఆడాలి
- గురువు కార్డ్స్ బాగా కలపాలి.
- రంగు తో సంబంధం లేకుండా ఐదేసి కార్డ్స్ నాలుగు వరుసలుగా పేర్చాలి.
- కార్డ్స్ ని బోర్లా ఉంచాలి శ్లోకం పంక్తి కనపడకుండా.
- ఒకసారి నలుగురు పిల్లలు ఆడవచ్చు.
- మొదటి చిన్నారి ఒక నీలం మరియు ఒక గులాబీ కార్డు తీసి పంక్తులు ఒకే శ్లోకానివా, కాదా అని పరిశీలించాలి.
- అవి ఒకే శ్లోకానివైతే, చదివి తన దగ్గరే పెట్టుకుంటాడు. అతను మళ్ళీ ఆడవచ్చు.
- అలా ఒకే శ్లోకం రాకపోతే కార్డ్స్ పిల్లలందరికీ చూపించి మళ్ళీ యధా స్థానం లో పెట్టాలి.
- తర్వాత చిన్నారి మరో రెండు కార్డ్స్…అలాగే అన్ని శ్లోకాలు అయిపోయేవరకూ ఆడవచ్చు.
మార్పులు, చేర్పులు:
- గీతా శ్లోకాలు, అర్ధాలు కూడా ఇవ్వవచ్చు.
- శ్లోకంలో మొదటి పదం, చివరి పదం తో కూడా ఆడవచ్చు.
గురువులకు సూచనలు:
పిల్లల స్థాయిని బట్టి, time ను బట్టి ఎన్ని గీతా శ్లోకాల తో అయినా ఆడవచ్చు.