కష్టాలలో తోటివారికి సహాయము
ఒకనాడు సాయంత్రం ఒక వీధిలో చూపులేని వృద్ధుడు చేతిలో ఒక వాయిద్యం వాయించుతూ పాడుకుంటూ పోతున్నాడు. ఒకప్పుడు అతడు మంచి పాటగాడు, వాయిద్యం కూడా బాగా వాయించేవాడు. కాని ఇప్పుడు వయస్సు మీరింది, గ్రుడ్డివాడైనాడు. తిండిగడవడం గూడా కష్టంగా ఉంది. వీధిలో నడచిపోతూ కాలుజారి క్రింద పడ్డాడు. ఆ దారిన పోతున్న ముగ్గురు బాలురు క్రింద పడిన వాడిని చూచి అతన్ని లేవదీసి కూర్చోపెట్టారు.
ఒక బాలుడు “ఇతన్ని ఇంటికి తీసుకొని వెళదామా?”
రెండవవాడు “అది మంచిపనే కాని దాని వల్ల ఈ సమస్య తీరదు.”
మూడవవాడు “మనం ఏదో కొంత త్యాగం చేసి ఈ వృద్ధుడికి సేవ చేయాలి”
మొదటి బాలుడు “అయితే ఏదో ఒకటి మొదలు పెట్టు మేమూ సాయం చేస్తాం” అన్నాడు.
రెండవ బాలుడు కింద పడిఉన్న వాయిద్యాన్ని తీసి వాయించడం మొదలు పెట్టాడు. మూడవవాడు పాడడం ప్రారంభించాడు. పాట, వాయిద్యం విని జనం ప్రోగయ్యారు. బాలురు ఇంకా ఉత్సాహంగా పాడడం, వాయించడం చేస్తున్నారు. చుట్టూ చేరిన జనం తలా ఒక నాణెం విసిరి వెళ్లి పోతున్నారు. ఇలా ఒక గంట అక్కడ జరిగిన తర్వాత, పోగైన డబ్బును ఒక బాలుడు లెక్క పెట్టి వృద్ధుడికి ఇచ్చాడు. కృతజ్ఞతతో చెమర్చిన కళ్ళతో వృద్ధుడు అన్నాడు “నాయనలారా! నాకు చేసిన సహాయం చాలా గొప్పది. నేను ఎన్నడూ మరువలేను. ఇంతకు మీ పేర్లు ఏమిటో చెప్పండి అన్నాడు.
మొదటివాడు “నా పేరు విశ్వాసము”, రెండవవాడు “నా పేరు ఆశ” మూడవవాడు “నా పేరు ప్రేమ” అని “తాతా మేము సెలవు తీసుకుంటాము” అని వెళ్ళి పోయారు.
ముసలివానికి, అర్థం అయింది. “తాను విశ్వాసము, ఆశ, ప్రేమ ఈ మూడింటికి దూరమయ్యాడు గదా! ఈ పిల్లలు ఈ విధంగా ఆ మూడింటిని తనకు చూపి వెళ్ళారు.”
ప్రశ్నలు:
- బాలురు వృద్ధుణ్ణి తమ ఇంటికి ఎందుకు తీసుకొని పోలేదు? వెంటనే ఎందుకు డబ్బులిచ్చి సాయ పడ లేదు?
- వారు ఏ విధంగా అతనికి సహాయం చేశారు?
- ప్రతి మానవునిలో ఉండవలసిన మూడు లక్షణము లేవి?