Saint Kabir
ముస్లిములకు ఆనాడు పర్వదినము. కబీరు పిన తండ్రి గొప్ప విందు ఏర్పాటుచేసి బంధుమిత్రు లందరినీ పిలిచాడు. కాని కబీరును పిలవలేదు. తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చిన కబీరు ఈ విందును చూచాడు. అనేక మంది ముస్లిములు, కాజీలు, మౌల్విలు, ధనవంతులు ఆ విందులో పాల్గొంటున్నారు.
హఠాత్తుగా కబీరు దృష్టి ఒక స్తంభానికి కట్టబడిన దూడ మీద పడింది. స్తంభాన్ని తోరణాలతో, పూలతో అందంగా అలంకరించారు. దూడకు మెడలో దండ వేశారు. ఒక డజను మంది దాని చుట్టూ చేరి ఏవో మంత్రాలు చదువుతున్నారు. ఒకడి చేతిలో తళతళలాడే కత్తి మెరుస్తోంది.
పాపం దూడ బేలగా చూస్తున్నది. కబీరుకు అంతా అర్ధమయింది. కొంచెం సేపట్లో ఆ దూడను దేవునికి బలి ఇవ్వబోతున్నారు. కబీరు తటాలున అడ్డంగా పరుగెత్తి “అయ్యా! ఈ తతంగం ఆపండి. నోరులేని ఈ జీవాన్ని చంపవద్దు” అని అరిచాడు.
అక్కడ ఉన్నవారు కోపంతో అతనివైపు తిరిగి “నోరు మూసుకో, అల్లా కోసం ఇవన్నీ చేస్తున్నామని తెలియదా? మహమ్మదుకు విరుద్ధంగా మాట్లాడుతావా?” అని అన్నారు.
“లేదు, లేదు,కాని ఒక్క విషయం చెప్పనీయండి. మిమ్మల్ని, ఈ స్త్రీలను, బిడ్డలను పుట్టించింది ఎవరు? అల్లా అని మీకు తెలుసుగా?” కబీరు అన్నాడు.
“ఇటువంటి చచ్చు ప్రశ్నలు వేయవద్దు” అన్నారు అందరూ.
కబీరు “మరి దూడను సృష్టించింది ఎవరు? మీరు చెప్పండి”.
“ఆయనే” అన్నారు అందరు.
“అయితే దీనిని ఎందుకు చంపుతున్నారు?”
“సృష్టిలో అందమైన వాటిని భగవంతుని కోసం ఉపయోగించాలి. అందుకని అందమైన ఈ దూడను భగవంతునికి అర్పిస్తున్నాము. అందులో తప్పేముంది?”
“మీరు చెప్పింది బాగుంది. కాని భగవంతుడు అందమైనవాటిని సద్వినియోగం చేయమన్నాడు గాని నాశనం చేయమనలేదే! ఈ దూడ మీకేమి అపకారం చేసింది? దాన్ని వదిలేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను.”
కాని చాలామంది ముస్లిములు ఒప్పుకోలేదు. “ఆవునుండి పాలు తీస్తాము, దాన్ని తాగవచ్చా మరి?” అని ఒక వృద్ధుడు వాదించాడు.
“తల్లులవద్ద పిల్లలు పాలు త్రాగినట్లు, మనము ఆవులను తల్లులుగా భావించుకొని ఆవు ఇచ్చిన పాలు త్రాగుతున్నాము”.
ముస్లిములకెవ్వరికి నోట మాట రాలేదు. అందరు మంచివారే కానీ, వారికి ఇంతవరకు దేవునికి జంతువులను బలి ఇవ్వడం తప్పని తోచలేదు. కబీరు బోధించిన అహింసా తత్వాన్ని వారు గ్రహించారు. దూడను వదిలేశారు. పాపం చాలామందికి వారు అనుకున్న విందు భోజనం లభించలేదు. నిరాశగా తిరిగి వెళ్ళిపోయారు. కొందరు కబీరును తిట్టు కున్నారు.
కాజీలను, మౌల్వీలను గూడా ఈ విధంగా జయించిన తమ పుత్రుణ్ణి, కబీరు తల్లిదండ్రులు మెచ్చుకున్నారు.
ప్రశ్నలు:
- తన పిన తండ్రి ఇంటిలో కబీరు ఏమి చూచాడు?
- కబీరు మొదట తన పినతండ్రి ఇంటిలో ఏమి మాట్లాడాడు?
- దానికి వారి సమాధానమేమి?
- కబీరు ముస్లింలను అహింసా సిద్ధాంతమునకు ఎలా ఒప్పించాడు?