నాగమహాశయుడు
అహింసా తత్వాన్నికి నాగమహాశయుడు మానవరూపమని చెప్పవచ్చు. అహింసను మించిన సద్గుణము లేదని తన జీవితం ద్వారా నిరూపించినవాడు నాగమహాశయుడు.
ప్రాణులు ఏవయినా సరే బాధపడడం చూడలేక పోయేవాడు నాగమహాశయుడు. ఆయన ఇంటి ప్రక్కనే ఒక నీటి మడుగు ఉండేది. వర్షాకాలంలో చేపలు వచ్చి చేరేవి. చేపలుపట్టే వాడొకడు ఒకనాడు ఆమడుగులో చేపలు పట్టి అక్కడి ఆచారం ప్రకారం ఊర్లో ఉన్న పెద్దలతోబాటు నాగ మహాశయునికి కూడా అతని వంతుగా చేపలు కొన్ని ఇచ్చాడు. బుట్టలో పడవేసిన ఆ చేపలు ప్రాణభయంతో గిలగిల లాడడం చూచి ఆయన సహించలేక పోయాడు. వెంటనే కొంత డబ్బు ఇచ్చి ఆ చేపల వాడివద్ద ఉండే చేపలతో సహా అన్ని చేపలను కొనేశాడు. వాటినన్నిటినీ మళ్ళీ నీటిలో వదిలేశాడు.
అదే విధంగా మరొక రోజు జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత చేపలు పట్టేవాడెవడూ మళ్ళీ ఆ వూరికి రాలేదు. అహింసా తత్వాన్ని ఆచరించడంలో ఆయన ఎంత కఠినంగా వ్యవహరించే వారంటే విష సర్పాలను కూడా చంప నిచ్చేవాడు కాదు. ఒకసారి ఆయన ఇంటి ఆవరణలో ఒక తాచుపాము కనపడింది. అందరూ భయంతో అటు ఇటు తిరుగుతున్నారు. ఆయన భార్య “దాన్ని వెంటనే చంపండి!” అని అరిచింది. కాని నాగమహాశయుడు ఒప్పుకోలేదు.
“మానవుణ్ణి చంపేది బయటి పాములోని విషము కాదు. అతని మనస్సులో ఉండే విషమే అతనిని కాటు వేస్తుంది.” అని ఆయన అనేవారు. ఆ విధంగా చెప్పి ఆయన అక్కడ మోకరిల్లి పామును ఉద్దేశించి “స్వామీ మీరు దైవ స్వరూపమైన మానసాదేవి, మీ నివాసము అరణ్యము. దయచేసి ఈ ప్రాంతాన్ని వదిలి పెట్టి మీ నివాసానికి వెళ్ళమని ప్రార్ధిస్తున్నాను” అని వేడుకున్నాడు. ఆశ్చర్యము! ఆ త్రాచుపాము పడగను దించుకొని ఆ చోటును వదలి అడవి వైపు వెళ్ళిపోయింది.
నాగమహాశయుడు “నీ మనస్సు యొక్క ప్రతి రూపమే బయటి ప్రపంచము. నీవు ఆ ప్రపంచానికి ఏమి ఇస్తావో అదే దాని నుండి నీవు తిరిగి పొందుతావు. అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూచినట్లే ఇది జరుగుతుంది. నీ ముఖంలో ఎట్టి ప్రశాంతత, వికారాలు ఉన్నాయో అవే కదా అద్దంలో కనుపించేది?” అనేవాడు.
ప్రశ్నలు:
- నాగమహాశయుడు ఆచరించిన అహింసాత్వానికి రెండు ఉదాహరణలు వ్రాయుము.
- నాగమహాశయుని సిద్ధాంత మేమి?